నేడు నెల్లూరు

Thursday, April 15, 2010

నేడే జిఎస్‌ఎల్‌విడి3 ప్రయోగం


సథీష్‌ధావన్‌ స్ఫేస్‌ సెంటర్‌ శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రంలో జిఎస్‌ఎల్‌వి డి3 ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ మొదలైంది. రాకెట్‌ ప్రయోగానికి 29 గంటలముందు బుధవారం ఉదయం 11.27 గంటలకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఈ కౌంట్‌డౌన్‌ ఆగకుండా నిరంతరాయంగా కొనసాగుతోంది. సూపర్‌కంప్యూటర్‌ పర్యవేక్షణలో శాస్తజ్ఞ్రులు రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి నిముషాలు లెక్కపెడుతున్నారు. వాతావరణం, ఇతర పరిస్థితులు అనుకూలిస్తే గురువారం సాయంత్రం 4.27 గంటలకు ఖచ్చితంగా రాకెట్‌ ప్రయోగం ఉంటుంది. ఏదైనా..అనుకోని సాంకేతిక అవరోదాలు ఏర్పడితే మినహా ప్రయోగం వాయిదాపడే అవకాశం లేదు.

భూస్థిరకక్ష్య ఉపగ్రహవాహకనౌక ఈ జిఎస్‌ఎల్‌వి డి3 ద్వారా 2218 కిలోల బరువుండే భూస్థిర ఉపగ్రహం జిశాట్‌4ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. జిఎస్‌ఎల్‌వి ప్రయోగ పరంపరగా షార్‌నుంచి జరుగుతున్న ఆరవ ప్రయోగమిది. రాకెట్‌ అభివృద్ధి పరిణామ క్రమంలో జిఎస్‌ఎల్‌వి డి3 మూడవది. ఇప్పటికే అయిదు జిఎస్‌ఎల్‌వి రాకెట్‌లను షార్‌ నుంచి ప్రయోగించి ఉన్నారు. ఇందులో నాలుగు ప్రయోగాలు విజయవంతమవ్వగా, ఒక ప్రయోగం విఫలమైంది. రెండు రాకెట్‌ ప్రయోగాలలో అభివృద్ధి కరమైన అంశాలను పొందుపరిచి పంపించి ఉన్నారు. భూస్థిర ఉపగ్రహ ప్రయోగాలలో ప్రస్తుతం పంపిస్తున్న జిశాట్‌4 పంతొమ్మిదవది. భారత్‌ నుంచి పంపించిన భూస్థిర ఉపగ్రహాలలో నాలుగవది. రాకెట్‌ ప్రయోగం జరిగిన కొద్ది నిముషాలలోనే మధ్యంతర భూస్థిర కక్ష్యలోకి వేళ్ళే ఉపగ్రహం అనంతరం వివిధ దశలలో జరిగే ప్రక్రియతో 36 వేల కిలోమీటర్ల వృత్తాకార భూస్థిర కక్ష్యలో స్థిరపడి నిరంతర సేవలు అందిస్తుంది.

రెండన్నర దశాబ్దాలుగా ఇలాంటి ఉపగ్రహాలు తయారు చేసి పంపించడంలో భారత్‌ ఆరితేరి ఉంది. 18 ఉపగ్రహాలుని ఇప్పటికి పంపించి ఉండగా, ఇందులో 11 ఉపగ్రహాలు ఇప్పటికీ పని చేస్తున్నాయి. సమాచార వ్యవస్థలలో , టివి ప్రసారరంగాల్లో, వాతావరణ అధ్యయన రంగాల్లో ఈ ఉపగ్రహాలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి 3జి టెక్నాలజీలాంటి సేవలకు ఈ ఉపగ్రహ ప్రయోగాలవల్లనే వీలవుతోంది. ప్రస్తుతం జిశాట్‌, ఇన్‌శాట్‌ ఉపగ్రహాలు భూమి నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ కమ్యునికేషన్‌ రంగాలతోపాటు విద్య, వైద్య రంగాలలో కూడా గణనీయమైన సేవలు అందిస్తున్నాయి. గ్రామీణవనరుల కేంద్రాలద్వారా సామాన్యమానవుడికి సైతం ఉపగ్రహ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా ప్రస్తుతం జిశాట్‌4లో అనేక ఆధునిక పరికరాలను అనుసంధించి ఉన్నారు. పొలాల్లోంచి రైతులు మార్కెట్‌ విలువలు తెలుసుకొనేందుకు, అననుకూల ప్రాంతాలనుంచి కూడా టెలిఫోన్‌, టివి సదుపాయం కల్పించడానికి ఈ ఉపగ్రహాలవల్ల వీలవుతుంది.

మూడంచెల మోటారు పద్ధతిన పనిచేసే జిఎస్‌ఎల్‌విలో ఈ సారి క్రయోజనిక్‌ మోటారు ఉపయోగించడం మరో గొప్ప విషయం. దాదాపు 50మీటర్ల ఎత్తు, 416 టన్నులు బరువుండే జిఎస్‌ఎల్‌వివిడి3 మూడుదశల మోటారు పద్ధతిన పనిచేస్తుంది. మొదటిదశలో ఇప్పటికే అబివృద్ధి చేసిన ఘన ఇంధనం, రెండవదశలో ద్రవ ఇంధనం ఉపయోగిస్తారు. మూడవ దశలో కీలకమైన క్రయోజనిక్‌ ఇంధనాన్ని ఉపయోగిస్తున్నారు. గతంలో రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో ఉపయోగించే ఈ క్రయోజనిక్‌ మోటారుని ఈ సారి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేయడం విశేషం.

దీంతో ఈ రాకెట్‌ ప్రయోగానికి విశేష ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రయోగం విజయవంతమైతే క్రయోజనిక్‌ మోటారుని ఉపయోగించే ఆరవ దేశంగా మనదేశం ప్రపంచ పటంలో చోటు సంపాయించుకొంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలో మైనస్‌ 252 డిగ్రీలవద్ద ఉదజనిని, మైనస్‌ 195 డిగ్రీలవద్ద ప్రాణవాయువుని ద్రవీకృతం చేసి క్రయోజనిక్‌ మోటారులో వినియోగిస్తారు. అత్యంత క్లిష్టతరమైన ఈ ప్రక్రియను జిఎస్‌ఎల్‌విడి3 ద్వారా మన దేశ శాస్తజ్ఞ్రులు సాధిస్తున్నారు.

No comments: