నేడు నెల్లూరు

Saturday, July 30, 2011

ఉగ్రవాదుల్లా మాట్లాడకండి-సోమిరెడ్డి

తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ ఉద్యోగ సంఘాలు , ఇతర సంఘాలు జరిపే సకల జనుల సమ్మెలో పాల్గొనకపోతే రాళ్లతో దాడులు చేస్తామని సీమాంధ్ర ఉద్యోగులను హెచ్చరించడం వివాదాస్పదం అవుతోంది.ఈ తరహా ప్రకటనలు తెలంగాణ లక్ష్యాన్ని దెబ్బతీస్తాయని కొందరు విమర్శిస్తుంటే, ఇలాంటి ప్రకటనలు చేయడం తప్పని మరికొందరు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ టిడిపి ఎమ్.పి రమేష్ రాధోడ్ మాట్లాడుతూ దాడులు చేయాలనడం సరికాదని వ్యాఖ్యానించారు.కాగా దీనిపై తెలుగుదేశం కోస్తా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొంతమంది ఉగ్రవాదులు మాదిరి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగాఉండడం కోసం ఎన్ని అవమానాలు అయినా భరిస్తామని వ్యాఖ్యానించారు. హైదరాబాదులో సీమాంధ్రుల పెట్టుబడులు భారీగా ఉన్నాయని కూడా ఆయన అన్నారు.కాగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలా? వద్దా అనేది తెలంగాణ టిడిపి ఫోరం మీటింగులో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు.ఏది ఏమైనా సీమాంధ్ర ఉద్యోగులు విధులకు హాజరైతే దాడులు చేస్తామని, ప్రజాప్రతినిదులు రాజీనామాలు చేయకపోతే రాళ్లతో దాడి చేస్తామని అనడం సమంజసం కాదు. కాకపోతే ఇలాంటివాటిని తెలంగాణ లోని కాంగ్రెస్ నేతలు, టిఆర్ఎస్ నేతలు ఖండించకపోవడం కూడా గమనించదగ్గ విషయమే.

Friday, July 29, 2011

నెల్లూరు అల్లుడు ఎదురు జోక్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్ల పర్యటనలో అల్లుడి సెంటిమెంటును ఉపయోగించుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి అల్లుడు సెంటిమెంటును ఒకరిపై ఒకరు ప్రయోగించుకున్నారు. నెల్లూరు కు కిరణ్ కుమార్ రెడ్డి అల్లుడు అయినందున జిల్లాకు మరింతగా నిధులు సమకూర్చాలని, ముఖ్యంగా ఓషనోగ్రఫి సంస్థ ఏర్పాటుకు కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి కాస్త చమత్కారాన్ని జోడించి అన్నారు. దానికి కిరణ్ కుమార్ రెడ్డి బదులు ఇస్తూ, అల్లుడు సెంటిమెంటుతోనే జవాబు ఇస్తూ, సంప్రదాయం ప్రకారం అల్లుడికే ఏమైనా ఇవ్వాలి కాని, అల్లుడి నుంచి ఏమీ డిమాండు చేయకూడదని బదులు చెప్పడం తో మరింత చమత్కారంతో బదులు చెప్పడంతో అక్కడ ఉన్న జనం అంతా నవ్వారు.కిరణ్ కుమార్ రెడ్డి భార్య నెల్లూరు జిల్లావాసి కావడంతో ఈ జోక్ లు విసురుకున్నారు.

ఆనం వివేకా చెవిపోగు రహస్యం


నెల్లూరు జిల్లా లో రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం వివేకానందరెడ్డి స్పెషాలిటీనే వేరు. ఆయన ఒక్కో రోజు ఒక వేషధారణతో ఉంటారు. ఒకరోజు పంచెకట్టుకుంటారు. మరో రోజు పైజమా, లాల్చి ధరిస్తారు.ఇంకో రోజు సూటు,బూటు వేస్తారు. మరుసటి రోజు పాంటు, షర్టులో దర్శనమిస్తారు.ఇక వేరే విషయాలలో కూడా అంతే టోపీతో జనంలోకి ఒకసారి వెళితే , ఇంకో రోజు కిర్రు చెప్పులతో హడావుడి చేస్తారు. ఇలా రకరకాల వేషాలతో జనంలో సందడి చేసే ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు సరికొత్త అవతారంతో దర్శనమిస్తున్నారు. ఆయన చెవికి పోగు పెట్టారు.అది బాగా ఖరిదైన వజ్రాన్ని వాడినట్లున్నారు. మంచి మెరుపుతో ఆకర్షణీయంగా ఉంది. ఏమిచి చెవిపోగు రహస్యం అని అడిగితే ఆయన ఆసక్తికరమైన సమాధానం చెబుతారు. ఓ పదిహేను సంవత్సరాల క్రితం ఒక సిద్దాంతి కలిసి చెవి పోగు పెట్టుకుంటే బాగుంటుందని, ఆయనకు మంచి జరుగుతుందని చెప్పారట. అప్పటినుంచి చెవి పోగు పెట్టుకోవాలని అనుకుంటూనే ఉన్నారట. కాని చెవికి ఈ వయసులో కుట్టించుకుంటే ఇబ్బంది అనుకుని, చెవి కుట్టేటప్పుడు నొప్పి భరించలేమనుకుని ఇలా వాయిదా వేసుకుంటూ వచ్చారట. అయితే ఈ మధ్య ఆధునిక పరిజ్ఞానం రావడం ఎలాంటి నొప్పి లేకుండా చెవి కుట్టే అవకాశం ఉండడం, చెవిపోగు కోర్కె తీర్చుకోవాలని అనుకున్నారట. ఆ ప్రకారం ఆయన కొద్దిరోజుల క్రితం చెవి కుట్టించుకుని పోగు పెట్టుకుని కొత్త కళతో కనిపిస్తున్నారు.ఏమైనా కలిసి వచ్చిందా అనిఅడిగితే, అంతా బాగానే ఉంది కదా అని అంటున్నారు. లోపల ఏదో విషయం ఉన్నా బయటపడకుండా జాగ్రత్తగా మాట్లాడుతున్నారులే ఆయన మాట విన్నవారు అనుకుంటున్నారు.రాజకీయాలలో ఉన్నవారికి రకరకాల సెంటిమెంట్లు ఉంటాయి.అందులో ఇది ఒకటి కావచ్చు.

Tuesday, July 26, 2011

తానా సభల్లో వాకాటి

అమెరికాలో ఇటీవల జరిగిన 18వ తానా సభల్లో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్ర త్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. నెల్లూరు ప్రవాసాం«ద్రులు నిర్వహించిన కార్యక్రమాల్లో ప్రసంగించారు.

నెల్లూరు ఎన్ఆర్ఐ వెబ్ సైట్‌ను ప్రా రంభించి, సొంత సంస్థ వీఎన్ఆర్ ఇన్‌ఫ్రా చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు, వ్యాపార అభివృద్ధిని వెల్లడించారు.
ఐదు రోజుల పాటు తానా కార్యక్రమాల్లో పాల్గొని జిల్లా ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ నెల్లూ రు మొలగొలుకులు, చేపల పులుసుతో నెల్లూరు ఆతిథ్యాన్ని, ప్రత్యేక రాజకీయ శైలిని వివరించారు. వీఎన్ఆర్ ఏర్పాటు 1984లో వీఎన్ఆర్ సంస్థను నెలకొల్పిన వాకాటి నారాయణరెడ్డి అంచలం చెలుగా వ్యాపారాభివృద్ధి సాగించారు. అమెరికా, లండన్ వంటి విదేశ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

భారత రైల్వే సిగ్నల్ వ్యవస్థలో వీఎన్ఆర్ ఇన్‌ఫ్రా ప్ర«థమ స్థానంతో దూసుకెళ్లింది. ఈ సంస్థలో రక్తసంబంధీకులు కాకుండా కంపెనీ పట్ల వృత్తి పరంగా అంకిత భావంతో పని చేసే వారినే డైరెక్టర్లుగా చేశారు. మనం బతకడం...పది మందిని బతికించడం అన్న నానుడిని నిజం చేస్తూ యువతకు అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నారు.

రైల్వే వ్యవస్థలో ఆధునీకరణ పనులు నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయంగా 25 ఏళ్లుగా కొనసాగుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అయిన స్థానిక కేడర్‌ను ఒకే తాటిపై తీసుకుని వస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా అందరిని కలుపుకునిపోయి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం చేస్తున్నారు.

రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికి కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలోని కాంగ్రెస్ నేతలను ఒకే బాటపై నేతలను నడిపించి విజయం సాధించారు.

గతంలో వైఎస్సార్ ఆశీస్సులతో డీసీసీబీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వాకాటి ఆ బ్యాంకును లాభాల్లోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం సోనియా గాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల ఆశీస్సులతో ఎమ్మెల్సీగా గెలుపొందారు.

అందరితో సన్నిహితంగా మెలగడంతో ఆదివారం జిల్లా పర్యటనకు విచ్చేసిన సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి స్వయంగా వాకాటి ఇంటికి విచ్చేసి ఆయన్ను అభినందించారు. తానా సభల్లో పాల్గొన్న వాకాటి వ్యాపార మెలకువలను వెల్లడించి, జిల్లాలో భారీగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పాలని సూచించారు.
డల్లాస్‌లో తెలుగువారు నిర్వహించిన కార్యక్రమాలకు జ్యోతి ప్రజ్వలనగావించారు. నెల్లూరు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఇలా ఐదు రోజుల పాటు తానా సభల్లో అన్ని తానై వ్యవహరించిన వాకాటి ప్రవాసాం«ద్రుల నుంచి ప్రశంసలు పొందారు.

సీఎం సమక్షంలో మాట్లాడనివ్వలేదు

జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వలేదని గూడూరు ఎమ్మెల్యే బల్లి దుర్గా ప్ర సాద్ ఆరోపించారు.
టీడీపీ జిల్లా కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు.
దళితుల సమస్యలపై ప్రజా ప్రతినిధిగా తనను మాట్లాడనీయకపోవటం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ల పనితీరు, ఆయా వర్గాల సంక్షేమంపై చర్చే లేకుండా మొక్కుబడిగా సమావేశం ముగించారని విమర్శించారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు నియోజకవర్గంలో అం తా తామై వ్యవహరిస్తున్నారన్నారు. నిధుల విడుదలపై మంత్రి ఆనం రా మనారాయణరెడ్డి గూడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పనబాక కృష్ణయ్యకు అధికారిక నివేదికను పంపటం ఏమిటంటూ ప్రశ్నించారు. స్వర్ణముఖి నది చెక్‌డ్యాం నిర్మాణ అం చనా వ్యయాన్ని భారీగా పెంచడం వె నుక కారణమేమిటన్నారు. తెలుగుగంగ కాలువలో పూడిక తీతకు ప్రభుత్వం హామీ ఇచ్చి రెండేళ్లయినా పనులు ప్రారంభం కాలేదన్నారు.

చల్ల కాలువ ప్యాకేజి నిర్మాణానికి 2009లోనే అగ్రిమెంట్లు జరిగినా నేటికీ పనులు ప్రారంభించలేదన్నా జల యజ్ఞం ధన యజ్ఞంగా మారిందని విమర్శించారు

వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం

దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. స్థానిక కరెంటు ఆఫీస్ సెంటర్‌లోని వైస్సార్ విగ్రహాన్ని సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ రాష్ట్రంలో రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారని, అయితే అదే ప్రభుత్వం ఆయన మరణానంతరం వారి కుటుం బాన్ని వెన్నుపోటు పొడుస్తుందన్నారు. 24వతేదీనాటి సీఎం పర్యటనలో ఒక్క ఫ్లెక్సీలో కూడా వైఎస్సార్ ఫొటో ఏర్పా టు చేయకపోవడం దారుణమన్నా రు.

పజల గుండెల్లో వైఎస్సార్ కొలువుదీరి ఉన్నారని, మీరెన్ని కుటల యత్నా లు చేసినా ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయలేర న్నారు. ఆనం సోదరులు వైఎస్సార్ నుంచి పదవులు పొంది, నాటకాలు ఆడుతూ వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఆ మహానేత కూడా భరించలేకపోయారన్నారు. అందుకు నిదర్శనమే తెరకూడా సహకరించకపోవడమన్నారు.

సినిమాహాలులో వివాదం ప్రజాప్రతినిధి కుమారుడిపై దాడి

నగరంలో ఆదివారం అర్థరాత్రి అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి రెండో కుమారుడిపై దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల కథనం మేరకు.. అధికార ప్రజాప్రతినిధి కుమారుడు నగరంలోని ఒక సినిమాహాలుకు ఆదివారం రెండో ఆటకు వెళ్లాడు. సినిమా చూస్తుండగా ఆయన కూర్చున్న సీటుకు ముందు కొందరు మహిళలు కూర్చుని ఉన్నారు.

ఆయన పక్కన ఉన్న కొందరు, ఆ మహిళలను అసభ్యపద జాలంతో మాట్లాడుతుండగా అతను ఏమిటని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆరుగురు యువకులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేశారని తెలిసింది. తాము దాడి చేసింది ఓ ప్రజాప్రతినిధి కుమారుడిపై అన్న విషయం తెలుసుకున్న ఆ యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. దాడి చేసిన ఆరుగురు యువకులు కుమ్మరవీధికి చెందిన వారుగా గుర్తించారు. ఈ సంఘటపై పోలీసులకు ఎటుంటి ఫిర్యాదు అందలేదు.

Samaikyandhra Conference at Tirupati

GMR invested Rs 55 cr in Jagan Companies : CBI

Sunday, July 24, 2011

Saturday, July 23, 2011

సీఎం పర్యటించే ప్రాంతాల్లో రాకపోకలు నిషేధం

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24, 25 తేదీల్లో నెల్లూరు జిల్లా పర్యటన దృష్ట్యా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం రోజు సీఎం పర్యటించే సమయంలో ఆ ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. సీఎం పర్యటించే సమయంలో వాహనాల రాకపోకలను నిషేధించే ప్రాంతాల వివరాలిలా ఉన్నాయి.

ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు వేదాయపాళెం నుంచి అంబేద్కర్ భవన్ వరకు, 11 నుంచి 12 గంటల వరకు వీఆర్‌సీ సెంటరు నుంచి వేదాయపాళెం వరకు, 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పొగతోట వెంకటరమణ హోటల్ నుంచి వీఆర్‌సీ వరకు రాకపోకలు నిషేధిస్తున్నట్లు పోలీ సులు తెలిపారు. మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు వీఆర్‌సీ నుంచి కేవీఆర్ పెట్రోలు బంకు వరకు, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల వరకు పొదలకూరు రోడ్డు, ఎస్పీ బంగ్లా, బట్వాడిపాళెం వరకు, సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు బట్వాడిపాళెం నుంచి పద్మావతి పొదలకూరు రోడ్డు ప్రాంతంలోని డైకస్‌రోడ్డు వరకు, సాయత్రం 6 నుంచి 7 గంటల వరకు బట్వాడిపాళెం ప్రాంతం నుంచి ఎస్పీ బంగ్లా వరకు రాకపోకలు నిషేధిస్తున్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు.

'ఇక సెలవు' కాకాణి గోవర్దనరెడ్డి

నెల్లూరు సిటీ, జూలై 22 : జిల్లా పరిషత్ పాలక వర్గం గడువు శుక్రవారం ముగిసింది. చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. చివరి రోజున జడ్పీ కార్యాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగ సిబ్బంది వీడ్కోలు పలికారు.
ప్రతి ఒక్కరికీ అభివాదం సాయంత్రం నాలుగు గంటలకు చైర్మన్ హోదాలో వచ్చిన కాకాణి ఆరు గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్‌గా బయటకు వెళ్లారు. 5 గంటలకు పదవీ కాలం ముగియడంతో ఆయన తన చాంబర్ నుంచి బయటకు వచ్చి కార్యాలయంలోని అన్ని విభాగాలకు వెళ్లారు. 'ఇక సెలవు' అంటూ అందరి నుంచి వీడ్కోలు తీసుకున్నారు.
ప్రజల అండతో ఐదేళ్లు : కాకాణి ప్రజల అండదండలు, జడ్పీ పాలకవర్గ సభ్యుల సహకారంతో ఐదేళ్ల పాలనను దిగ్విజయంగా కొనసాగించారని కాకాణి గోవర్దనరెడ్డి తెలిపారు. జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లా పరిషత్ కార్యాలయ భవనం నుంచి అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయని అయితే ప్రజలు అండతో వారి కుయక్తులను తిప్పి కొట్టామని చెప్పారు. దివంగత నేత వైఎస్ఆర్ వల్ల లబ్ధి పొందిన కొంతమంది నేతలు ఆయన మరణం తరువాత ఆరోపణలు చేస్తూ ఆయన పేరును ప్రజల్లో లేకుండా చేయాలని చూశారన్నారు. వైఎస్ కుటుంబానికి తాను అండగా నిలవడంతో తనను పదవి నుంచి తప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన రోజునే చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని భావించానన్నారు. అయితే తమ సహకారం లేకుండా ఐదేళ్ల పాలన ఎలా సాగిస్తారో చూస్తామంటూ కొంత మంది అధికార పార్టీ నాయకులు పేర్కొనడంతో ఐదేళ్లు చివరి నిమిషం వరకు చైర్మన్‌గా కొనసాగి తానెంటో ప్రత్యర్థులకు రుజువు చేశానన్నారు. ఇసుక అక్రమాలపై న్యాయ పోరాటం చేసి రూ. 60 కోట్ల నిధులు రాబట్టానని చెప్పారు.

దీంతో తనపై క్రి మినల్ కేసులు పెట్టాలని కొంత మంది న్యాయ స్థానాన్ని ఆశ్రయించారన్నారు. జిల్లాలో పూర్తి స్థాయిలో తాగునీటి సౌకర్యం కల్పించానని వివరించారు. కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిందని కాకాణి పేర్కొన్నారు. వైఎస్ మరణంతో సగం చచ్చిపోయిన పార్టీని అధికారంలో ఉన్న నేతలు పూర్తిగా చంపేశారన్నారు

Friday, July 22, 2011

జిల్లా పరిషత్‌కు పాలనాకాలం ముగిసింది, సభ్యులు మాజీలయ్యారు.

స్థానిక సంస్థల పాలనాకాలం ముగిసింది. ఎంపీపీలు, ఎమ్పీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, జెడ్పీ చైర్మన్ మాజీలయ్యారు. ప్రత్యేక అధికారుల నియామకానికి ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు గురువారం గవర్నర్ ఆమోదమద్ర వేశారు. జిల్లా పరిషత్‌కు కలెక్టర్ ప్రత్యేకాధికారిగా నియమితులయ్యారు. వివిధ శాఖలలో పని చేస్తున్న ఏడీ, డెప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు మండలాలకు ప్రత్యేకాధికారులుగా నియమితులు కానున్నారు. జిల్లాలో 599 మంది ఎంపీటీసీ సభ్యులు, 46 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. వారి పదవీ కాలం గురువారంతో ముగిసింది. స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహించక పోవడంతో ప్రత్యేకాధికారులు నియామకం తప్పలేదు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల బాధ్యతలను శుక్రవారం నుంచి ప్రత్యేకాధికారులు నిర్వహించనున్నారు.

ఇక నుంచి జెడ్పీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ బి. శ్రీధర్ వ్యహ రించనున్నారు. ఆయన పర్యవేక్షణలో మండలాలకు ప్రత్యేకాధికారుల నిమామకానికి సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక, దేవాదాయ, సహకార, సాంఘిక, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలలో పని చేసే ఏడీ స్థాయి అధికారులను, రెవెన్యూ శాఖలో పని చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను మండలాల ప్రత్యేకాధికారులుగా నియమించి, ఆ జాబితాను గోప్యంగా ఉంచారు. వారిని కూడా అధికారికంగా గురువారం ప్రకటించాల్సి ఉంది. కలెక్టర్ అందుబాటులో లేక పోవడంతో ఆ ప్రకటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. శుక్రవారం జెడ్పీ ప్రత్యేకాధికారిగా జిల్లా కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మండలాల ప్రత్యేకాధికారుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ విషయమై జెడ్పీ సీఈఓ జయరామయ్యను సంప్రదించగా మండలాల ప్రత్యేక అధికారులను నియమించామని, శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తామన్నారు. మండల పరిషత్‌లకు ప్రత్యేకాధికారులుగా నియమించిన వారితో కలెక్టర్ బి. శ్రీధర్, జెడ్పీ సీఈఓ జయరామయ్య శుక్రవారం సమావేశం కానున్నారు.

సీఎం అధికారిక పర్యటనలో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 24న నెల్లూరుకు రానున్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఏర్పా ట్లలో తలమునకలైంది. ఆయన పర్యటించే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దుతోంది. పొదలకూరు రోడ్డు, వేదాయపాలెం, కరెంట్ ఆఫీస్ సెంటర్లలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి వీఆర్‌సీ మైదానంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో అభివృద్ధి స్పష్టంగా కన్పించేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా పినాకినీ అతిథి గృహానికి వేళ్లే మార్గంలో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు.

పొదలకూరు రోడ్డు సెంటర్‌లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శిలాఫలకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ రూ. 18 లక్షలతో శిలాఫలకం పైలాన్ పనులు జరుగుతున్నాయి. శిలాఫలకం పైలాన్ చుట్టూ ఆక్రమణలు తొలగించి రూ.10 లక్షలతో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు. ఆ పైలాన్‌కు మూడు వైపులా ఫర్లాంగ్ దూరం మాత్రమే రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు చేస్తున్నారు. పొదలకూరు రోడ్డు నుంచి గాంధీనగర్ మీదుగా వేదాయపాలెం సెంటర్ వరకూ అధ్వానంగా ఉన్న రోడ్డుకు మెరుగులు దిద్దుతున్నారు. సంవత్సరాల తరబడి ఆ రోడ్డపై ఉన్న గుంతలతో ప్రయాణికులు నరకం అనుభవించారు. సీఎం ప్రయాణించాల్సి ఉండడంతో ఆ రోడ్డుకు మోక్షం కలిగినట్లైంది. అలాగే వేదాయపాలెం సెంటర్‌లో బాబు జగజ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ జరుగనుంది. అక్కడ రూ. 9.5 లక్షలతో పైలాన్ పనులు జరుగుతున్నాయి. బొల్లినేని ఆస్పత్రి, నిప్పో సెంటర్లలోని రొడ్లపై ఉన్న గుంతలకు మెరుగులు దిద్దుతున్నారు. కరెంటు ఆఫీసు సెంటర్‌లో దివంగత నేత డాక్టర్ వైఎస్సార్ విగ్రహాన్ని అవిష్కరించనున్నారు. ఇక్కడ రూ. 32 లక్షలతోపైలాన్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి.

నాణ్యత గాలికి..
హడావుడిగా జరుగుతున్న రోడ్ల విస్తరణ, ప్యాచ్ పనుల్లో అధికారులకు నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. పొదలకూరు రోడ్డు సెం టర్‌లో రూ. 10 లక్షలతో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. ఆక్రమణలు తొలగించే ముందు మట్టిని చదును చేసి రోలర్‌తో పటిష్టం చేయాలి. ఆ తర్వాత వెట్‌మిక్స్ పరిచి తిరిగి రోలర్‌తో పటిష్టం చేయాలి. కానీ నిబంధనలకు విరుద్ధంగా రోలర్‌తో పటిష్టం చేయకుండానే వెట్‌మిక్స్ పరుస్తున్నారు. వెట్‌మిక్స్ రోడ్డుపై పరిచిన తర్వాత తేమ ఆరక ముందే రోలర్‌తో పటిష్టం చేయాలి. అలా జరుగుతున్న దాఖలాలు లేవు. సాధారణంగా బీటీ రోడ్డు వేసే ప్రాంతాల్లో వెట్‌మిక్స్ చదును చేసి రోలర్‌తో పటిష్టం చేసిన తర్వాత ట్రాఫిక్ వదిలేస్తారు. రోడ్డు గట్టిపడిన తర్వాత తారు మిక్స్ చేస్తారు. ప్రస్తుతం అలా కాకుండా నామమాత్రంగా పరి చిన వెట్‌మిక్స్‌పై తారు మిక్స్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో బాగున్న తారు రోడ్డుపై మళ్లీ తారు రోడ్డు వేయడం స్థానికుల్ని విస్మయానికి గురి చేస్తోంది. పొదలకూరు రోడ్డు నుంచి గాంధీనగర్ మీదుగా వేదాయపాలెం సెంటర్ వరకూ ప్యాచ్ వర్కు జరుగుతోంది. ఆ పనుల్లో కూడా నాణ్యతకు తిలోదకాలిస్తున్నారు. సీఎం తిరిగే ఒక్క రోజు రోడ్లు బాగుంటే చాలనే చందంగా పనులు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి పర్యటిస్తున్న ప్రాంతాల్లోనే హడావుడి చేస్తున్న అధికాారులు గుంతల రోడ్లతో ప్రయాణికుల పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని నగరవాసులు విమర్శిస్తున్నారు.

సీఎం పర్యటనకు భద్రత కట్టుదిట్టం

రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా పర్యటనకు భద్రత కట్టుదిట్టం చేసినట్లు ఐజీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. ఈ నెల 24వ తేదీన జరగనున్న సీఎం పర్యటన దృష్ట్యా స్థానిక పోలీసు కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎస్పీ బీవీ రమణకుమార్,అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, రూరల్, హోంగార్టు డీఎస్పీలు, రవికుమార్, శ్రీనివాస్ , నగర, రూరల్ సీఐలు వీరాంజనేయరెడ్డి, జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటించే ప్రాంతాల పరిశీలన
సీఎం పర్యటించే ప్రాంతాలను ఐజీ హరీష్ కుమార్‌గుప్తా పరిశీలించారు. వెంకటాచలం సమీపంలోని కాకుటూరు దగ్గర ఉన్న పోలీసు ట్రైనింగ్ కళాశాల,విక్రమ సింహపురి వర్సిటీ స్థలం, వేదాయపాళెంలోని బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం, కరెంటుఆఫీసు ప్రాంతంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ జరిగే వీఆర్‌సీ ప్రాంగణం చేరుకున్నారు. అక్కడ సభ జరిగే ప్రదేశం , ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదికను పరిశీలించారు. అనంతరం నూతన కార్పొరేషన్ కార్యాలయం, పొదలకూరు రోడ్డులోని పైలాన్‌తో పాటుగా కస్తూరిదేవి కళాశాల ప్రాంగణంలో జరిగే సమావేశ ప్రాంగణాన్ని ఐజీ పరిశీలించారు.

డాగ్ స్వ్కాడ్ తనిఖీలు
ముఖ్యమంత్రి ప్రారంభించే వేదాయపాళెం బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం, పొదలకూరు రోడ్డులోని పైలాన్ ప్రదేశం, పోలీసు గ్రౌండులోని హెలిప్యాడ్ ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

వీఎస్‌యూ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
కాకుటూరు(వెంకటాచలం): సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24వ తేదీన కాకుటూరులోని విక్రమ సింహపురి వర్సిటీ శంకుస్థాపనకు రానున్న నేపథ్యంలో గురువారం కలెక్టర్ శ్రీధర్,జాయింట్ కలెక్టర్ సౌరబ్‌గౌర్ వర్సిటీ స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారి నుంచి హెలిపాడ్ వరకు రోడ్డును నాణ్యతగా నిర్మించాలన్నారు. రోడ్డు కిరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించాలన్నారు.వర్షం వచ్చి నా బురద కాకుండా సభా స్థలాన్ని చదు ను చేయించాలని అధికారులను ఆదేశించారు. ఈ స్థల పరిశీలనలో వారి వెంట ఆర్డీఓ మాధవీలత,హౌసింగ్ పీడీ వెంకటేశ్వర్లు రెడ్డి,ఆర్‌అండ్‌బీ ఈఈ నాగమల్లు,రూరల్ డీఎస్పీ రవికుమార్,సీఐ.జయరామసుబ్బారెడ్డి,తహశీల్దారు జనార్ధన్,ఇతర శాఖల అధికారులు ఉన్నారు.

పాదపూజలు, పల్లకీ సేవలు... అహో! 'ధన'పతి సచ్చిదానందం!

పైసామే 'పరమాత్మ'!
ప్రతి దానికీ ఫిక్స్‌డ్ రేటు.. బేరాలు లేవు!
పాదపూజకు లక్ష.. మ్యూజిక్ థెరపీ పేరిట భక్తులకు శిక్ష
భారీ సెట్టింగుల్లో దర్శనం.. పూజల పేరిట ఆర్భాటం
ఎప్పటికెయ్యది ప్రస్తుతమో.. అప్పటికా వేషం!
ఆధ్యాత్మికత ఓ వ్యాపారం.. రూ. కోట్ల ఆర్జనే లక్ష్యం
కన్నెత్తితే చాలు.. కనకాభిషేకాలు
అడుగడుగు దండాలు.. పల్లకీ సేవలు
దటీజ్.. 'ధన'పతి సచ్చిదానందం!

పక్కపక్కనే రెండు దుకాణాలు ఉంటాయి. ఒక షాపు ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. ఇంకో షాపు యజమాని మాత్రం ఈసురోమని ఈగలు తోలుకుంటుంటాడు. కారణం... వ్యాపారం ఒక కళ. ఇది మొదటి షాపు యజమానికి ఉంది. రెండో వ్యాపారికి లేదు. భక్తి వ్యాపారమూ అంతేనండోయ్! కాషాయం కట్టగానే సరిపోదు! భక్తులను ఆకర్షించాలంటే 'కళ' ఉండాలి. గణపతి సచ్చిదానంద స్వామీజీ వద్ద ఈ 'కళ' టన్నులకొద్దీ ఉంది. ఆయన భక్తి సామ్రాజ్యానికి ఆయన సకల కళలే కీలకం. సందర్భాన్ని బట్టి ఆయన గాయకుడవుతారు. భగవద్గీత చెప్పేటప్పుడు శ్రీకృష్ణుడి వేషం కడతారు. కనకాభిషేకాలు, పాదపూజలు, పల్లకీ సేవలు... అహో! ఏమి ఆ లీలా విశేషము! మీరునూ కనుడు!

హైదరాబాద్, జూలై 21 : కంచి వంటి సనాతన పీఠాలు ఉన్నాయి. రామకృష్ణ ఆశ్రమం వంటి సేవా తత్పరత ఉన్న ఆశ్రమాలూ ఉన్నాయి. ఇలాంటి ఆశ్రమాలు, వాటి స్వామీజీల మాట మాత్రమే చెల్లుబాటు అవుతున్న కాలంలో... సొంతంగా ఎదగడమంటే మాటలా? ఇందుకు గణపతి సచ్చిదానంద చాలా తంటాలు పడ్డారు. ఆధునిక ఆధ్యాత్మిక మార్కెటింగ్ వ్యూహాల్ని రచించారు. భక్తిని కొత్తపుంతలు తొక్కించారు. తన పేరు చివర 'సాక్షాత్ భగవత్ స్వరూపుడు' అనే ట్యాగ్ తగిలించుకున్నారు.

ఆయనను చూసి భక్తులు పులకించి పోయారు. శ్రీకృష్ణుడిలా నెమలి పింఛం తగిలించుకుని, భగవద్గీత చెబుతుంటే... గీత అలానే చెప్పాలేమో అనుకున్నారు భక్తులు. ఏడు గుర్రాలు లాగే రథాన్ని పోలిన సెట్టింగులో కూర్చొని దర్శనం ఇస్తే... 'అబ్బ!' అని పులకించిపోయారు. ఇంత భారీ హంగామా నడుస్తుంటే వందో, వెయ్యే ఇస్తే ఏం బావుంటుందని ఘనంగా కానుకలు సమర్పించుకొనేవారు. భారీ కానుకలు సమర్పించేలా భక్తులను 'ట్యూన్' చేసుందుకే స్వామీజీ ఈ సెట్టింగ్‌లు ఏర్పాటు చేసేవారంటే బావుంటుందేమో!

హిందూ సంప్రదాయానికి, ఆంగ్ల సంవత్సరాది.. అంటే జనవరి ఫస్ట్ వేడుకలకు సంబంధం లేదు. కానీ, ఈ సందర్భాన్ని కూడా స్వామీజీ ఉపయోగించుకుంటారు. ఎక్కడో ఒకచోట ఆర్భాటంగా దర్శనం ఇస్తూ, దక్షిణలు, కవర్లు అందుకుంటారు. మూడేళ్ల క్రితం విజయవాడలో కొత్తసంవత్సరం వేడుకల్లో స్వామీజీ నాట్యం చేశారు. కారు టాప్ ఎక్కి మరీ రాక్ అండ్ రోల్ నృత్యం చేశారు. జగ్గీవాసుదేవ్ వంటి ఆధునిక స్వాములకు ఏ మాత్రం తీసిపోను అనే సందేశం పంపారు.

పాదపూజకు లక్ష! దేవుడు ఎప్పుడూ, ఎవరినీ డబ్బు అడగడు! కానీ, సచ్చిదానంద స్వామి రూపంలో ఉన్న ఈ దేవుడు మాత్రం డబ్బు లేనిదే భక్తుల వంక కన్నెత్తయినా చూడడు! సాధారణంగా స్వామీజీలు పాద నమస్కారాలకు అనుమతించరు. కానీ... ఈ స్వామీజీ మాత్రం రేటు కట్టి మరీ పాదాలకు మొక్కించుకుంటారు. పాద దర్శనానికి పదివేలు, పాదపూజ చేసేందుకు 20 వేల నుంచి రెండు లక్షల వరకు ఫీజు పెట్టారు. పదేళ్ల క్రితం స్వామీజీ పాదపూజలు ప్రభంజనంలా జరిగాయి. సంపన్నులు పోటీలు పడి మరీ ఆయనను ఇళ్లకు ఆహ్వానించి, కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తిన చల్లుకున్నారు.

ఒక దశలో పాదపూజలకు క్రేజ్ పెరగడంతో సర్వాంతర్యామి కానీ స్వామిజీ తనకు బదులుగా తన పాదుకలను పంపి ఫీజు వసూలు చేశారు. ఆ తర్వాత మరికొందరు మోడరన్ గురువుల రాకతో గణపతి సచ్చిదానంద పాద పూజలకు డిమాండ్ తగ్గింది. మన స్వామీజీ గృహ ప్రవేశంలాంటి శుభ కార్యాలకు కూడా వస్తారు! అది కూడా రూ.50 వేల నుంచి లక్ష వరకు ముడుపు చెల్లిస్తేనే! పెద్దలకు తృణమో, పణమో సమర్పించడం మన సంప్రదాయం. కానీ.. ఫిక్స్‌డ్ రేట్లు పెట్టి మరీ డబ్బు వసూలు చేయడం ఏ సంప్రదాయమో తెలియదు.

రాగాలు.. రోగాలు
ఒక్కో స్వామీజీ ఒక్కో 'టెక్నిక్'లో స్పెషలిస్టు! గణపతి సచ్చిదానంద మ్యూజిక్ థెరపీలో 'స్పెషలైజేషన్' చేశారు. అంటే మరేమీ లేదు... రాగాలతో రోగాలు నయం చేసే 'కళ'. అసలు విషయమేమిటంటే, మిగిలిన ఆధునిక స్వామీజీల్లా ధాటిగా ప్రసంగించలేకపోవడం ఈ స్వామి మైనస్ పాయింట్! అందుకే... సంగీతాన్ని ఆశ్రయించారు. అధునిక సంగీత పరికరాలను వాయిస్తూ భజనలు చేయించారు. కీర్తనలు పాడారు. అంతటితో అగకుండా ఆ సంగీతంతో మొండి జబ్బుల్ని కూడా నయం చేస్తాం అంటూ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

ఒకసారి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంట్రీ ఫీజు... అక్షరాలా ఐదు వేల రూపాయలు. ఇద్దరు ఐఏఎస్ అధికారులు మ్యూజిక్ థెరపీ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. వేటూరి వంటి రసజ్ఞుల్ని ముందువరసలో కూర్చోపెట్టారు. ప్రముఖ వాద్య విద్వాంసుల్ని వేదిక ఎక్కించి, వాళ్ల చేత పాడించి, మధ్యలో స్వామి స్వరం కలిపి, కార్యక్రమాన్ని రక్తికట్టించారు.

ఆ పాటకు మొండి వ్యాధులు కూడా కట్టలు తెంచుకుని పరార్ మంత్రం జపించాయనే ప్రచారం చాపకింద నీరులా సాగేది. ఆ తర్వాత శిల్పారామంలో కూడా స్వామి మ్యూజిక్ థెరపీ కార్యక్రమం జరిగింది. ఆయన సంగీతానికి జబ్బులు నయం కావడం ఏమో కానీ, సంగీతం అంటేనే భయంవేసే పరిస్థితి వచ్చిందని ఆ రెండు కార్యక్రమాలకు హాజరైన ఓ పెద్దమనిషి వాపోయారు.

కనకాభిషేకాలు.. పల్లకీ సేవలు
గణపతి సచ్చిదానందకు రాష్ట్రంలో గట్టి నెట్‌వర్క్ ఉంది. స్వామీజీ ఇంటికి వస్తే శుభం జరుగుతుంది... పలుకుబడి పెరుగుతుందంటూ ఆ నెట్‌వర్క్‌లోని పెద్దలు ప్రచారం చేసేవారు. ఒకళ్లని చూసి మరొకళ్లు స్వామీజీని ఆహ్వానించి, లక్షలు సమర్పించి తరించేవారు. కనకాభిషేకా లు, పల్లకీ సేవలు జోరుగా సాగాయి. ఆయన వస్తే ఏసీ కార్లు, ఏసీ వస తి ఉండాల్సిందే.

ఇక ఎప్పుడూ వార్తల్లో ఉండడం, డబ్బు వచ్చే ఏ మార్గాన్నీ వదలక పోవడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. 50 ఆశ్రమా ల్లో ఎప్పుడూ తానే ఉండలేరు కాబట్టి, అన్ని ఆశ్రమాల్లోనూ ఆలయాలు నిర్మించారు. అన్నిచోట్లా భక్తుల నుంచి అంతోఇంతో ముడుతుంటాయి. స్వామి స్వయంగా పాల్గొనే కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చేవారు. 'ఇందరు పెద్దలు వెళుతున్నారు కదా!' అం టూ సామాన్యులూ క్యూ కట్టేవారు. అన్నట్టు... ఆయన తావీదులు, రిబ్బ న్లు, అమ్మవారి బొమ్మలు సృష్టించి భక్తుల్ని అబ్బుర పరిచేవారు.

బోన్సాయ్, మూలికావనం
సంగీతంతో కొత్త ప్రయోగాలు చేసిన ఆయన, మైసూరు ఆశ్రమంలో బోన్సాయ్ మొక్కలతో ఆసియాలోనే అతిపెద్ద వనాన్ని ఏర్పాటు చేశారు. ఆ మొక్కలంటే తనకు ప్రాణం అంటారు. ఓసారి భారీ బోన్సాయ్ ప్రదర్శన ఏర్పాటు చేసి, ప్రముఖులను ఆహ్వానించి హంగామా సృష్టించారు. స్వామీజీ ఏమిటి? ఈ బోన్సాయ్ మొక్కల గొడవేంటి అంటారా? మైసూ ర్ దత్తపీఠంలోగల విశాలమైన మూలికావనంలో ప్రపంచంలో ఎక్కడా లేని అరుదైన మూలికలున్నాయని స్వామి చెబుతారు. నిజం ఎంతో ఆ పెరుమాళ్లుకే తెలియాలి!

Wednesday, July 20, 2011

ఎగిసిపడ్డ రియల్ ఎస్టేట్ రంగం నేడు కుదేలైంది

ఉప్పెనలా ఎగిసిపడ్డ రియల్ ఎస్టేట్ రంగం నేడు కుదేలైంది. రెండు నెలలుగా ప్లాట్ల అమ్మకాలు నిలిచిపోయాయి. రేట్లు వస్తాయని భావించి రూ. లక్షల్లో అడ్వాన్సులు పెట్టిన రియల్టర్లు ఏమి చేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు. తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేని పరిస్థితి నెలకొని ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఆత్మహత్యలే శర ణ్యమని రియల్టర్లు వాపోతున్నారు.

నెల్లూరు(అర్బన్), న్యూస్‌లైన్: నిన్న మొన్నటి వరకూ ఓ వెలుగు వెలిగిన రియల్ భూం బోర్లాపడింది. నెల్లూరు నగరం చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో వ్యవసాయ భూములను సైతం రియల్ ఎస్టేట్లుగా మార్చేశారు. ఎక్కడిక్కడ పొలాలను చదును చేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. నెల్లూరు నగరంతోపాటు గూడూరు, బుచ్చి, ముత్తుకూరు ప్రాంతాల్లో కనుచూపు మేరలోని వ్యవసాయ పొలాలన్నీ రియల్ భూంలో ప్లాట్లుగా మారాయి. కృష్ణాపట్నం పోర్టు, పరిసర ప్రాంతాల్లో పలు ఫ్యాక్టరీలు వెలుస్తున్నాయి. నగర ప్రజలు ఇక్కడ ప్లాట్లు కొనేందుకు మొగ్గు చూపడంతో రియల్ భూం పెరిగింది. ఒక్కసారిగా ప్లాట్ల రేట్లు ఆకాశాన్నంటాయి. పరిసర ప్రాంతాల్లో అంకణం ధర రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకూ పలికింది. విక్రమ సింహపురి యూనివర్సిటీ, జిల్లా జైలు, బుజబుజనెల్లూరు సమీపంలో నిర్మాణాలు చేపట్టడం, ముత్తుకూరురోడ్డు, చింతారెడ్డిపాళెం ప్రాంతాల్లో ఇప్పటికే నారాయణ సూపర్‌స్పెషాలిటీ ఉండడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. విమానశ్రయం నగరం సమీపంలోని కొత్తూరులో అని ఒకసారి, దగదర్తి సమీపంలో అని మరోసారి ఊహాగానాలు వచ్చాయి. రియల్టర్ల అత్యాశ, దళారుల మయాజాలంతో పలువురు రైతులు తక్కువ ధరకే తమ భూములను అమ్ముకొన్నారు. దళారుల మధ్య భూములు చేతులు మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సొమ్ము చెల్లింపు భారంగా మారింది. ఎస్‌ఈజెడ్‌లతో వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మారాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో ఎకరా రూ. లక్షల్లో విక్రయం జరిగే చోట రూ. కోట్లు పలికాయి.

పుట్టగొడుగుల్లా దళారులు పుట్టుకు రావడంతో వ్యాపారాల చేతులు మారాయి. టోకన్ అడ్వాన్సు కింద రూ. లక్షలు చెల్లించడం, దళారుల చేతులు మారడంతో రూ. లక్షలు విలువ చేసే స్థలాలు రూ. కోట్లు కురిపించాయి. ఇలా మూడు నెలల వ్యవధితో అగ్రిమెంట్లు చేసుకొని వ్యాపారాలు చేపట్టారు. అయితే రెండు నెలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా మందగించింది. ఉన్న ప్లాట్లను లాభాలు లేకుండా అసలుకే విక్రయిస్తామన్నా కొనేవారే కరువయ్యారు. యాజమానుల నుంచి తీసుకొన్న వ్యవధి ముగుస్తున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. అయితే అంత పెద్ద మొత్తాలు సర్దుబాటు చేయలేక మధ్యవర్తులు అల్లాడుతున్నారు.

రెండు నెలల క్రితం వరకూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రియల్టర్లు, దళారుల హవా కన్పించింది. రియల్ భూం తగ్గడంతో రెండు నెలలుగా రియల్టర్లు జాడ కనిపించడంలేదు. వెలుస్తున్న లే అవుట్లలో అడ్వాన్సు చెల్లించి దళారులు ప్లాట్లు కొనుగోలు చేస్తారు. వీటిని నిజమైన కొనుగోలు దారుడికి విక్రయించకుండా మళ్లీ దళారులకే విక్రయిస్తుండడంతో ప్లాట్లన్నీ దళారుల చేతుల్లోనే ఉండిపోతున్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకొని సొంతానికి వాడుకునే వారు అరుదు. వచ్చినంత మేరకు మధ్యవర్తులకే విక్రయిస్తుండడం, ధరలు అధికం కావడంతో ప్లాట్లు సొంతానికి కొనుగోలు చేసే వ్యక్తులు తగ్గిపోయారు. వ్య వధి ముగుస్తుండడంతో రిజిస్ట్రేషన్ చేసుకోమని స్థలాలు యజమానులు ఒత్తిడి తెస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచక రియల్టర్లు, మధ్యవర్తులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్లాట్ల ధరలు పడిపోయాయి
రెండు, మూడు నెలలుగా నగరంలో ప్లాట్ల ధరలు తగ్గిపోయాయి. ధరలు పెరుగుతాయని ఉద్దేశంతో భూములు కొన్నవారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. లాభం రాకపోయినా కనీసం కొన్న ధరకు కూడా ప్లాట్లు అమ్ముడుపోవట్లేదు. కామయ్య, రియల్ ఎస్టేట్ వ్యాపారి

కొనేందుకు ధైర్యం చాలడంలేదు
రియల్‌బూమ్ ఉన్న సమయంలో ప్లాట్లు కొనేందుకు అడ్వాన్సులు చెల్లించాం. మార్కెట్ పడిపోవడంతో ప్లాట్లను కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మిగతా మొత్తం చెల్లించి ప్లాట్లు కొనేందుకు ధైర్యం చాలడంలేదు. మరోవైపు అడ్వాన్సు చెల్లింపుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీ పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.
వరదయ్య, మధ్యవర్తి

Thursday, July 14, 2011

సంక్షోభంలో ఆక్వా సాగు

అల్లూరు సిరులు కురిపిస్తుందనుకున్న వెనామీ రొయ్యలసాగువల్ల ఎంతో మంది రైతులు ఈ ఏడాది నష్టాన్ని చవిచూశారు. రెండు సంవత్సరాలపాటు వెనామీవల్ల ఎంతోమంది ఎకరాకు రూ.7 లక్షల నుంచి రూ.12లక్షల మేర ఆదాయాన్ని పొందారు. గత రెండేళ్ల వరకు అమెరికా, థాయిలాండ్ దేశాల నుంచి ఎటువంటి కల్తీలేని సీడ్ దిగుమతి అయ్యేది.
రెండు సంవత్సరాలపాటు అధికంగా ఆదాయం రావడంతో ఎంతోమంది చిన్న,సన్నకారు రైతులతోపాటు పెద్ద కంపెనీలు సైతం వందల ఎకరాలు సాగుచేసేందుకు సమాయత్తమయ్యారు. తీరప్రాంత భూములకు పెద్ద గిరాకీ ఏర్పడింది.

ఒక ఎకరాకు రూ.20 నుంచి రూ.30 వేల వరకు లీజు ఇచ్చి పొలాన్ని రొయ్యల చెరువుగా మార్చారు. కానీ ఆ ఉత్సాహం ఎంతోకాలం నిలువలేదు.
ప్రస్తుత ఫిబ్రవరిలో వెనామీ రొయ్యలసాగుపట్ల ప్రచారం ముమ్మరంగా సాగింది. కేవలం 2 నుంచి 3 నెలల వ్యవధిలోనే రొయ్యలచెరువులన్నీ పలురకాల కారణాలతో దెబ్బతిన్నాయి.

సొంత పొలాలవారికి అసల జమకాగా లీజువాళ్లకి ఎకరాకు రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. గత సంవత్సరం 50 కౌంట్ కేజీ ధర రూ.280లు కా గా, ప్రస్తుతం రూ.140లుగా ఉంది. 30 కౌంట్‌ధర రూ.460లు ఉండగా ప్రస్తు తం రూ.230లకే పరిమితం అ య్యింది. గత ఏ డాదితో పోలిస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోగా రొయ్యలు రేటు మాత్రం సగానికి తగ్గిపోయింది.
5 ఎకరాలు లీజుకు సాగుచేసిన వారికి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, ఏరియేటర్లు, వర్కర్లు ఉండేందుకు షెడ్లులాంటివి ఖర్చులే సుమారు రూ.5 లక్షలకు పైగా అయ్యాయి. ప్రస్తుతం లీజుకు తీసుకున్నవారు వచ్చిన నష్టాన్నిచూసి తలను పట్టుకుంటున్నారు.
v - సీడ్‌లోనే ప్రధానలోపం: లక్షల రూపాయలు ఖర్చుచేసి రొయ్యలసాగును చేపట్టిన రైతాంగానికి సీడ్ కంపెనీలు నెత్తిన కుచ్చుటోపీ పెట్టాయి. 30 పైసలు ఉన్న రొయ్యపిల్ల ధరను రెండింతలు అధికంగా 90 పైసలు చొప్పున అమ్మి సొమ్ముచేసుకున్నారు. పైగా కొన్ని కంపెనీలదగ్గరే కొనాలంటూ ప్రతిరోజూ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడంతో నమ్మి కొనుగోలుచేసిన రైతులు అవి పుచ్చిబురగలవడంతో మోసపోయామని తలలు పట్టుకున్నారు.

కంపెనీవారు స్థానికంగా దొరికే సీడ్‌ను కొనుగోలుచేసి ఇంపోర్టెడ్‌గా ప్రకటనలు ఇచ్చి రూ.కోట్లు సొమ్ముచేసుకున్నారు. మత్స్యశాఖ ఎటువంటి నియంత్రణలు లేకుండా కంపెనీలవారివద్ద నుంచి లంచం తీసుకొని పర్మిషన్లు ఇస్తుండటంవల్లే అమాయకపురైతులు మోసపోతున్నారు.

24న జిల్లాకు సీఎం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 24న జిల్లాకు వస్తున్నట్లు రూరల్ శాసనసభ్యుడు ఆనం వివేకానందరెడ్డి తెలిపారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌లో సిఎం జిల్లాకు వస్తున్నట్లు ప్రకటించినప్పటికి శాసనమండలి ఎన్నికల కోడ్ అమలు కావడంతో ఆయన పర్యటన రద్దయిందన్నారు.

కరెంట్ ఆఫీసు సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించాల్సి ఉండడంతో సీఎం పర్యటన రద్దు కావడంతో పనులు ఆగిపోయాయి. మళ్లీ ఎట్టకేలకు ఈ నెల 24న జిల్లాకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. 24న ఉదయం తొమ్మిది గంటలకు జగజ్జీవన్‌రాం, వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు వీఆర్ హైస్కూలు మైదానంలో జరిగే రైతు సదస్సులో పాల్గొంటారు.

మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లాలో జరిగే అభివృద్ధి పనులపై అధికారులు సమీక్ష, సాయంత్రం ఐదు గంటలకు సీపీఆర్ కల్యాణ మండపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. రాత్రికి నెల్లూరులో బస చేసి 25న ఉదయం హైదరాబాద్‌కు వెళుతారు. సీఎంతో మంత్రి, ఎమ్మెల్యేలు సమావేశం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాకు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం హామీ పొందేందుకు మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు ఈ నెల 15న సీఎంతో సమావేశం అవుతారు.
సీఎం పర్యటనకు వస్తుండడంతో కలెక్టర్ శ్రీధర్ బుధవారం జిల్లా అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై నగర పాలక సంస్థ కమిషనర్, ఇతర అధికారులతో చర్చించారు.

Special Focus - Sri Rama Jewelleries

Special Story - PRP Party

PRP Party Focus