నేడు నెల్లూరు

Wednesday, April 28, 2010

మాఫియా మాయ... మోసపోతున్న వాహనదారులు

40 ఏళ్ల క్రితం సైకిల్‌ వున్న వ్యక్తిని సంపన్నుడుగా భావించేవారు. నాటి రోజుల నుండి నేటి రోజులకు పోలిస్తే ఎన్నో మార్పులు, చేర్పులు జరుగుతూ కాలక్రమేణా సైకిల్‌ స్థానంలో కారు గలవాడే నేడు సంపన్నుడుగా చలామణి అవుతున్నాడు. కాని ప్రస్తుతం ద్విచక్ర వాహనం (బైక్‌) అనేది సైకిల్‌లాగా నేటి రోజులను బట్టి నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఏ నగరంలో చూసినా, ఏ పల్లెలో చూసినా రయ్‌మని దూసుకుపోయే మోటార్‌ సైకిళ్లు, కార్లు, ఆటోలు నేడు కనిపిస్తున్నాయి. కాలాన్ని బట్టి వాయువేగంతో నడిచేందుకు ప్రతిఒక్కరూ ఇష్టపడుతున్న నేటి రోజుల్లో వాహనం లేనిదే ఏ పని చేయలేని పరిస్థితి నేటి ఆధునిక మానవుడికి ఏర్పడింది. నిత్యం లక్షల వాహనాలు తిరుగుతుంటే వాటికి అవసరమైన కొన్ని లక్షల లీటర్ల పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలను జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ బంకుల్లో అమ్మకాలు చేస్తున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకా కొలతల్లో తేడాలు చేయడమే గాక, వీటిని కల్తీ చేయడానికి ఒక మాఫియా తయారైంది.

వీరు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి ప్రజల జేబులను చిల్లు గొడుతూ తమ జేబులను నింపుకుంటున్నారు. జిల్లాలో దాదాపు 200 వరకు పెట్రోలు బంకులు ఉన్నాయి. వీరు నెలకు 50 లక్షల లీటర్ల పెట్రోలు, రెండు కోట్ల లీటర్ల వరకు డీజిల్‌ అమ్మకాలు అధికారికంగా సాగిస్తున్నారు. అనధికారికంగా సాగే అమ్మకాలకు వీరి వద్ద లెక్కే ఉండదు. కొలతల్లో తేడాలు, కల్తీలతో లీటర్‌కు రూ.5ల నుండి రూ.10ల వరకు అదనంగా ఆదాయాలను ఈ పెట్రోల్‌ బంకులవారు సంపాదిస్తున్నారు. దీని అంచనా ప్రకారం నెలకు కోట్ల రూపాయల్లో జనం సొమ్మును స్వాహా చేస్తున్నారు. లెక్కలు చూపకుండానే వీరు జరిపే అమ్మకాలు, చిల్లర అమ్మకాలు, ఇతర మోసాల కారణంగా మరింత సొమ్మును ఈ మాఫియా ముఠా జేబుల్లోకి నింపుకుంటుంది. వ్యాట్‌ ప్రకారం ప్రతి పెట్రోలు ఉత్పత్తుల డీలర్లు ఆర్‌సిలు కలిగి ఉండాలి.

అయితే మన జిల్లాలో ఆర్‌సిలను రద్దు చేయించుకుని ఎంతకు కొంటున్నది, ఎంతకు అమ్ముతున్నది అనేటువంటి లెక్కలు లేవని సమాచారం. దీంతో అక్రమాలు సజావుగా సాగిపోతున్నాయి. వాహనదారులకు పెట్రోలు, డీజిలు పట్టిన తర్వాత ఆ బంకువారు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాల్సిన అవసరముంది. కాని బిల్లులు ఇచ్చే పరిస్థితిలో చాలా బంకులు నిర్లక్ష్యం చూపిస్తున్నాయి. పెట్రోల్‌ బంకుల ముందు తాము కల్తీలు చేయడం లేదని, కొలతలు సక్రమంగా ఉన్నాయని పరీక్ష చేసిన వారి పేర్లతో బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఇది కేవలం మభ్యపెట్టడం తప్ప ఇంకేమీలేదు. ఏదైనా అధికారులు హడావుడి జరిగితే సక్రమంగా చేయడం, తర్వాత వారిష్టమొచ్చినట్లు వారి పేర్లు రాయడం ఆనవాయితీ. పాలిష్‌ క్లాత్‌, గ్రీస్‌, బ్రేక్‌ ఆయిలు, ఇంజన్‌ ఆయిల్‌ వంటి అమ్మకాలపై పన్ను ప్రభుత్వానికి చెల్లించాల్సి వున్నా, వాటిపై పట్టించుకునే అధికారే లేడు.

వీటిపై దాదాపు జిల్లాలో ఎలాంటి కేసులు కూడా అధికారులు నమోదు చేసినట్లు దాఖలాలు లేవు. జిల్లాకు అత్యంత సమీపంలో ఉన్న చెనై్న నుండి ప్రతి నిత్యం వందల కొలది ఆయిల్‌ ట్యాంకర్లు నగరానికి చేరుకుంటున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి ఆయిల్‌ ట్యాంకర్లు నగరానికి ఆయిల్‌ను సరఫరా చేస్తున్నాయి. ఈ ఆయిల్‌ ట్యాంకర్లను తీసుకొచ్చే సమయంలో కొంతమంది నిర్వాహకులు మార్గమధ్యంలోనే ట్యాంకర్లను ఆపి అందులోవున్న డీజిల్‌, పెట్రోల్‌ను వేరే క్యానుల్లోకి మార్చి అక్కడే అమ్మకాలు జరిపి, వాటి స్థానంలో కిరోసిన్‌ వంటి వాటిని కలపడం నిత్యకృత్యమైపోయింది. వారు కలిపింది పోగా ఆ ట్యాంకర్‌ సంబంధిత పెట్రోలు బంకుకు చేరుకోగానే ఆ బంకువారు ఆయిల్‌ అన్‌లోడ్‌ చేసుకున్న తదుపరి వారి కోటా ప్రకారం వారు కూడా కిరోసిన్‌ను కల్తీ చేయడం షరామామూలైపోయింది. ‘

తిలాపాపం తలో పిడికెడు’ అన్నట్లుగా డీజిల్‌, పెట్రోల్‌లో బంకు యజమానులు, ఆయిల్‌ ట్యాంకర్‌ నిర్వాహకులు కల్తీ చేయడం వల్ల ఆ ఆయిల్‌ పోసుకున్న వాహనదారులు వాహనాల లైఫ్‌ అతి తక్కువ కాలానికే పడిపోయి నానా ఇక్కట్లు పడుతున్నారు. అంతేగాక కంప్యూటర్‌ రీడింగ్‌ని చూపిస్తూ ఆయిల్‌ పట్టడమే గాక మాన్యువల్‌ ప్రకారం కూడా ఆయిల్‌ పడుతూ లీటర్‌కు ఎటువంటి పరిస్థితుల్లో కనీసం 2 ఎంఎల్‌ అయినా సరే తగ్గించి పట్టడం నేడు జిల్లా మొత్తం జరుగుతున్న తంతు.

దీనిపై పెట్రోలు పట్టే కుర్రవాడిని ఇదేమిటని అడిగితే మాకు వచ్చేది ఆ ఒక్క ఎంఎల్లేసారా అంటూ సమాధానం ఇస్తున్నాడు. రోజుకు వందల వాహనాలు లక్షల్లో పెట్రోలు, డీజిల్‌ పట్టించుకుంటూ పోతుంటే వీరు మిగిల్చుకుంటున్న 1ఎంఎల్‌, 2ఎంఎల్‌ సరాసరి వారు డ్యూటీ దిగే సమయానికి వందల లీటర్ల రూపంలో మిగిల్చుకుంటున్నారు. అటు కల్తీ చేసి బంకు యజమానులు, ఇటు ఆయిల్‌ మిగిల్చుకుంటూ బంకు కుర్రాళ్లు, ఆయిల్‌ ట్యాంకర్‌తో ఆయిల్‌ తెచ్చే ట్యాంకర్‌ నిర్వాహకులు చేసే కల్తీ వీరందరి మోసాలకు వాహనదారులు నేడు బలైపోతున్నారు. ప్రభుత్వాధికారులు దీనిపై చొరవ చూపి నిఘావుంచి, వారిపై సరైన చర్యలు తీసుకుంటే నిత్యావసర వస్తువుగా ఉన్న డీజిల్‌, పెట్రోలు ప్రతి ఒక్క వాహనాదారుడికి మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

No comments: