నేడు నెల్లూరు

Wednesday, April 7, 2010

నగర వాసులకు రోజుకు ఒక్కొక్క కుటుంబానికి 105 లీటర్ల నీరు : మంత్రి


నెల్లూరు నగర వాసులకు రోజుకు ఒక్కొక్క కుటుంబానికి 105 లీటర్ల నీటిని అందజేస్తున్నామని, త్వరలో 130 లీటర్ల నీటిని అందజేసి ప్రజలకు సంపూర్ణంగా మంచినీటి సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక పొదలకూరురోడ్డులోని వాటర్‌ ట్యాంకు వద్ద రూ.1.35 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మంచినీటి పైప్‌ లైన్లను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ మరో మూడు నెలల్లో నెల్లూరు చెరువులో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకు పూర్తవుతుందని, తద్వారా నగర వాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందగలదన్నారు.

సభకు నగర మేయర్‌ భానుశ్రీ అధ్యక్షత వహించి మాట్లాడారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను దేశంలో అమలుపరచగలిగితే ప్రతి ఒక్కరూ సుఖజీవనం సాగించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

No comments: