నేడు నెల్లూరు

Monday, April 26, 2010

సింహపురి సిరిమల్లెలు - ప్రత్యేక కథనం

రాజశేఖరా... నీపై మోజు తీరలేదురా!’ అంటూ అనార్కలి చిత్రంలోని ఘంటసాల గానాన్ని హిందూళ రాగంలో మధురంగా ఆలపిస్తుంటే, ‘దినకరా...శుభకరా!’ అంటూ ఉదయరాగ గానంతో మురిపిస్తుంటే విని మైమరచిపోయిన అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఎవరయ్యా ఈ అభినవ ఘంటసాల? అని ప్రశంసించారట. అప్పటి నుంచి సింహపురి ప్రజలచే పాటూరు శ్రీనివాసులు అభినవ ఘంటసాలగా ఖ్యాతి పొంది ఆపాత మధురాలైన నాటి తెలుగు సినీపాటలకు పెట్టింది పేరుగా రాష్టస్థ్రాయిలో గౌరవాన్ని అందుకుంటున్నారు. 1942 ఫిబ్రవరి 17న పాటూరు లక్ష్మీనరసయ్య, వెంకట శేషమ్మల ముద్దుల తనయుడైన పాటూరు శ్రీనివాసులు ఇంటిపేరులోనే ‘పాట’ను పొందుపరచుకుని చిన్ననాటి నుంచే ఘంటసాలకు ఏకలవ్య శిష్యుడయ్యాడు. బాల్యంలోనే పాఠశాలలో పాటల శ్రీనివాసులుగా అందరి అభిమానాన్ని సంపాదించారు. ఆయన అన్న యతిరాజులు కూడా మంచి గాయకుడు కావడంతో తన తమ్ముడిలో దాగివున్న గాయకుడిని గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు.

విఆర్‌.కళాశాలలో బిఎ, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎ, ఆ తర్వాత బియిడి పూర్తి చేసిన శ్రీనివాసులు ప్రముఖ హార్మోనియం విద్వాంసులు గుర్రాల శ్రీనివాసులునాయుడు ప్రోత్సాహంతో సినీ సంగీత కచ్చేరీలను నిర్వహించడం ప్రారంభించారు. 1960లో తొలిసారిగా అల్లూరులో జరిగిన రాష్టస్థ్రాయి సినీసంగీత పోటీల్లో పాల్గొని ప్రధమ బహుమతిని పొందారు. ఆ తర్వాత నేటి ప్రఖ్యాత సినీ నేపధ్య గాయకులు పద్మశ్రీ ఎస్‌పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి వారు సభ్యులుగా ఉంటున్న నెల్లూరు మ్యూజికల్‌ అసోసియేషన్‌లో సభ్యుడుగా చే రి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అనేక సినీ సంగీత కచ్చేరీలను చేశారు. 1970లో తాను తన వాయిద్య మిత్రబృందంతో కలసి ‘సింహపురి ఆర్కెస్ట్రా’ను స్థాపించి రాష్ట్రంలోనే గాక రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా సంగీత కచ్చేరీలను నిర్వహిస్తూ వచ్చారు. దాదాపు ఆరు వేలకు పైగా సంగీత కచ్చేరీలను నిర్వహించిన ఘనుడుగా పేరు పొందారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ డాక్టర్‌ బెజవాడ గోపాలరెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి వంటివారి చేతుల మీదుగా ఘన సన్మానాలను అందుకున్నారు.

ప్రఖ్యాత సినీ నేపథ్య గాయనీమణులు పి.సుశీల, జిక్కి, ఎస్‌.జానకి, ఎల్‌ఆర్‌.ఈశ్వరి వంటి వారితో కలసి పలు సంగీత కచ్చేరీల్లో పాల్గొన్న మేటి గాయకుడుగా రాష్ట్రంలో ప్రసిద్ధి కెక్కారు. సింహపురి ఆర్కెస్ట్రా ద్వారా ఎందరో గాయనీగాయకులకు శిక్షణ ఇచ్చి నేడు మేటి గాయనీగాయకులుగా ప్రఖ్యాతి పొందేందుకు దోహదపడ్డారు. స్వరసమ్రాట్‌ ఎస్‌.రాజేశ్వరరావు వంటి సినీ సంగీత దర్శకులను ఆహ్వానించి తన సంస్థ ద్వారా ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులు అందుకున్నారు. సింహపురి లలితకళా సమితి రఘుపతి ఆధ్వర్యంలో అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించిన సందర్భంగా ఘంటసాల, ముఖ్య అతిధి పిబి.శ్రీనివాస్‌ల సమక్షంలో సంగీత కచ్చేరీని నిర్వహించి వారి ఆశీస్సులందుకోవడం గొప్ప విశేషం. అలాగే 2003లో హైదరాబాద్‌ జ్యోతి కల్చరల్‌ అసోసియేషన్‌ వారిచే ఘనసత్కారాన్ని పొంది సంగీత సేవారత్న, గానరత్న వంటి బిరుద సత్కారాలను అందుకున్నారు.

ఐదువేల కచ్చేరీలను పూర్తి చేసిన సందర్భంగా కేత అంకులు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన సభ జరిగింది. 2005లో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌-రవీంద్రభారతిలో జరిగిన ఘంటసాల వర్ధంతి సభలో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు, నటి జమున, నర్తకి శోభానాయుడుల చేతులమీదుగా ఘన సన్మానాన్ని పొందడం విశేషం. వీరి సతీమణి రుక్మిణీదేవి భర్తకు తగిన భార్యామణిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయినిగా హైదరాబాద్‌ రవీంద్రభారతిలోనే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డునందు కోవడం మరో విశేషం. ఆరువేల కచ్చేరీలు పూర్తి చేసిన సందర్భంగా శ్రీనివాసులును నెల్లూరు కేంద్ర సహకార బ్యాంకు ఆవరణంలో కళాకారుల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్‌కుమార్‌, రామ్మూర్తి ఆధ్వర్యంలో కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మన్‌ వాకాటి నారాయణరెడ్డి, అప్పటి కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాకాటి నారాయణరెడ్డి రూ.10 వేలను గౌరవ ఆర్థిక పురస్కారంగా అందజేశారు. ఆ ధనాన్ని వెంటనే కళాకారుల సమాఖ్య అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం పాటూరు శ్రీనివాసులు కళా హృదయానికి నిలువెత్తు నిదర్శనం.

రావోయి బంగారు మామా, వెన్నెలలోనే వేడి ఏలనో, చల్లగ చూడాలి పూలను అందునకుపోవాలి, నీ మూగచూపేలా. భలే మంచిరోజు, రాగమూ రావే, నన్ను దోచుకుందువటే, ఆకాశవీధిలో, హిమగిరి సొగసులు, నిన్నలేని అందమేదో, హాయి హాయిగా ఆమనిసాగే, ఓ నెలరాజా, ఆలయాన వెలసిన బొమ్మను చేసి ప్రాణం పోసి, బహుదూరపు బాటసారి, పొన్నకాయ వంటి పోలీసెంకటసామి, విన్నవించుకోనా, కృష్ణాముకుందా మురారీ, అయినదేమో అయినదిచెలీ, రావే నాచెలియా, ఓ సజీవ శిల్పసుందరీ, శిలలపై శిల్పాలు, కిలకిల నవ్వులు విరిసిన అలల కలలపై తేలే, ఈ నల్లనిరాళ్లలో, పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని, ప్రేమయాత్రలకు బృందావనము, నమో భూతనాధా, నాలోని రాగమీవే, పగటి పూట చంద్రబింబం, గోరింక గూటికే వంటి వేలాది ఘంటసాల మధుర గీతాలను, పుష్పవిలాపం పద్యాలను, భగవ ద్గీత శ్లోకాలను, తెలుగుదనం తొణికిసలాడే గళంతో మధురంగా గానం చేసి శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పాటూరి శ్రీనివాసులు 65 ఏళ్ల వయసు పైడినా, మాధుర్యం చెదరని గాత్రంతో నేటికీ గాయకుడుగా విశేష ప్రజాభిమానాన్ని పొందుతుండడం సింహపురికే గర్వకారణం.

No comments: