నేడు నెల్లూరు

Friday, June 18, 2010

ఉదయగిరి మేకపాటి జాగిరా...?

ఉదయగిరి నియోజక వర్గాన్ని శాసన సభ్యులు ఆయన జాగిరులా వాడుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కరటంపాడు గ్రామంలో టిడీపి నాయకులు కన్నబాబు నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే రెండువ దశ గెలవడంతో నియోజక వర్గాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని అధికారులను హింసిస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు మేకపాటికి కంపెనీలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని దింతో ప్రజలకు అన్ని విధాల అన్యాయం జరుగుతుందని మండి పడ్డారు.

ఎన్నోదఫాలు టీడిపి వాళ్లకు అన్యాయం జరిగినా పోలీసులు స్పందించటం లేదని ఎక్కడైనా కాంగ్రెస్‌ వాళ్లకు చిన్నపొరపాటు జరిగితే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని తెలిపారు. నియోజక వర్గంలో జరిగే విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లి ఉన్నామని అయినా అధికారుల్లో మార్పులు కనిపించటం లేదని విచారం వ్యక్తం చేశారు. ఓవైపు ఎక్కడ ఏమి జరిగినా స్పందించే రెవెన్యూ ఉద్యోగులు ఉదయగిరి నియోజక వర్గంలో వాళ్ల అధికారులను మేకపాటి ఇబ్బందులు పెడుతున్నా స్పందించక పోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. మర్రిపాడు మండలం వాళ్ల సొంత మండల కావడంతో చట్టాన్ని ఆయన చేతుల్లోకి తీసుకొని అధికారులను బానిసలుగా చేస్తున్నారని మండి పడ్డారు. అధికారులు సైతం ఏకపక్షంగా పనిచేస్తున్నారని అన్నారు. హద్దు మీరితే మేముకూడా సిద్ధంగా ఉన్నామని అన్ని రోజులు ఒకేలా ఉండవని హెచ్చరించారు.

అందరి చూపు ‘మేయర్‌’ పీఠం వైపే

మరో మూడు నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు రానున్న తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు, నేతల చూపు నగరపాలక సంస్థ మేయర్‌ పీఠంపైనే ఉన్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకమైన మేయర్‌ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాల్లో అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వేయని ఎత్తులు, చేయని జిమ్మిక్కులు లేవని చెప్పవచ్చు. 2005 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం మేయర్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు అవకాశం వచ్చినా వారి స్వయంకృతాపరాధం వల్ల ఆ పీఠాన్ని కాంగ్రెస్‌ వారికి తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లు ఇచ్చారు. మేయర్‌ స్థానం కోసం అవసరమైన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఎలాగోలా దక్కించుకోగలిగింది. అయితే అప్పట్లో కలిసి పోటీ చేసి మేయర్‌ స్థానం కైవసం చేసుకునేందుకు సహకరించిన కామ్రెడ్‌లు ఈసారి కత్తులు దూస్తున్నారు.

అయితే అందుకు ప్రత్యామ్నాయంగా ఈసారి ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌తో దోస్తిగా ఉన్నా ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ పరిశీలకులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం తమ ‘చేతి’లో ఉన్న మేయర్‌ స్థానాన్ని తిరిగి ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. స్వపక్షంలో విపక్షంగా తయారైన రాజీవ్‌భవన్‌ నేతలు మరో వైపు ఇదే ఆలోచనలో ఉన్నారు. నిప్పులో ఉప్పు అన్న చందాన వ్యవహరిస్తున్న ఈ రెండు వర్గాలు ఎన్నికల నాటికి ఒకటవుతాయా? లేక అప్పటికీ ఇలాగే కొనసాగుతాయా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. నాకు ఒక కన్ను పోయినా ఫరవాలేదు, శత్రువుకు రెండు కళ్లు పోయేలా చూడాలనే పంథాన ఇరువురు పయనిస్తే మూడోవారికి స్థానం లభించినట్లే.

కార్పొరేషన్‌ మేయర్‌ పీఠం దక్కించుకునేందుకు ఆనం వర్గీయులు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా చేస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమైవున్నారు. దీనిలో భాగంగా కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న నూతన కార్పొరేషన్‌ భవనాన్ని జూలై 15వ తేదీ లోపు పూర్తి చేసి తమ హయాంలోనే వందేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచిపోయే కార్పొరేషన్‌ భవనాన్ని నిర్మించామని చెప్పుకునేలా పనులు ఆగమేఘాలపై జరుగుతున్నాయి. మరో వైపు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటున్నాయి. ఇవన్నీ ఒక పథకం ప్రకారమే జరుగుతుండడం గమనార్హం.

ఇదిలా ఉంటే రాజీవ్‌ భవన్‌ నేతలు సైతం కార్పొరేషన్‌ను కైవసం చేసుకునేందుకు చాపకింద నీరులా తమ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందుకు వీరికి తెరవెనుక జడ్పీ ఛైర్మన్‌ కాకాణి గోవర్థన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డిలు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుండడం తెలిసిందే. దీంతోపాటు వీరు సొంత నిధులతో మంచినీటి ట్యాంకర్‌ను నగరంలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తిప్పడం, నగరంలో దోమల నివారణకు ఫాగింగ్‌ మిషన్‌ను పంపడం వంటి కార్యక్రమాలతోపాటు ఇటీవల జరిగిన ఓటర్ల నమోదు కార్యక్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పెద్ద ఎత్తున ఓటర్లను చేర్పించినట్లు తెలిసింది. మరో వైపు నెల్లూరు నగర నియోజకవర్గంతోపాటు రూరల్‌ నియోజకవర్గంలో కలిసే అన్ని డివిజన్లలో తమ ముద్ర గల అభ్యర్థులను ఇప్పటికే రంగంలోకి దించేందుకు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పార్టీలతో పని లేకుండా రాజీవ్‌భవన్‌ తరపున అన్నట్లుగా వారు వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ సైతం గతంలో చేజార్చుకున్న మేయర్‌ పీఠాన్ని ఈదఫా ఎలాగైనా దక్కించుకోవాలనే కృత నిశ్చయంతో ఉన్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఆ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో (జిల్లా సమీక్ష) సైతం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా నెల్లూరు నగర మేయర్‌ స్థానాన్ని సాధించుకురావాలని జిల్లా నేతలకు చెప్పడం గమనార్హం. ఎలాగైనా సరే ప్రత్యర్థులైన ఆనం సోదరులకు ధీటుగా నెల్లూరు నగరాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకురావాలని చెప్పడం చూస్తుంటే వారి పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రజారాజ్యం పరిస్థితి ఈ దఫా కార్పొరేషన్‌ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలుపుతుందా అన్నది తెలియాల్సివుంది. ఇప్పటి వరకు నగర ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ జిల్లా అధ్యక్షులు ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి నగరాభివృద్ధి కోసం కాని ఇతర కారణాలు ఏవైనప్పటికీ ఆనం సోదరులతో సఖ్యతగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో కలసి పోటీ చేయవచ్చనే అంశానికి బలాన్ని చేకూరుస్తుంది. మరోవైపు ఆ పార్టీ అధిష్టానం సైతం ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలపడం చూస్తుంటే ఎలాంటి అనుమానం లేదనేలా పరిస్థితి తయారైంది.

ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న భారతీయ జనతాపార్టీకి ప్రస్తుతం జవసత్వాలు వచ్చినట్లయింది. మొత్తం పార్టీలో రాష్ట్రం నుంచి జిల్లా వరకు యువతకు ప్రాధాన్యం లభించడంతో వారు సైతం ఎలాగైనా నగరంలో తమదైన ముద్ర వేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు కామ్రెడ్‌లు సైతం నగరంలో తమ బలాన్ని గతంలో కన్నా పుంజుకునేలా చేసుకునేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నగరంలో చెప్పుకోదగ్గ పట్టు లేని సిపిఐ సైతం ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వచ్చిన సందర్భంగా నగరంలో పది డివిజన్ల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారంటే వారు సైతం నగరంలో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. అయితే రాబోయే ఎన్నికల్లో నగర మేయర్‌ ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అని తేలాల్సివుంది. మరోవైపు నగరంలో ఉన్న 50 డివిజన్లలో ఈ దఫా రిజర్వేషన్లు పూర్తిగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాకపోయినా, మేయర్‌ రిజర్వేషన్‌ ఎవరిని వరిస్తుందోనని తెలియకపోయినా రాజకీయ పార్టీల ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా సాగుతున్నాయని చెప్పక తప్పదు.

బంగారు వ్యాపారిపై దాడి

నగరంలోని కొరడావీధి ప్రాంతంలో మణి ఆచారి అనే బంగారు వ్యాపారిపై గుర్తు తెలియని ఇద్దరు దుండగులు కర్రలతో దాడి చేసి సుమారు 10లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాలు ఇలా వున్నాయి. కొరడా వీధికి చెందిన బంగారు వ్యాపారి మణి చెన్నై బంగారు వ్యాపారస్తుల వద్ద బంగారాన్ని తీసుకుని వచ్చి ఆభరణాలుగా తయారు చేసి తిరిగి చెన్నై వ్యాపారస్తులకు అందిస్తుంటారు. మంగళవారం ఉదయం చెన్నై వెళ్లిన మణి సుమారు 600గ్రాముల బంగారాన్ని తీసుకుని బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో నెల్లూరు రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ వద్ద పార్కు చేసిన తన మోటారు సైకిల్‌ను తీసుకుని మణి ఇంటికి బయలు దేరడంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని మోటారు సైకిలుపై వెంబండించి మణి ఇంటి వద్ద చేరుకొనే సరికి కర్రలతో అతని తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అతను మెడకు తగిలించుకుని ఉన్న బ్యాగ్‌ను దోచుకుని వెళ్లారు. ఆ బ్యాగ్‌లో 600గ్రాముల బంగారం, 36వేలు నగదు ఉండడంతో మణి గట్టిగా కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల స్థానికులు అక్కడకు చేరుకుని దుండగులు కోసం గాలించారు. అయితే ఆ సమయంలోనే కరెంటు పోవడంతో దుండగులు సునాయాసంగా పరారయ్యారు. స్థానికులు మణిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3వ నగర క్రైం ఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.