నేడు నెల్లూరు

Tuesday, April 13, 2010

నగరంలో కాఫీ కేఫ్‌లలో బాతాఖాని తో మోసం

నగరంలో ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 వరకు ఏ కాఫీ కేఫ్‌లలో చూసినా ఖద్దరు దుస్తులు ధరించిన వ్యక్తుల సెల్‌ఫోన్‌లు ప్రతి పది నిమిషాలకు ఒకసారి మోగడం ఆనవాయితీగా మారిపోయింది. వీరి సంభాషనలు వినేవారికి రోమాలు సైతం నిక్కపొడుచుకునే పరిస్థితి నెలకొంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నగరంలోని శివారు ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ భూములు, ప్లాట్ల వ్యాపారాలు, వాటి రేట్లు వినే వారికి సైతం ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. గతంలో ముత్తుకూరులో షిప్‌యార్డ్‌ పడక ముందు రియల్‌ ఎస్టేట్‌కు మంచి రేటు పలికిన మాట వాస్తవమే అయినప్పటికీ ప్రస్తుతం ఆ మాత్రపు ధరలు నగరంలో ఏ ప్రాంతంలో పలకడం లేదనేది సత్యం. అయితే ఈ కేఫుల వద్ద సెల్‌ఫోన్‌లో నగరంలో పలానా ప్రాంతంలో అంకణం రూ.20 వేల నుండి రూ.60 వేల వరకు, రూ.70 వేల నుండి లక్ష రూపాయల వరకు ఉందంటూ కొనుగోలుదారులను మోసగించే ప్రయత్నంలో ఈ ఘరానా బాబులు తయారైఉన్నారు. వీరికి నిద్రలేచింది మొదలు మరో పని లేకుండా నగరంలోని నర్తకి సెంటర్‌లో ఉన్న రెండు ప్రధాన కేఫ్‌లు, లస్సీ సెంటర్‌లో ఉన్న మరో కేఫ్‌, అదేవిధంగా వేదాయపాళెం, అయ్యప్పగుడి, పొదలకూరురోడ్డు తదితర ప్రాంతాలలోని కేఫుల వద్ద గుంపులు గుంపులుగా చేరి ప్రజలను మోసగించే ప్రయత్నంలో నిత్యం తమవంతు ప్రయత్నాలు చేయడం పరిపాటైపోయింది.

వీరి మాటలు విని వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వ్యక్తులు కూడా ఎక్కువగానే ఉన్నారు. అదేవిధంగా వీరు కేఫుల వద్ద సెల్‌ఫోన్‌లో బిజీగా ఉన్నట్టు నటిస్తూ ఆ ప్రాంతంలో ఉంటున్న వ్యాపార సంస్థలవారిని, కొద్దో గొప్పో పలుకుబడి గలవారిని ఆకర్షిస్తూ, తాము చీటీ వ్యాపారాలు మొదలు పెట్టామని, రూ.50 వేల నుండి రూ. లక్ష వరకు ఈ చీటీ పాటలను వేయాలని వారిని మభ్య పెడుతూ అనంతరం ఆ ఖాతాదారుల నుండి కోట్లాది రూపాయలు వీరు దండుకుని పరారైన సంఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి. అయినప్పటికీ ఎక్కువగా ఈ తరహా ఘరానా బాబుల వలలో సామాన్య మానవులు, మధ్య తరగతి ప్రజలు తిప్పుకోవడంతోపాటు వేలాది రూపాయలు నష్టపోతూ ఆత్మహత్యలకు పాలవుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అదేవిధంగా పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలనే గాక, ఇతర జిల్లాల నుండి మహిళలను నగరంలోని పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లలో వారికి వసతులు ఏర్పాటు చేయడంతోపాటు చిన్నా చితకా రాజకీయ నాయకులకు ఫోన్‌ల ద్వారానే కాంటాక్ట్‌ అవుతూ వారి ద్వారా ఎటువంటి పనీపాట లేకుండా వేల రూపాయలు కమిషన్‌ల రూపంలో దండుకుంటూ తమపబ్బం గడుపుకుంటున్నారు. వాస్తవానికి ఈ కేఫుల వద్దకు కాఫీ, టీ తాగేందుకు వచ్చే వారి సంఖ్య పదుల వరకు ఉంటే, ఈ తరహా వ్యవహరాలపై అదేపనిగా పెట్టుకుని గంటల కొద్దీ ఈ కేఫుల వద్ద బాతాఖానీలు కొడుతూ ఈ తరహా వ్యవహారాలపై ఎక్కువ కేంద్రీకృతం చేస్తున్నట్టు సమాచారం. ఈ తరహా బడాబాబుల ఘరానా మోసాలని సంబంధిత అధికారులు ప్రధానమైన సెంటర్లలో నిఘా ఏర్పాటు చేసి ఈ తరహా వ్యక్తులు చే సే ఘరానా మోసాలకి అడ్డుకట్ట వేయాలని, అలాగే చట్టవ్యతిరేకంగా చీటీపాటల వ్యవహారం నడిపే వ్యక్తులపై కూడా నిఘా పెట్టడంతోపాటు వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైన ఉంది.

ఈ తరహా మోసాలపై కేవలం సంబంధిత అధికారులే కాకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా సంఘాలవారు కూడా నిఘా ఉంచి ఈ ఘరానా బాబుల భరతం పట్టాలని, ఈ తరహా వ్యవహారాలను నడిపే వారి వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు అందించడంతోపాటు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు నష్టాలబారీన పడి ఆత్మహత్యలపాలు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ సంస్థలపై ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఈ కేఫుల వద్ద జరిగే బాతాఖానీలపై దృష్టి సారించకుండా, వారు మభ్యపెట్టే మాటల్లో పడకుండా స్వచ్ఛంద సేవా సంస్థలు, సేవా సంఘాలవారు తమ వంతు బాధ్యతగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

1 comment:

Unknown said...

manchi vaartha andinchinanduku meeku na danayvadamulu.

Vijay,
Hyderabad.