నేడు నెల్లూరు

Tuesday, April 13, 2010

పెద్దలను వదిలి పేదలపై ప్రతాపం ప్రహసనంగా మారిన ట్రాఫిక్ నియంత్రణ

నగరంలో ఆక్రమణల తొలగింపు ప్రహసనంగా మారింది. సోమవారం నగరంలోని చిన్న వ్యాపారులపై పోలీసులు, కార్పొరేషన్ అధికారులు ప్రదర్శించిన జులుంపై విమర్శలు చెలరేగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన చిన్న వ్యాపారులను తొలగించడాన్ని తప్పుపట్టకపోయినా ట్రంకురోడ్డును ఆనుకుని శబరి శ్రీరామ క్షేత్రం నుండి కెవిఆర్ పెట్రోలు బంకు, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కనకమహల్ సెంటర్ వరకు ఉన్న మెగా వ్యాపార అంగళ్ళు, ఆసుపత్రులు, హోటళ్ల విషయంలో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోపాటు వారిని సమర్దించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్పగుడి సెంటర్ నుండి అడ్డొచ్చిన వారిని దౌర్జన్యం చేసి మరీ వెనక్కు పంపుతున్న అధికారులు కీలకమైన ప్రాంతాల్లో అలాంటి చొరవ చూపకపోవడంపై జనం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా శబరి శ్రీరామ క్షేత్రం నుండి రోడ్డుకు ఇటు అటూ ఉన్న భారీ దుకాణాలు, సంస్థలు అన్నీ నిబంధనలు తుంగలోకి తొక్కి రోడ్డును ఆక్రమించుకున్నవేనని అధికారులే అంగీకరిస్తున్నారు. అయినా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. వీటన్నిటికీ అనుమతులు స్థానికంగా పలుకుబడి కలిగిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిథుల అండతో రాజధాని నుండి వస్తున్నాయి. దీనితో స్థానిక అధికారులు, ముఖ్యంగా కార్పొరేషన్ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రధాన కూడళ్లన్నీ బడా వ్యాపార సంస్థల వ్యాపార కార్యకలాపాలతో రద్దీగా మారాయి. నిబంధనలను అతిక్రమించి రోడ్డును ఆనుకుని షాపులు నిర్మించుకున్న యాజమాన్యాలు కనీసం వాటివల్ల ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోవడం లేదు. ఒక ప్రముఖ హోటల్ కూడా ఈ కోవకు చెందినదే అయినప్పటికీ స్వంతంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ట్రాఫిక్ నియంత్రణలో పాలుపంచుకుంటోందని కార్పొరేషన్‌కు చెందిన ఓ అధికారి చెప్పారు. మిగిలిన వ్యాపార సంస్థలు యథేచ్ఛగా నిబంధనలు తుంగలోకి తొక్కి కనీసం ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా రోడ్ల విస్తరణలో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో ఈ ప్రక్రియ నిర్మాణాత్మకంగా జరగడం లేదు. గతంలో రోడ్ల విస్తరణలో అధికారులు, ప్రజాప్రతినిథులు ముడుపులు అందుకుని చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికైనా తాజాగా చేపడుతున్న ట్రాఫిక్ నియంత్రణా చర్యలు మెగా సంస్థలపై కూడా తీసుకుంటే అధికారుల చిత్తశుద్ధి తెలుస్తుందని జనం సవాలు విసురుతున్నారు. దీనిపై సీటి ప్లానర్ నాయక్ వివరణ ఇస్తూ నెల్లూరు కార్పొరేషన్‌లో నిబంధనలకు అనుగుణంగా జరిగిన నిర్మాణాలను వేళ్లపై లెక్కించవచ్చని పేర్కొన్నారు. తమ వంతు ప్రయత్నం చేసినా ఉన్నత స్థాయిలో వస్తున్న అనుమతులు ముందుకాళ్లకు బంధం వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సంఘటన పోలీసుల చొరవతో ట్రాఫిక్ సమస్యలకు కనీస పరిష్కారంగా జరిగిందన్నారు. ఇదే చొరవ ప్రజలు, ప్రజాప్రతినిథులు, అధికారుల నుండి లభిస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు.

No comments: