నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

నమ్మితే నట్టేట మునిగినట్లే!

ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం.. అది ఉన్నప్పుడే సమాజంలో రాణించగలం. అలాంటి నమ్మకాన్ని కొందరు సొమ్మ చేసుకుంటున్నారు. రూ.కోట్లలో బాధితులకు శఠగోపం పెడుతున్నారు. ఇలా మోసపోయిన వారు నెల్లూరులో బారులు తీరుతున్నారు. దీంతో నమ్మితే నట్టేట మునిగినట్టే అన్న చందంగా బాధితుల పరిస్థితి మారింది. పొదుపు భవిష్యత్తుకు మదుపు అనే భావన జిల్లా ప్రజల్లో మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల చదువు కోసమనో, పెళ్లిళ్లకోసమో, వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందనో తమ సంపాదనలో కొంత దాచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో తినోతినకో కష్టపడి సంపాదించిన సొమ్మను నెల నెల చీటీలు వేస్తున్నారు.

అలాగే తమ వద్ద ఉన్న నగదుకు బ్యాంకుల్లో తక్కువ వడ్డీ వస్తుందని ఎక్కువ వడ్డీ ఆశించి అడిగిన వారికి ఇస్తుంటారు. ఇలాంటివారిని నమ్మించి, నట్టేట ముంచే వారు సమాజంలో రోజురోజుకు ఎక్కువ అవుతున్నారన్న విషయం ఇటీవల నగరంలో జరిగిన ఘరానా మోసాలు పరిశీలిస్తే అర్ధం అవుతోంది. అందులో కొన్ని మచ్చుకు...

నవాబుపేటకు చెందిన ఓ బంగారు వ్యాపారి తోటి వ్యాపారుల వద్ద, సన్నిహితుల వద్ద నమ్మకం ఉంటూ ఆర్థిక లావాదేవీలు సాగిస్తూ వచ్చాడు. అలా నమ్మకంగా వ్యవహరిస్తూనే పలువురి వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. ఆ తర్వాత వారి నమ్మకాన్ని వమ్ము చేసి రూ. కోటికి పైగా ఎగనామం పెట్టాడు. దీంతో బాధితులు గోడు చెప్పడానికి వీలులేకుండా పోయింది.

నగరంలోని ట్రంకు రోడ్డులో ఉన్న బ్యూటీ ప్లాజా నిర్వాహకుడు ప్రభుశంకర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీలు నడపుతున్నాడు. డైలీ, నెలవారి చీటీలు నిర్వహించడం, పలువురి వద్ద వడ్డీకి అధిక మొత్తంలో అప్పులు తీసుకోవడం చేస్తూ నమ్మకంగా ఉన్నాడు. ఇలా తనని నమ్మిన పలువురికి రూ. 9 కోట్లకు పైగా శఠగోపం పెట్టాడు.

నగరంలోని దర్గామిట్టలో ఉన్న శ్రవణ్య ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని సొమ్మ చేసుకుని రూ.. 20 కోట్లకుపైగా శఠగోపం పెట్టి బోర్డు తిప్పేసింది. పలు రకాలుగా ఇబ్బందులు పడే వారు అక్కడ సులువుగా రుణాలు ఇస్తున్నారంటే నమ్మారు. దీంతో వారు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత శాతం కట్టమంటే అప్పు చేసి, కట్టారు. ఆ సొమ్మతో శ్రవణ్య సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి ఇబ్బందులు తీరకపోగా ఇంకా అప్పుల్లో కూరుకు పోయారు.

నగరంలోని స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మాల్యాద్రి తన మాటతీరుతో అందరిని నమ్మించాడు. పలువురి వద్ద రూ. కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చాడు.

డైలీ, వీక్లీ, మంత్లీ చీటీలు నిర్వహించడం, ఇతరుల వద్ద వేయడం, ఫైనాన్స్ కార్యకలాపాలు సాగించేవాడు. అలా రూ.. 4 కోట్లకు పైగా ఎగనామం పెట్టి కుటుంబీకులతో పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి.

లబోదిబో మనడమే బాధితుల వంతు
నమ్మకంగా ఉండి మోసం చేసే వారు ఎక్కువ కావడంతో బాధితులు లబోదిబోమనడమే తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. ఒక్కొక్కరు రూ. లక్షల్లో నష్టపోయి ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు తాము ఏమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు.

డబ్బు దాచుకోవడానికి నిర్ధిష్టమైన మార్గాలున్నాయి:
డబ్బు దాచుకోవాలంటే నిర్ధిష్టమైన మార్గాలు అనేకం ఉన్నాయి. బ్యాంకుల్లో పలు రకాల పథకాలు ఉన్నాయి. అక్కడ దాచుకుంటే ఏ క్షణంలోనై తిరిగి పొందే అవకాశం ఉంది. కాని ప్రైవేటు వ్యక్తులను నమ్మి డబ్బు దాచుకోవాలంటే ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో చెప్పలేం. ప్రైవేటు ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టి, బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేయాలి. మోసాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
ఇ. దామోదర్, జిల్లా ఎస్పీ

ఓదార్పులో పాల్గొంటే చర్య: సోమిరెడ్డి

రాష్ట్రంలో రోజుకో కుంభకోణం వెలుగుచూస్తోందని, అధికార పార్టీలోని సీనియర్ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ శాఖ అతిథి గృహంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి పచ్చి మోసగాడని, గెలిచిన వారం రోజుల్లోపే డబ్బులకు కక్కుర్తి పడి ఆకర్షణ పేరుతో పార్టీ వీడారన్నారు.

జగన్ ఓదార్పుకు టీడీపీ నాయకులు ఎవరూ మద్దతు ఇవ్వడం లేదని, మద్దతు పలికిన వారంతా ప్రసన్న మనుషులేనన్నారు. ఒకవేళ ఎవరైనా ఓదార్పులో పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చీటీల పేరుతో ఘరానా మోసం

నగరంలోని ఓ ప్రైవేట్ చీటీల నిర్వాహకుడు రూ. 4 కోట్లకు పైగా దండుకుని కుంటుంబ సభ్యులతో పరారైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మల్యాద్రి ప్రైవేటుగా చీటీలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహించడం, అధిక వడ్డీకి రుణాలు తీసుకుని, తిరిగి చెల్లిస్తూ వ్యాపారలావాదేవీలు సాగిస్తూ నగరంలో పలువురి వద్ద నమ్మకాన్ని సంపాదించుకున్నాడు.
ఆ నమ్మకంతోనే తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలో నాలుగు సంవత్సరాల క్రితం ట్రావ్‌ల్ వ్యాపా రం ప్రారంభించాడు. అందులో టెంపోలు, పలు రకాల కార్లు పెట్టి బాడుగలకు తిప్పడం చేసేవాడు.

అంతే కాకుండా తనకు అప్పులిచ్చిన వారికి వాహనాలు అవసరమైతే ఉచితంగా పంపేవాడు. ఇలా నమ్మకంగా వ్యవహరిస్తూ అతను బయట అధిక మొత్తంలో వేసిన చీటీలన్నీ పాడుకున్నాడు. అలాగే తన వద్ద చీటీలు వేసిన వారికి చెల్లింపులు నిలిపి వేసి, తిప్పడం ప్రారంభించాడు. ఇలా ఎవరికి అనుమానం రాకుండా తన కార్యకలాపాలను సాగిస్తూ వచ్చాడు. ఇలా పలువురికి చెందిన రూ.4 కోట్లకు పైగా సొమ్ముతో బుధవారం ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో పరారయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితులు అతని సెల్‌ఫోన్లకు పోన్ చేస్తే అవి పని చే యడం లేదు. దీంతో అతనికి వడ్డీకి నగదు ఇచ్చిన వారు, చీటీలు వేసిన వారు, అతను పాడుకున్న చీటీల నిర్వాహకులు స్టోన్‌హౌస్‌పేటలోని అతని ఇంటికి పరుగులు తీశారు. అక్కడ ఇంటికి వె ళ్లి చూస్తే తాళం వేసి ఉండటంతో ఊసురోమంటూ వెనుదిరిగారు.

ప్రజానేత ఆనం వెంకటరెడ్డి

మాజీ మంత్రి ఆనం వెంకటరెడ్డి కల్మషంలేని వ్యక్తి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరం రామలింగాపురం కూడలి వద్ద బుధవారం ఉదయం నిర్వహించిన ఆనం వెంకటరెడ్డి 101వ జయంతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను 16 ఏళ్ల ప్రా యంలో ఉన్నప్పుడు 1956లో మైపాడులో నిర్వహించిన రాజకీయ శిక్షణ శి బిరంలో ఆనం వెంకటరెడ్డి పరిచయమయ్యారని గుర్తు చేసుకున్నారు.

వెంకట రెడ్డి కల్మషంలేని మనిషని ఆయన కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏసీ సుబ్బారెడ్డి వెనుక అదృశ్యశక్తి వెంకటరెడ్డేనన్నారు. వెంకటరెడ్డి కాలంలో గ్రూపు రాజకీయాలను ప్రస్తావిస్తూ ఎంతగా విభేదాలున్నా పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ ప్రయత్నించేవారు కాదన్నారు. ఆనం కుటుంబం దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించడానికి ప్రజలతో మమేకం కావడమేనన్నారు.

మహోన్నత నేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డి రాష్ట్ర ఆస్తి అని పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం పేర్కొన్నారు.

ఆనం వెంకటరెడ్డి జయంతి సభలో ఆయన మాట్లాడుతూ నేటి తరం నాయకులు వెంకుబాబు(ఆనంవెంకటరెడ్డి)ని ఆదర్శంగా తీసుకొని, రాజకీయ విలువలు కాపాడాలని సూచించారు. ఏసీ సంపూజన సమితి ట్రస్టు అధ్యక్షుడు నాగారెడ్డి హరిశ్చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన జయంతి సభలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు.

నెల్లూరు నగర ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ 60 ఏళ్ల క్రితమే నె ల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఆనం వెకంటరెడ్డి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బూదాటి రాధయ్య, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, నగర మేయర్ నంది మండలం భానుశ్రీ, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల శ్రీహరి నాయుడు, మాగుంట పార్వతమ్మ, కాటంరెడ్డి విష్ణువర్ధనరెడ్డి, సీవీ శేషారెడ్డి, ఏసీ సంపూజన సమితి ట్రస్టు సభ్యుడు ఎల్‌వీ కృష్ణారెడ్డి, వేమారెడ్డి శ్యామసుందరరెడ్డి, పత్రి రవీంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు చాట్ల నరసింహారావు, ఆనం విజయకుమార్‌రెడ్డి, వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, చేవూరు దేవకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆనం వెంకటరెడ్డి జీవిత చరిత్రపై ఏసీ సంపూజన సమితి వెలువరించిన ‘అందరికీ ఆప్తుడు’ పుస్తకాన్ని మంత్రి గాదె వెంకటరెడ్డి ఆవిష్కరించారు. వీఆర్ కళాశాల విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షుడు మెట్టు రామచంద్రప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. ఉత్తమ దిగుబడులు సాధించిన వేగూరు పరమేశ్వరరెడ్డి, మహేశ్వరరెడ్డి, రమణయ్య, లేబూరు పరమేశ్వరరెడ్డి, కాసా ఎల్లారెడ్డి, నంబూరు గజేంద్రరావు, నాగిరెడ్డి రామకృష్ణారెడ్డి, సూరం మాల కొండారెడ్డి తదితర రైతులను మంత్రి సత్కరించారు.

విహెచ్‌కు ఎంపి మేకపాటి సవాల్

జగన్ ఓదార్పు యాత్రపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు చేస్తున్న వ్యాఖ్యలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం దర్గామిట్టలోని తన గెస్ట్‌హోస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను తాను చేశానంటూ విహెచ్ అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎవ్వరిని పరుషపదజాలంతో మాట్లాడలేదని, అలాంటి తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్ మరణానంతరం మృతి చెందిన వారిని ఓదార్చేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర పట్ల విహెచ్ చులకనగా మాట్లాడటం బాధకరమన్నారు. జగన్ వెనుక వస్తున్న వారంతా డబ్బులతో వచ్చిన వారేనని ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. డబ్బులతో వచ్చిన జనం కాదని, వారంతా వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులన్న విషయాన్ని ఆయన గుర్తించుకోవాలన్నారు. తనకు అంతా ఉబలాటంగా ఉంటే తాము డబ్బు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో ఎక్కడైనా జనంలో తనకు ఉన్న పరపతి ఏమిటో నిరూపించుకోవాలని ఆయన విహెచ్‌కు సవాల్ విసిరారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జగన్ నాయకత్వం చాలా అవసరమని చెప్పారు. అందుకే ఆయన వెంట తాము ఉన్నామన్నారు. వైఎస్ మరణానంతరం నుంచి నేటికి ఇచ్చిన మాటకు కట్టుబడి తాము జగన్ వెంట ఉన్నామన్నారు. అలాంటి తమపై వ్యాఖలు చేయడం విహెచ్ విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హస్తం గుర్తుతోపాటు భవిష్యత్తులో రాష్ట్రంలో వైఎస్ ఫొటో ఎంతో అవసరమని చెప్పారు. వేదికను ఎక్కే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగి ముందు హస్తంతోపాటు వైఎస్ ఫొటోను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కొందరు పనిగట్టుకుని జగన్, సోనియాగాంధీ మధ్య చిచ్చులు పెడుతున్నారని, అలాంటి వారు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. జగన్ భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌కు దిశ, దశ నిర్దేశకునిగా మారునున్నారని తెలిపారు. అనంతరం కోవూరు ఎంపిపి అధ్యక్షులు వేలూరు కృష్ణ, ఉపాధ్యక్షులు విజయకిరణ్, కొడవలూరు జడ్పీటీసి శ్రీనివాసులు, గూడూరు 4వ వార్డు కౌన్సిలర్ టి నాగేశ్వరరావు, కొడవలూరు ఎంపిపి ఉపాధ్యక్షులు సూర్యనారాయణతో పాటు మరో 29మంది జగన్ యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రసన్న గోడమీద పిల్లి

ఉదయగిరి,సెప్టెంబరు29 : కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గోడ మీద పిల్లి లాగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రస్తానం కలిగిన నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేరును చెడగొడుతున్నాడని జిల్లా దేశం పార్టీ అధ్యక్షులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఉదయగిరి నీటిపారుదల శాఖ అతి«థిగృహంలో నియోజకవర్గస్థాయి దేశం పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మాజీ శాసనసభ్యులు కంభం విజయరామిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సోమిరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పట్ల జరుగుతున్న కక్షసాధింపు చర్యలను చూస్తూ ఊరుకోబోమన్నారు.

జిల్లా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిలు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. జిల్లాలో రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఎంపీ, మంత్రి ఏమీ పట్టనట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుకు సహాయసహకారాలు అందిస్తానని చెప్పగా పమిడి రవికుమార్ 5 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.