నేడు నెల్లూరు

Friday, April 30, 2010

రోశయ్య పర్యటన కోసం నగరానికి మెరుగులు

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పర్యటన కోసం నెల్లూరు నగరం ముస్తాబవుతోంది. ముచ్చటగా మూడుసార్లు వాయిదా పడిన ముఖ్యమంత్రి పర్యటన ఎట్టకేలకు ఖరారయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారిగా నగరానికి వస్తున్న రోశయ్య దాదాపు 26 గంటలు గడుపుతారు. అయితే అందులో కేవలం మూడు గంటలు మాత్రమే అధికార అనధికార కార్యక్రమాల్లో గడుపుతారు. ఇందులో అరగంట పాటు అధికారులు, అనధికారులతో సమీక్ష జరుపుతారు. గంటన్నర సేపు ప్రారంభోత్సవ కార్యక్రమాలతోపాటు బహిరంగ సభలో పాల్గొంటారు. ఒక గంట సేపు వైశ్య ప్రముఖులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు. మిగిలిన ఆయన పర్యటనా కాలాన్ని రిజర్వులో ఉంచారు. రాష్టమ్రంతటా 5వ విడత భూపంపిణీ కార్యక్రమం నిర్వహించినప్పటికీ ముఖ్యమంత్రి రాకకోసం జిల్లాలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రాష్ట్రంలోనూ, దేశంలోనూ నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్ఠానంతో జరిగిన చర్చల నేపథ్యంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో మూడుసార్లు ఆయన పర్యటన రద్దయింది. చివరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారయింది. దీనితో నగరంలో హడావుడి ఊపందుకుంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నింటికీ మోక్షం లభిస్తోంది. పలుచోట్ల మురికి కాలువలు కూడా శుభ్రపడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా గురువారం పినాకినీ అతిథి గృహాన్ని సందర్శించారు. విఆర్‌సి మైదానంలో జరిగే బహిరంగ సభ, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. మూడు దఫాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్న అధికారులు చివరకు తేదీ ఖరారు కావడంతో వాటిని సవరించుకుంటున్నారు. ఇదిలావుండగా ముఖ్యమంత్రి పర్యటన కేవలం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సాగుతున్నట్టుగా ప్రచారం జరగడంతో ఆనం వ్యతిరేక వర్గం తమ ఉనికిని చాటుకోవడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి తొలి పర్యటనలో అంతా ఆనం సోదరులు హవా కొనసాగితే తమ పరిస్థితి ఏమిటనే విషయంపై చర్చ జరుగుతోంది. గతంలో ముఖ్యమంత్రి పర్యటన జరిగినపుడు చేసే ప్రచారంలో అధికార పార్టీ ప్రజాప్రతినిథులందరికీ స్థానం లభించేది. గ్రూపు తగాదాలున్నప్పటికీ తన రాకముందే అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వాటిని సర్దుబాటు చేసేవారు. ఈ దఫా ప్రచారంలో కొంతమందిని విస్మరించినట్లు కనిపిస్తోంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు పోస్టర్లలో అంతా ఆనం సోదరులు, వారికి అనుకూలంగా ఉన్నవారి ముఖాలే కనిపించేలా ఏర్పాట్లు జరిగాయి. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో ఆదివారం మధ్యాహ్నం 12. 30 నుండి సాయంత్రం 6 గంటల వరకు రిజర్వు సమయాల్లో ఈ విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.

No comments: