నేడు నెల్లూరు

Monday, April 26, 2010

ఆక్యు'ప్రెజర్'తో దోపిడీ

జిల్లాలో ఆక్యుప్రెజర్ వైద్యం పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏటా రూ. 10 కోట్లకు పైగానే ఈ వ్యాపారం సాగుతున్నట్లు అంచనా. రెండేళ్ల నుంచి గొలుసుకట్టు విధానంతో నెట్‌వర్క్‌లోకి చేరి పేదలు, మధ్యతరగతి ప్రజలు మోసపోతున్నారు. వేలకువేలు జీతాలు, కార్లు ఆశచూపి నిరుద్యోగులను ఆశలపల్లకీ ఎక్కిస్తున్నారు. ప్రజల రోగాల బలహీనతలను గుర్తించి పరికరాలు, మందులు అంటగట్టి ఎంచక్కా సొమ్ము చేసుకుంటు న్నారు. ఈ వైద్యం శాస్త్రీయంకాదని వైద్య నిపుణులు ఎంత మొత్తు కుంటున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చాప కింద నీరులా ఈ దోపిడీ ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితం కాగా, నేడు పల్లెలకు పాకుతోంది.

ఆక్యుప్రెజర్ వైద్యమంటే...
మనకు ఇప్పటివరకు ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, అల్లో పతి, నేచురోపతి వైద్యవిధానాలు అందు బాటులో ఉన్నాయి. వీటితోపాటు ఆక్యుపంక్చర్ వైద్య విధానం కూడా అందుబాటులో ఉంది. ఈ వైద్య విధానం చైనా, జపాన్ తదితర దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. ఈ వైద్యవి«ధానంలో శరీరభాగాలపై సూదులతో గుచ్చి వ్యాధులను నయం చేస్తారు.

దీని నుంచే ఆక్యుప్రెజర్ వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది కూడా తొలుత చైనాలోనే ప్రవేశ పెట్టారు. మనిషి నాడి వ్యవస్థపై ప్రెజర్(ఒత్తిడి) తీసుకువచ్చి రోగాలు నయం చేస్తామని రెండేళ్లుగా జిల్లాలో కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. చేతులు, కాళ్లలో ఉన్న నరాల్లోకి లేజర్ కిరణాలు పంపి ఓ పరికరంతో గుచ్చుతారు. ఎక్కడ నొప్పి అనిపిస్తే ఆ భాగాన్ని లెక్కించి భవిష్యత్‌లో వచ్చే రోగాలను ముందుగానే తెలియ జేస్తున్నామని ప్రజల్ని నమ్మిస్తారు.

వివిధ కంపెనీలు తయారు చేసిన పరికరాలను ఆ వ్యక్తులకు అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. వాకింగ్ చేయాల్సిన పని లేకుండానే, ఆ మిషన్ పై నిలపడితే కుదుపుల తో నడక సాగించినంత ఫలితం కలుగుతుందని చెబుతారు. అలాగే ఒబెసిటీకి కూడా ఇలాంటి మిషన్‌ను చూపి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇలా రకరకాల చిన్నపాటి పరికరాలను రోగులకు అందిస్తారు. రూ. 14 వేల నుంచి రూ. 60వేల వరకు ఈ మిషన్లకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఒకరి నుంచి మరొకరి గొలుసుకట్టు విధానంలో నెట్‌వర్క్‌లోకి సభ్యులుగా చేర్చుకుని అమ్మకాలు సాగిస్తారు. ఇలా రెండేళ్లుగా జిల్లాలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది.

మోసపోతున్న నిరుద్యోగులు
ఆక్యుప్రెజర్ వైద్యం పేరిట నిరుద్యోగులకు వల వేస్తారు. వారి మాటల చాత్యురంతో నిరుద్యోగులను ఆకట్టుకుని నెలకు వేలకు వేలు జీతాలని నమ్మిస్తారు. కార్లు, విదేశీ టూర్లు, ఒకటేమిటి...మీ జీవితాన్నే మార్చేస్తామని చెబుతారు. వన్ స్టార్ నుంచి సెవన్ స్టార్ వరకు, ఆపై గోల్డ్ లైన్, బ్రాంజ్ లైన్‌కు చేరితే కోటీశ్వర్లు అయిపోవచ్చని ఊరిస్తారు.

చదువుతో పనిలేకుండా ఇతరులను ఆకట్టుకునే విధంగా వ్యవహరిస్తే చాలని తెలియ చేస్తారు. అదే వారికి అర్హత. నిరుద్యో గులు, మహిళలు వీరి వలలో పడి మోసపోతున్నారు. వేలకు వేలు డబ్బు లను ధారబోసి ఆ పరికరాలను కొని గొలుసుకట్టు నెట్‌వర్క్‌లో ఎదగలే కుండా దిగాలుపడుతున్నారు. తదు పరి వ్యక్తులు సభ్యులుగా చేరితేనే సిరులు కురిపిస్తాయి. లేదంటే ఎక్కడ వేసిన గొంగళి...అక్కడే అన్నట్లుగా వీరి జీవితాలు మారుతున్నాయి.

ఏ రోగం అయినా నయం
షుగర్, బీపీ, కొలస్ట్రాల్, ఆర్థరైటీస్, సైనసైటిస్, మైగ్రేన్, నడుం, కాళ్లు, మెడ నొప్పులు, కీళ్లు అరగడం, గ్యాస్ స్ట్రైసీస్, ఆస్మా, థైరాయిడ్, అల్సర్ తదితర రోగాలన్ని ఆక్యుప్రెజర్ వైద్యంతో నయమవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇవి కాకుండా హెచ్ఐవీ, క్యాన్సర్ రోగాలు కూడా అదుపులో ఉంచుతామని నమ్మిస్తారు. వచ్చిన రోగాలే కాకుండా భవిష్యత్‌లో వచ్చే రోగాలను ముందస్తుగా గుర్తించి ఇప్పటి నుంచే వైద్యం ప్రారంభించా లని మాటల చాతుర్యంతో ఆకట్టుకుం టారు. చైనా నుంచి దిగుమతి చేసు కున్న కొన్ని మిషన్ల ద్వారానే (ప్రెజర్) ఈ రోగాలన్నీ నయమవుతాయని, వీటికిి సపోర్టుగా కొన్ని మందులను వాడాల్సి ఉంటుందని చెబుతారు.

ఇవి కాకుండా వంటపాత్రలు ప్రత్యేకంగా తయారు చేసిన వాటిని అందిస్తారు. ఇలా ఒక రోగి నుంచి రూ. 60వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమా చారం. సూళ్లూరుపేట, నాయుడు పేట, గూడూరు, నెల్లూరు, కావలి పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు పట్టణాలకే పరిమితమైన ఈ వైద్యం పల్లెలకు ఎగబాకుతోంది. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవకపోతే కొన్ని బోగస్ సంస్థల ద్వారా ప్రజలు మోసపోయినట్లే జరుగుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments: