నేడు నెల్లూరు

Thursday, April 1, 2010

నగరం లో మేయరమ్మ భానుశ్రీ


తన భర్త, ట్రాన్స్‌కో డిఇఇ నందిమండలం శివ సుబ్బరాజు ఎసిబి కేసులో ఇరుక్కున్న నేపధ్యంలో ఆయన బెయిల్ ప్రయత్నాల్లో తలమునలైన మేయర్ భానుశ్రీ ఇరవై రోజుల తరువాత నగరానికి తిరిగి రావడంతో రాజకీయ హడావుడి నెలకొంది. ఇరవై రోజుల క్రితం ఆమె భర్త ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఎసిబి దాడులకు గురై అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎసిబి కోర్టు ఆయనకు రిమాండ్ విధించి చర్లపల్లి జైలుకు పంపింది. ఆయన విడుదల కోసం మేయర్ భానుశ్రీతో సహా ఆనం సోదరులు గట్టి ప్రయత్నమే చేశారు. వారి ప్రయత్నాలు పక్షం రోజుల తరువాత ఫలించాయి. అయితే ఇరవై రోజుల్లోనూ నగరంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. నగర మేయర్‌గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా వ్యవహరించారని విపక్షాలు విరుచుకుపడటమేగాకుండా ప్రదర్శనలకు దిగాయి. సిపిఎం ఒకడుగు ముందుకేసి మేయర్ బాధ్యతలను డిప్యూటీ మేయర్‌కు బదలాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించింది. ఇదిలాఉండగా మేయర్ నెల్లూరుకు తిరిగివచ్చిన సందర్భంగా ఆనం వర్గానికి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇరవై రోజులుగా స్థబ్ధుగా ఉన్న కాంగ్రెస్ రాజకీయాలకు మళ్లీ ఊపువచ్చినట్లైంది. మేయర్‌ను పరామర్శించడానికి సిద్ధమైన కొందరు అధికారులు హడావుడిగా ఆమె ఇంటికి బయలుదేరారు. ఇరవై రోజులుగా మేయర్ ప్రస్తావన లేకుండా పని చేస్తున్న అధికారుల్లో బుధవారం కదలిక కనిపించింది. అయితే మేయర్ మాత్రం తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో గంభీరంగా వ్యవహరించారు. భవిష్యత్ రాజకీయ ప్రణాళిక రూపొందించుకోవడంలో ఆమె నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇరవై రోజులుగా నగరానికి దూరమైన నేపధ్యంలో చోటుచేసుకున్న పరిణామాలను ఆమె సమీక్షించారు. వీటిపై ఆనం సోదరుల స్పందనను బట్టి ప్రణాళిక అమలు చేయాలని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశం జరగకుంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కార్పోరేషన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుందని తెలిసి కూడా తన కుటుంబ సమస్యల పరిష్కారానికి పరిమితమై నిర్లక్ష్యం చేయడం పట్ల సిపిఎం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలు స్తంభించిపోయేలా మేయర్ వ్యవహరించిన తీరు గర్హనీయమని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.

No comments: