నేడు నెల్లూరు

Friday, April 16, 2010

నీటి ఎద్దడి నివారణకు కాల్‌సెంటర్


వేసవి కాలంలో తీవ్ర నీటి ఎద్దడిపై వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కేంద్రలో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ కాకాణి గోవర్దన్‌రెడ్డి వెల్లడించారు. గురువారం స్థానిక గోల్డెన్ జూబ్లీ హాలులో మంచినీటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో మంచినీటి సమస్యలపై వచ్చే ఫిర్యాదులను కాల్ సెంటర్ ద్వారా స్వీకరించి, పనుల స్థాయిని బట్టి 24గంటల లోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో జిల్లా పరంగా దాదాపు 5కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. కాల్ సెంటర్‌కు వచ్చిన మంచినీటి సమస్యలపై ప్రతిపాదనలు తయారు చేసి సంబంధిత ఎఇల ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కె రాంగోపాల్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మంచినీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన కాల్ సెంటర్‌లోని 18004252499 నెంబర్‌కు ఫోన్ చేసినట్లయితే వెంటనే ఆన్‌లైన్‌లో ఆ సమస్యలను రిజిష్టర్ చేస్తామని చెప్పారు. మంచినీటి సమస్య పనుల స్థాయిని బట్టి వచ్చిన 24 గంటల లోపల పరిష్కరించేలా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏర్పాటుచేసిన కాల్ సెంటర్ ఏప్రిల్ 15నుండి అక్టోబర్ 31 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామస్థాయిలో, మునిసిపాలిటీలలో కూడా మంచినీటి సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి తెలియచేయవచ్చని చెప్పారు. ఈ కాల్ సెంటర్ ఉదయం 8గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుందన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కాల్ సెంటర్ నిర్వహణ పనితీరును ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ సీతారామయ్య, జడ్పీ సిఇఓ బి రామిరెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి జివి జయరామయ్య, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రవిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

No comments: