నేడు నెల్లూరు

Thursday, April 1, 2010

రాజకీయాలకు మేయర్ భానుశ్రీ భై భై ???


ముళ్ల కిరీటం వంటి మేయర్‌ పదవిని చేపట్టిన నాటి నుంచి స్వపక్షీయుల నుంచే తీవ్రంగా ఎదురైన నిరసనను ఎమ్మెల్యే వివేకానందరెడ్డి ఆదిలోనే అణచివేసివుంటే ప్రత్యర్థులకు ఇంతటి అవకాశం ఉండి ఉండేది కాదని ఆమె అభిప్రాయంగా తెలిసింది. గతంలో సీనియర్‌ కార్పొరేటర్‌ సందానీబాషా స్వయంగా మంత్రి ఆనం ఇంట్లో నలుగురి ముందు తనను అవమానపరచినా అప్పట్లో వివేకానందరెడ్డి దానిని సీరియస్‌గా తీసుకోకపోవడం, మరోవైపు కొత్తగా ఎన్నికైన స్వపక్ష కార్పొరేటర్లు సైతం తనను విభేదిస్తుండడం, తాను పాల్గొనే కార్యక్రమాలకు వారు డుమ్మా కొడుతూ ప్రత్యర్థులకు ఒక అవకాశం కల్పించారన్నది ఆమె ఆవేదన. రాజీవ్‌భవన్‌ నేతలను ఒంటరివారుగా చేసి రాజకీయంగా ఆదిలోనే అణచివేసివుంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేదా అని ఆమె తమ ముఖ్య అనుచరుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

కేవలం తన ఒక్కరినే కాకుండా తమ బంధువులైన పాపానికి అందరినీ రచ్చకీడ్చిన వారి అంతం చూసేంతవరకు నిద్రపోనని ఆమె భీష్మించుకు కూర్చుంది. గత 20 రోజులుగా రాజధాని నగరంలో మకాం పెట్టిన భానుశ్రీ ఎట్టకేలకు బుధవారం నగరానికి వచ్చారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సాయిబాబా మీద ప్రమాణం చేసినప్పటికీ, ఆయన సైతం తనను రక్షించలేకపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న తన భర్త సుబ్బరాజు ఉద్యోగ ప్రస్థానంలో తన కారణంగా మచ్చ ఏర్పడడాన్ని ఆమె జీర్ణించుకోలేకున్నారు. అసలు ఈ రచ్చ జరగడానికి కారణం రాజకీయాలే అని భావించి అసలు వాటినే వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చిన ఆమె ఈ నెల 3వ తేదీన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మేయర్‌ పదవితోపాటు రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నట్లుగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

No comments: