నేడు నెల్లూరు

Tuesday, December 14, 2010

చీటీల పేరుతో మోసం దాదాపు అరకోటి కుచ్చు టోపీ

నగరంలోని వెంకటేశ్వరపురం పరిధిలో గల జనార్దన్‌రెడ్డి కాలనీలో చీటీల పేరుతో ఓ మహిళ దాదాపు అరకోటి స్వాహా చేసి మాయమైంది. ఈఘటన సోమవారం వెలుగుచూసింది.

బాధితుల కథనం మేరకు.. జనార్దన్‌రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న ఆషా అనేక ఏళ్ళగా చిటీల వ్యాపారం చేస్తుంది. పేద, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్న కాలనీలో అందరితో నమ్మకంగా ఉంటూ దాదాపు రూ.అరకోటి వసూలు చేసింది. చిటీల కాలం పూర్తి అయినా తన వద్దే ఉంచితే వడ్డీ వేసి సొమ్మును ఇస్తానంటూ కాలం వెళ్ళబుచ్చుతూ వచ్చిం ది. ఈ నేపథ్యంలో కొందరు డబ్బులు అవసరమై చిటీల సొమ్ము ఇవ్వాలంటూ గట్టిగా అడిగారు.దీంతో తను ఎవరికి డబ్బులు ఇవ్వననీ.... ఎవరికి చెప్పుకుంటారో చెప్పడంటూ తెగేసి సమాధానం చె ప్పింది.

డబ్బులు అడిగితే కేసులు
ఎవరైనా గట్టిగా అడిగితే కేసులు పెడుతోందని బాధితులు పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఓ పది మంది బాధితులు కలిసి ఆమె ఇంటి వద్దకు వెళ్ళి డబ్బులు ఇవ్వమని అడిగారు. దీంతో వారందరిపై దాడి, తదితర కేసులు పెట్టింది.
ఈ సంఘటనతో మిగతా వారు ఆమెను డబ్బులు అడిగేందుకు హడలిపోతున్నారు.
నేడు పోలీసులకు ఫిర్యాదు ఆమె వద్ద చిట్టీలు వేసి మోసపోయిన వారందరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు.

రూ. 5 కోట్ల స్థలం కాజేసేందుకు మళ్లీ యత్నాలు

నెల్లూరు నగరంలోని వెంకట్రామాపురం (విజయమహల్‌గేటు) వద్ద 1960లో రాధాకృష్ణారెడ్డి లేఅవుట్ వేశారు. సిఎఎస్ నెంబరు 214లో భూములను లేఅవుట్ చేయడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేశారు. దీనిని ప్రభుత్వం ఆమోదించడంతో ప్లాట్లు వేసి భూముల అమ్మకాలు జరిపారు. లేఅవుట్ నిబంధనల ప్రకారం 40 అడుగుల రోడ్డును వేసి మున్సిపల్ అధికారులకు అప్పగించాల్సి ఉంది.

జీవో నెంబరు 62 ప్రకారం లేఅవుట్ల కోసం దరఖాస్తు చేసే వ్యక్తులు మాస్టర్ ప్లాన్ ప్రకారం మున్సిపాలిటీకి ప్రజోపయోగమైన పనుల కోసం పది శాతం భూములు కేటాయించాలన్నది నిబంధన. కానీ 1972లో ఈ విధానం పాటించకపోవడంతో సిఆర్ నెంబరు 534 ప్రకారం ఈ లేఅవుట్‌ను అప్పటి మున్సిపల్ కౌన్సిల్ రద్దు చేసింది. 1960-61లో ఇద్దరికి ఈ లేఅవుట్‌లలో ప్లాట్లు అమ్మిన సమయంలో కూడా పడమర హద్దుగా 40 అడుగుల రోడ్డు ఉన్నట్లు పత్రాలలో పేర్కొన్నారు. ఇది లేఅవుట్ల నిబంధనకు విరుద్దంగా అమ్మారని అప్పట్లో కమిషనర్ ఇళ్ళ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించారు.

బాక్సుటైపు వంతెన
ఈ వివాదం సాగుతుండగానే 1996లో విజయమహల్ గేటు వద్ద బాక్సుటైపు రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. దీనికి అప్రోచ్ రోడ్డు చూపించాల్సిన అవసరం మున్సిపాలిటీపై పెట్టారు. లేఅవుట్‌లో చూపిన విధంగా 40 అడుగుల రోడ్డును భూసేకరణ చేశారు. రాధాకృష్ణారెడ్డి భూసేకరణ ఆపాలని, లేదంటే ఇందుకు అనుగుణంగా మున్సిపాలిటీలో ఉన్న స్థలాన్ని ఇవ్వాలని కోరారు

. ఆ మేరకు 1986లో సిఆర్ నెంబరు 1219 ప్రకారం మున్సిపల్ రిజర్వు స్థలం 35.2 సెంట్ల భూమిని ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిని వ్యతిరేకించిన ఆయన హైకోర్టుకు వెళ్ళారు. కోర్టు 1.06 ఎకరాల భూమి ఇస్తే సరిపోతుందని తేల్చింది. దీంతో సంతృప్తి చెందని ఆయన 1.765 ఎకరాల భూమిని అప్పగించాలంటూ మరోసారి కోర్టును ఆశ్రయించారు. వాస్తవ పరిస్థితులు తెలియచేయాలని కోర్టు మున్సిపల్ అధికారులను కోరగా అప్పటికే రాజకీయ ఒత్తిళ్ళతో ఆయనకు అనుకూలంగా నివేదికను సమర్పించినట్లు విమర్శలున్నాయి.

వాస్తవ పరిస్థితి ఇదే..
1960లో వేసిన లేఅవుట్లను 1972లో రద్దు చేశారు. రోడ్డు కోసం వదిలిని భూమికి పరిహారం చెల్లించాలా.... వద్దా అన్న సంశయం అధికారుల్లో నెలకొన్నది. రైల్వే వంతెన నిర్మాణం అప్పుడు రాధాకృష్ణారెడ్డి మున్సిపల్ అధికారులను తప్పుదోవ పట్టించి లేఅవుట్లను రద్దు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపల్ రికార్డుల మేరకు ఈ 40 అడుగుల స్థలం రోడ్డు కిందనే చూపుతుండడం విశేషం.

మున్సిపల్ చట్టం 1965లోని 184,185 సెక్షన్ల ప్రకారం స్థల యజమాని లేఅవుట్ ఆమోదం కోసం రోడ్లు నిర్మించిన తరువాతే ప్లాట్లు అమ్మాలన్నది నిబంధన. ఈ లేఅవుట్లను రద్దు చేయాలంటే ముందస్తుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. రద్దయిన లేఅవుట్‌ను బూచిగా చూపి మున్సిపల్ స్థలాలు కొట్టేసేందుకు ఇదొక పథకంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కౌన్సిల్‌లో ఈలేఅవుట్ల రద్దు చేసినట్లు ఆయనకు అనుకూలంగా అప్పటి కౌన్సిల్ పాలకులు వ్యవహరించారని సమాచారం.

కోరుతున్న స్థలాలు
నెల్లూరు నగరంలోని వేపదరువు ప్రాంతంలో ఎల్‌పి 70/71 రిజర్వుడ్ ఖాళీ మున్సిపల్ స్థలం 0.40 సెంట్లు, బాలాజీనగర్‌లోని ఎల్‌పి 66/82లో ఉన్న రిజర్వు ఖాళీ మున్సిపల్ స్థలం 1.06 ఎకరాలు, ఆదిత్యనగర్‌లో ఎల్‌పి 55/95 రిజర్వుడ్ ఖాళీ మున్సిపల్ స్థలం 0.375 సెంట్లు మొత్తం 1.765 ఎకరాలు భూమిని అప్పగించాలని రాధాకృష్ణారెడ్డి కోరుతున్నారు. ఇందుకు కొందరు ప్రజా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు తలొగ్గి ఈ స్థలాలను అప్పగించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఈ స్థలాల దస్త్రం పెండింగ్‌లో ఉంది. గత పదేళ్లుగా కోర్టులు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా ఈ వివాదం తిరిగి మళ్ళీ కదలిక మొదలైంది. ఓ ప్రజా ప్రతినిధి గట్టిగా పటుబట్టడంతో అప్పనంగా మున్సిపల్ స్థలాలను అప్పగించేందుకు సిద్ధ్దమవుతున్నారు.రూ.5కోట్ల్ల ఈమున్సిపల్ స్థలాలను ఇలా పక్కదారి పట్టిస్తుండడం భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తప్పవు.