నేడు నెల్లూరు

Saturday, April 24, 2010

మత్తెక్కిస్తున్న డాబాలు ... నెత్తురోడుతున్న జాతీయ రహదారులు

జాతీయరహదారిపై..

జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే నేడు చాలా వరకు భయాందోళనలకు గురవుతున్న పరిస్థితి నేడు నెలకొనివుంది. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిందంటే నేరుగా వారు యమపురికి టిక్కెట్టు పొందినట్లే . నాలుగు లైన్ల జాతీయరహదారి వచ్చిన తరువాత వాహనాలు వేగానికి అంతే లేకుండా పోయింది. ఈ వాహనాల వేగానికి అడ్డుకట్ట వేయవలసిన పోలీసు శాఖ, రవాణా శాఖ పట్టించుకొనే పరిస్ధితిలో లేరు. దీనికి తోడు మద్యంసేవించి వాహనాలు నడుపరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ దానిని అమలు పరచే నాధుడే లేడు. జాతీయరహదారి జిల్లాలో దాదాపు 190 కిలోమీటర్లు ఉంది . అయితే జాతీయరహదారిపై జిల్లాలో మొత్తం డాబాలు సుమారు 100పై చిలుకు ఉండటం విశేషం.

జాతీయరహదారిపై తిరిగే వాహన చోదకుల కోసం ఏర్పడిన ఈ డాబాలు అంచెలంచెలుగా ఎదిగి బార్‌ అండ్‌ రెస్టారెంటులుగా ఏర్పడ్డాయి. వీటిని నిరోధించాల్సిన పోలీసుశాఖ మాత్రం అధికారులు ఛీవాట్లు పెట్టినపుడు నామమాత్రంగా తనిఖీలు నిర్వహించటం షరామామూలుగా ఉంది. ప్రతి నెలా పోలీసు అధికారులకు టంచనుగా వేలకు వేలు అందించే ఈ డాబాలు పోలీసులపాలిట కామధేనువులు కావటంతో వాటి జోలికి వీరు పోరనే నిజం నిత్య సత్యం. నగరంలో రోజురోజుకి చోరీలు పెరగటం, అఘాయిత్యాలు, గొడవలకి కారణాలు ఈ డాబాలలో మితిమీరి మద్యం అమ్మకాలను తెల్లవారుజాము వరకు అమ్మతుండటంతో మద్యంసేవించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అంతేకాక నగర పోలీసు స్టేషనుకు కూతవేటు దూరంలో డాబాలు నిర్వహిస్తున్నప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు సర్వత్ర వినిపిస్తున్నాయి.


మూలనపడ్డ హైవే మొబైల్‌

జాతీయ రహదారిపై ఏదైనా ప్రమాదం జరిగినా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించేవారు ఎవరైనా హైవేపై తారసపడినా హైవే దొంగతనాలు జరగకుండా చూడాల్సిన హైవే మొబైల్‌ నేడు మూల పడింది. కేవలం హైవే మొబైల్‌ మామూళ్ల మత్తులో జోగుతుందన్న కారణంగా ఈ మొబైల్‌ను మూలన పెట్టారు. వాటికే వెచ్చించిన లక్షల రూపాయల వాహనాలు నేడు నిర్వీర్యంగా ఉండడం విశేషం. హైవేపై పెట్రోలింగ్‌ చేస్తూ హైవే దొంగతనాలు జరగకుండా సకాలంలో జాతీయ రహదారిపై ప్రమాదాలు సంభవించినపుడు ఆదుకుంటూ ఉండే ఈ హైవే మొబైల్‌ను తీసివేయడం చాలా ఘోరమని పలువురు విమర్శిస్తున్నారు.

తిరిగి మొబైల్‌ను రంగంలోకి దించి రహదారిపై నిఘా పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ఎస్‌పి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వినూత్న పద్ధతిలో ట్రాఫిక్‌, చోరీలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి అనేక చర్యలు తీసుకుని పలువురి మన్ననలు పొందడం జరిగింది. అదేవిధంగా జాతీయ రహదారిపై ప్రమాదాలకు, గొడవలకు, హత్యలకు కారణాలుగా ఉన్న డాబాల్లో జరిపే అక్రమ మద్యం విక్రయాలను నిరోధించగలిగితే చాలావరకు జిల్లాలో ప్రమాదాలను, గొడవలను నివారించవచ్చు. దీనికి తోడు తిరిగి హైవే మొబైల్‌ను జాతీయ రహదారిపై తిప్పుతూ నిఘాను పెంచినట్లయితే మద్యం తాగి వాహనం నడిపేవారిని, చోరీలకు పాల్పడేవారిని నియంత్రించవచ్చని ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు.

No comments: