నేడు నెల్లూరు

Monday, May 30, 2011

ఆనం, ముఖ్యమంత్రిల మధ్య దూరం పెరుగుతోందా?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి సంబంధాలు బెడిసినట్లేనా? గత కొద్ది కాలంగా జరుగుతున్న పరిణామాలలో ఆనం రామనారాయణరెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కావాలనే దూరంగా పెడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఆనం రామనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకానందరెడ్డి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, అలాగే సలహాదారు కెవిపి రామచంద్రరావుకు బాగా సన్నిహితంగా ఉండేవారు. రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కూడా అదే ప్రకారం కెవిపితో కూడా ఆనం రామనారాయణరెడ్డి సత్సంబందాలు కొనసాగిస్తున్నారు
ఆ కారణమో, మరేమో కాని, కిరణ్ కుమార్ రెడ్డి ఈ మధ్య ఆనం పట్ల కొంత అయిష్టంగా ఉంటున్నట్లు సమాచారం. దానికి ఉదాహరణగా కొన్ని ఘట్టాలు చెబుతున్నారు.గత నెలలో కొన్ని రోజుల క్రిందట ప్లానింగ్ కమిషన్ సమావేశానికి రామనారాయణరెడ్డి లేకుండా వెళ్లడం ఒక ఆధారం అయితే తాజాగా మరో ఘటన జరిగింది. రెండు రోజుల కిందట రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. దానికి సాధారణంగా ముఖ్యమంత్రితోపాటు , రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి కూడా హాజరవుతారు.మంత్రిని కనీసం దీనిపై సంప్రదించలేదని, పోని మీటింగ్ కు రమ్మనిఆహ్వానించలేదని చెబుతున్నారు. తాను లేకుండానే ముఖ్యమంత్రి బ్యాంకర్ల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడడంతో రామనారాయణరెడ్డి ఆశ్చర్యానికి లోనయ్యారు.దాంతో ఆయన కూడా పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఒకప్పుడు జగన్ కు సన్నిహితంగా మెలిగినా, ఆ తర్వాత పార్టీ లైన్ కు వచ్చి పార్టీకోసం పనిచేస్తుంటే, నెల్లూరులో మేకపాటి సోదరులను ఎదుర్కుంటుంటే , ముఖ్యమంత్రి తమను విశ్వాసంలోకి తీసుకోకపోవడం ఏమిటని మంత్రి ఆనం
వ్యాఖ్యానిస్తున్నారని చెబుతున్నారు.అసలేం జరిగిందో తెలియడం లేదని ఆయన అంటున్నారట. పైగా ముఖ్యమంత్రి భార్య రాధికా రెడ్డి ఆనంకు దూరపు బందువు కూడా అవుతారు. ఆ సంగతి ఎలా ఉన్నా, రాజకీయంగా కిరణ్ కు గట్టి మద్దతు ఇస్తున్న సమయంలో ఆయన ఇలా వ్యవహరించి, బిన్నమైన సంకేతాలు ఇస్తుండడంతో మంత్రి ఆనం రామానారాయణరెడ్డికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.అటు జగన్ తో సంబందాలు తెంచుకుని, ఇటు పార్టీతో అనుబందం పెంచుకుని ఉంటే , ఇప్పుడు ముఖ్యమంత్రి ఇలా దూరంగా ఉంచడంలో అంతరార్ధం ఏమిటో తెలియక తలబట్టుకున్నారు ఆనం సోదరులు.
అయితే ఇలాంటి పరిస్థితులను గతంలో అనేక మార్లు చూసిన రామనారాయణ మౌనంగా కిరణ్ రాజకీయాన్ని గమనిస్తూ ఉండిపోతున్నారట.

విజయ్ చందర్ కూతురు వనిత నిరాహార దీక్షకు దిగింది

సినీ నటుడు విజయ్ చందర్ కూతురు వనిత, ఆమె మాజీ భర్త ఆకాష్ మధ్య వారి తనయుడు గొడవ కొనసాగుతోంది. తాజాగా వనిత తన తనయుడిని తన వద్దకు పంపించాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని ఆకాష్ ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. చెన్నై కోర్టు ఉత్తర్వుల మేరకు తన తనయుడిని తన వద్దకు వారానికి రెండు రోజులైనా పంపించాలని ఆమె డిమాండ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆకాష్ నడుచుకోవడం లేదని తాను పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు నిర్లక్ష్యం వహించాలని ఆమె ఆరోపించింది. అందుకే తాను నిరాహార దీక్షకు దిగానని ఆమె చెబుతోంది. తన కుమారుడిని తన వద్దకు పంపించే వరకు తాను దీక్షను విరమించనని హెచ్చరించింది.

అయితే భర్త ఆకాష్ వర్షన్ మరో రకంగా ఉంది. తన కుమారుడికి తల్లి వద్దకు వెళ్లడం ఇష్ట పడడం లేదని కౌన్సెలింగ్ ఇప్పించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, కానీ తల్లి వద్దకు పంపవద్దనే ఉద్దేశ్యం తమకు లేదని ఆకాష్ చెబుతున్నాడు. అయితే తన తనయుడిని చిత్ర హింసలకు గురి చేస్తూ తన వద్దకు రాకుండా చేస్తున్నారని వనిత ఆరోపిస్తోంది. మరో విషయం ఏమంటే వనిత తండ్రి విజయ్ చందర్ కూతుర్ వైపు కాకుండా అల్లుడు ఆకాష్ వైపు ఉండటం విశేషం. వనిత భర్త నుండి విడిపోయాక తన వద్దకు తనయుడిని పంపించక పోవడంతో ఆమె ఏడెనిమిది నెలల క్రితం కోర్టును ఆశ్రయించింది.

అయితే కొడుకుకు తల్లి వద్దకు వెళ్లడం ఇష్టం లేదని గమనించిన కోర్టు వారానికి రెండు రోజులు అంటే శని ఆదివారాలు తల్లి దగ్గరకు పంపించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్నాళ్లుగా ఆకాష్ - వనితల మధ్య తనయుడి కోసం వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు తనయుడి కోసం వనిత, ఆమె తండ్రి విజయ్ చందర్‌ ఆరు నెలల క్రితం సాక్షాత్తూ చెన్నై విమానాశ్రయంలోనే ప్రయాణీకుల ముందు గొడవ పడ్డారు. అయితే తన మాజీ భర్త సూచనల మేరకే తన తండ్రి ఇలా తనతో గొడవకు దిగుతున్నారని ఆమె చెప్పారు.

గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే

గాలి జనార్దన్ రెడ్డి కూర్చునేది '' బంగారం కుర్చీ '' లో, తినేది '' బంగారు పల్లెం '' లో
బిజెపి నాయకుడు, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బంగారం కుర్చీలోనే కూర్చుంటారు. దాని ఖరీదు 2.2 కోట్ల రూపాయలు. బంగారంతో తయారు చేసిన విగ్రహాలకు పూజలు చేస్తారు. వాటి విలువ రూ. 2.28 కోట్లు. రూ. 13.15 లక్షల విలువ చేసే బెల్టు ధరిస్తారు. గాలి జనార్దన్ రెడ్డి జీవితమంతా స్వర్ణమయమే. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఈ వివరాలతో ఆ ఆంగ్లదినపత్రిక వార్తాకథనాన్ని ప్రచురించింది. బంగారు పల్లెంలోనే తింటారు. గిన్నెలు, చెంచా, ఫోర్కు, కత్తి - అన్నీ బంగారానివే. వీటి విలువ రూ. 20.87 లక్షలు ఉంటాయని సమాచారం.

ఆ వివరాలన్నీ కర్ణాటక లోకాయుక్తకు సమర్పించినవేనని ఆ పత్రిక రాసింది. 2010 మార్చి 31వ తేదీ వరకు తనకు గల ఆస్తుల వివరాలను గాలి జనార్దన్ రెడ్డి 2010 జూన్ 25వ తేదీన లోకాయుక్తకు సమర్పించారు. గాలి జనార్దన్ రెడ్డికి గల ఆభరణాల జాబితా మూడు పేజీల నిండా ఉంది. వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటుంది. ఎన్నో సెట్ల గాజులు, పచ్చ సఫైర్ స్టోన్, ర్యూబీ, బంగారు పరికరాలు, నెక్లెస్‌లు, చెవి పోగులు, పురుషుల ఆభరణాలు, రింగులు, బంగారు విగ్రహాలు - ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.

ఎయిర్ కండీషనర్స్, టీవీ సెట్లు, ఫర్నీచర్ - ఇంటి వస్తువుల విలువ లక్షలాది రూపాయలు ఉంటుంది. వ్యవసాయ భూములు, భవనాలను, వారసత్వ ఆస్తులను మినహాయిస్తేనే గాలి జనార్దన్ రెడ్డి ఆస్తులు 153.49 కోట్ల రూపాయల విలువ చేస్తుంది. ఆయన నెల జీతం రూ. 31.54 కోట్లు కాగా, వాణిజ్య ఆదాయం రూ. 18.30 కోట్లు.

హరికృష్ణకు, లక్ష్మీపార్వతి కు చంద్రబాబు జవాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన బావమరిది హరికృష్ణకు, ఎన్.టి.ఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి కి ఘాటైన సమాధానం చెప్పారు. వారిద్దరిపేర్లు చెప్పకపోయినా వారు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన తన మహానాడు ముగింపు ఉపన్యాసంలో ఆయా అంశాలాను ప్రస్తావించారు. ఎన్.టిఆర్ ను ఎదిరించడానికి దారితీసిన పరిస్థితులను ఆయన వివరించారు. ఆరోజు ఎదురు తిరిగాం కనుకే ఈరోజు ఎన్.టి.ఆర్ విధానాలను కొనసాగించగలుగుతున్నామని అన్నారు. అలాగే హరికృష్ణకు సమాధానం చెబుతూ కుటుంబం వేరు,రాజకీయం వేరు ఆయన స్పష్టం చేశారు.ఆయన చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.

\"ఎన్.టిఆర్ ను ఆరాధ్య దైవంగా చూశాను ఆయన అంటే ఎక్కడ లేని అబిమానం.గురుత్వం. అనుకుంటే పట్టుదల తో సాధించే లక్ష్యం ఆయనది ఎలాంటి కష్టాలను అయినా ఎదుర్కునే మనస్తత్వం ఆయనది. తెల్లవారుజామున నాలుగు గంటలకు నాకు ఫోన్ చేసేవారు. ఆయన ఫోన్ వస్తుందని భయపడి ముందుగానే తయారై వెళ్లేవాడిని. నేనెన్నడూ ఎన్.టి.ఆర్ పై తిరుగుబాటు చేస్తానని అనుకోలేదు.
కాని అనుకోకుండా ఆయన జీవితంలోకి దుష్టశక్తి ప్రవేశించింది. లేనిపోనివి చెప్పి పార్టీని నాశనం చేస్తుంటే అందరం అడ్డుకోవడానికి ప్రయత్నించాం. ఎన్నో ప్రయత్నాలు చేశాం.కాని సాధ్యపడలేదు. తప్పనిపరిస్థితిలో ఎదురు తిరగవలసి వచ్చింది.ఆనాడు రెండువందలమంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.ప్రజాస్వామ్యబద్దంగా తిరుగుబాటు జరిగింది. ఈరోజు ఎన్.టిఆర్ విధానాలను ప్రజలలోకి తీసుకువెళ్లగలుగుతున్నామంటే ఆరోజు తిరుగుబాటు చేయగలిగాం కాబట్టే.ఈ పార్టీని అంతం చేయాలని కొందరు చూస్తున్నారు.వారిమీద పోరాడుతున్నాంకుటుంబం వేరు. బంధుత్వం వేరు,రాజకీయం వేరు అన్నది నా ఆలోచన . భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని కుటుంబ వ్యవస్థ ఉంది. అమెరికాలో కాంట్రాక్టు పెళ్ళిళ్లు జరుగుతాయి. మన దేశంలో మాత్రమే కలిసి ఉండే కుటుంబాలు ఉంటాయి. అమెరికాలో పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు వస్తే ఇంటిలో ఉండరు. కాని మన దేశంలో మాత్రమే పిల్లలు,పెద్దలు అంతా కలిసి ఉండే వ్యవస్థ ఉంది. సమస్యలపై పోరాడుతున్నాను. ఎవరిపై నాకు వ్యతిరేకత లేదు.నేను కాంగ్రె స్ తో లాలూచి పడలేదు. వీరోచితంగా పోరాడాం.1989-1994మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులతో పోరాడం. అలాగే వై.ఎస్.పై పోరాడం. రెండువందల మంది కార్యకర్తలను హత్యచేశారు.దానిపై పోరాడం. నేను అదికారంలో ఉన్నప్పుడుఎవరికి లైసెన్సులు ఇప్పించుకోలేదు.కుటుంబ వ్యవస్థ ఉండాలి. ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు చేయాలి.కాని పార్టీ ని ముందుకు తీసుకువెళ్లాలి . ఆ ప్రకారం చేస్తాను .రాజకీయాలు వేరు,కుటుంబం వేరు,బంధుత్వం వేరు, నా భార్యకాని,కొడుకు కాని జోక్యం చేసుకోలేదు. మేము కొన్ని నియమనిబంధనలు పెట్టుకున్నాం.క్రమశిక్షణ గాఉన్నాం.పిల్లలను మంచి చదువు చెప్పించాం. చంద్రగిరిలో మా అబ్బాయి గురించి ఫ్లెక్సీలు పెడితే కోప్పడ్డాను.మనం రాజకీయాలు చేయడం మంచిదికాదని మందలించాను.రాజకీయాలలోకి రానివారిపై పోస్టర్లు వేసి ఇబ్బంది పెట్టవద్దు. మాది పెద్ద కుటుంబం. బంధుత్వం వేరు.రాజకీయాలు వేరు. పార్టీని కాపాడుకోవాలసిన కర్తవ్యం నామీద ఉంది.అందువల్ల ఏమి చేయాలో చేస్తాను.\'అని చంద్రబాబు ఉద్వేగభరితంగా ఉపన్యసించారు.

సత్యసాయిబాబా మందిరంలో ఏమున్నాయో

సత్యసాయిబాబా ట్రస్టు వ్యవహారాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సాయిబాబ చనిపోవడానికి ముందువరకు ఆయన ఉండే యజుర్వేద మందిరంలో విశేషమైన సంపద ఉందన్న వార్తల నేపధ్యంలో ఆ మందిరాన్ని తెరవడానికి ట్రస్టు బోర్డు సభ్యులు కొందరు ప్రయత్నిస్తున్నట్లు కధనాలు వస్తున్నాయి.సాయిబాబని ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఆ మందిరాన్ని మూసి ఉంచారు. ఆ మందిరంలో బంగారు ఆభరణాలు, వజ్రాలు. నగదు మొదలైనవిపెద్ద ఎత్తున ఉన్నాయని అంటున్నారు. అయితే కొందరు వీటిపై కన్ను వేశారని,రెవెన్యూ, పోలీసు అధికారులతో నిమిత్తం లేకుండా యజుర్వేద మందిరాన్ని తెరవాలన్న ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక పోలీసు మాజీ ఉన్నతాధికారి ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి, పోలీసు భద్రత లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. వీరికి కొందరు ట్రస్టు బోర్డు సభ్యులు సహకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి యజుర్వేద మందిరం వద్ద పోలీసు కాపలా యధాతధంగా కొనసాగుతోంది. ఇలాంటి సమయాలలో ట్రస్టు బోర్డు సభ్యులు ముందుకు వచ్చి, వాస్తవ పరిస్థిని తెలియచెప్పి, ప్రభుత్వ ప్రతినిధులు, మధ్యవర్తుల సమక్షంలో యజుర్వేద మందిరాన్ని తెరిచి ఉన్న విలువైన వస్తువులన్నిటీని రిజిస్టర్ చేస్తే మంచిది కదా. అప్పుడు అనవసరమైన వదంతులకు ఆస్కారం ఉండదు కదా.

కిరణ్‌పై నేదురుమల్లి పిడుగు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై రాజకీయంగా మరో బాంబు పడింది.మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఏకంగా సి.ఎమ్.పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. అంతేకాక ఆయన ఎ.ఐ.సిసి అధినేత్రి సోనియాగాందీకే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డికి ఎవరిని సంప్రదించే సంప్రదాయం లేదని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, పరిస్థితిని చక్కదిద్దాలని సోనియాకు చెప్పానని ఆయన బహిరంగంగా వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడు కూడా అయిన నేదురుమల్లి జనార్దనరెడ్డిని ఈ మధ్య కాలంలో కిరణ్ అసలు పట్టించుకోవడం లేదు. కనీసం ముఖ్యమంత్రి అయ్యాక సీనియర్ నాయకుడిగా ఉన్న నేదురుమల్లిని కిరణ్ కలవడానికి కూడా ప్రయత్నించినట్లు లేరు. ఈ నేపధ్యంలో కిరణ్ పై రాజకీయంగా తనదైన శైలిలో ఆయన విమర్శల వర్షం కురిపించారు. దానికి తోడు కడప ఉప ఎన్నికలో పార్టీ ఓడిపోయిన తీరును ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించి ఉంటారు.ఏది ఏమైనా నేదురుమల్లి పార్టీకి ఎంతవరకు ఉపయోగపడతారన్నది పక్కన బెడితే , పార్టీలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన సీనియర్ నాయకుడు .1972 లోనే కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యుడయ్యారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ అయి రాష్ట్ర మంత్రి అయ్యారు.రాష్ట్రస్థాయిలో చెన్నారెడ్డి, విజయభాస్కరరెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డిలకు వ్యతిరేకంగా చాలాకాలం ఒక వర్గాన్ని నడిపిన నేతగా గుర్తింపు పొందారు. ఇటీవలి కాలంలో ఆరోగ్య రీత్యా కొంత వెనుకబడినప్పటికీ , రాజకీయంగా ఆయన దగ్గర వర్గం తగ్గినప్పటికీ, ఆయనకు ప్రత్యేక
గుర్తింపు కాంగ్రెస్ లో ఉంటుంది. అలాంటి వ్యక్తిని కిరణ్ కుమార్ రెడ్డి అసలు పట్టించుకున్నట్లు కనబడలేదు. దానిఇని దృష్టిలో ఉంచుకునే నేదురుమల్లి కిరణ్ నెత్తిన ఒక రాయిపెట్టి కొట్టినట్లు మాట్లాడారు.

Sunday, May 29, 2011

మేకపాటి క్వారీ గోవిందా!


నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతోంది.రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,ఆయన పోదరుడు వివేకానందరెడ్డిలకు, వైఎస్.ఆర్.కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్న మేకపాటి సోదరులకు మధ్య తీవ్ర స్థాయిలో వివాదం ఏర్పడింది. ఈ రెండు వర్గాలు రాజీనామాల సవాళ్లు,ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. ఈ దశలో మేకపాటి రాజమోహన్ రెడ్డికి చెందిన కెఎమ్ సి కి మంజూరైన కంకర క్యారీని రద్దు చేసే విషయమై కూడా యోచన జరుగుతోంది.నెల్లూరు ఎమ్.పి మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రముఖ కాంట్రాక్టరు కూడా. ఆయన కంపెనీకి, మరో కంపెనీకి కలిపి జాతీయ రహదారి విస్తరణ కాంట్రాక్టు లభించింది. ఆ పని చేయడానికి అవసరమైన కంకరను
తీసుకురావడానికి ఒక క్వారీని మేకపాటి కంపెనీ లీజుకు తీసుకోడానికి గాను దరఖాస్తు చేసుకుంది.మొదట దానిపై కొంత వ్యతిరేకత వచ్చినా, తదుపరి స్థానిక అదికారులు పాజిటివ్ గా నివేదిక ఇవ్వడంతో క్వారీ మంజూరైంది. అయితే ఇంతలో మంత్రి ఆనం సోదరులకు, మేకపాటి సోదరులకు రాజకీయ వివాదం ముదరడంతో మంత్రి కి ఈ క్వారీ విషయం గురించి తెలిపారు. దానిపై ఆరా తీసి వాస్తవ పరిస్థితి తెలుసుకోవలసిందిగా మంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇంతకు ముందు కలెక్టర్ రాంగోపాల్ ఈ క్వారీని మంజూరు చేశారు. అయితే తాజాగా ఆ క్వారీని స్తానికులు వ్యతిరేకిస్తున్నారన్న కారణంగా గత కలెక్టర్ మంజూరు చేసిన లీజును ప్రస్తుత కలెక్టర్ శ్రీధర్ పెండింగులో ఉంచారట. ఇదంతా మంత్రి రామనారాయణరెడ్డిని సంతోషపెట్టేందేకునేనని మేకపాటి వర్గీయులు అంటున్నారు. ఈ సోదరుల ద్వయాల మధ్య మున్ముందు రాజకీయ వివాదం ఎటు మలుపు తిరుగుతుందా అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Saturday, May 28, 2011

బాలకృష్ణ రూటు వేరు

నందమూరి కుటుంబంలో చీలిక స్పష్టంగానే కనబడుతోంది. ప్రముఖ సినీనటుడు, ఎన్.టి.ఆర్ తనయుడు అయిన నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ కుటుంబ డ్రామాలో పార్టీ అద్యక్షుడు, తన వియ్యంకుడు చంద్రబాబువైపే నిలబడాలని స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. బాలకృష్ణ తన సోదరుడు, రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తో విబేధిస్తున్నట్లే అర్ధం అవుతోంది. హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్ లు కలిసి నెక్లస్ రోడ్డుకు వెళ్లి ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తే, బాలకృష్ణ వారితో కలిసి వెళ్లినట్లు కనిపించలేదు.కాగా జూనియర్ ఎన్.టి.ఆర్ తాను మహానాడుకు రావడం లేదని ప్రకటించిన కాసేపటికి బాలకృష్ణ మహానాడు ప్రాంగణంలో కనిపించారు. ఆయన అక్కడ ఏర్పాటు చేసిన ఎన్.టి.ఆర్ ఫోటో ఎక్జిబిషన్ ను తిలకించారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ బాలకృష్ణకు అల్లుడు అన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో జూనియర్ ఎన్.టి.ఆర్, లోకేష్ ల వారసత్వ తగాదాలో బాలకృష్ణ సహజంగానే అల్లుడివైపే నిలుస్తారు. ఇప్పు డు అదే జరిగినట్లు కనిపిస్తుంది.కొంతకాలం క్రితం కృష్ణా జిల్లా తెలుగుదేశం వివాదం సందర్భంగా కూడా బాలకృష్ణ చేసిన ప్రకటన కూడా హరికృష్ణకు, ఆయనకు కాస్త తేడా ఉందన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆ భిన్నమైన దారులు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్.టి.ఆర్ రాకపోయినా, హరికృష్ణ అంటీ,అంటనట్లు ఉంటున్నా బాలకృష్ణ మహానాడు ప్రాంగణానికి రావడం, ఫోటో ఎక్జబిషన్ తిలకించడం, (బహుశా ప్రసంగం కూడా చేయవచ్చు)వంటివాటివల్ల చంద్రబాబుకు కొంతలో కొంత ఉపశమనంగానే భావించాలి.

మహానాడులో కటౌట్లపై రగడ

మహానాడులో కటౌట్ల వేడి అటు,ఇటు తిరిగి చిన్న నాయకులపై పడింది. రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ కటౌట్లపై రగడ సృష్టించిన తర్వాత కొంతసేపటికి ఆ వేడిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నాయకులపై చూపారు.చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు తన కుమారుడు లోకేష్‌ను చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించాలని కోరుతూ ఫ్లెక్సీలను ప్రదర్శించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ కు సంబందించి ప్లెక్లీలను ఎందుకు పెట్టారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వి పెట్టారన్నా, లోకేష్ ను కమిటీలోకి తీసుకురావాలన్నా సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. మరి చిత్తూరు జిల్లా నాయకులు రెండు రోజులుగా ప్లెక్సీలను ప్రదర్శిస్తే ఇప్పుడు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేయడం ఏమిటో తెలియదు. బహుశా ఆయనకు ఈ ఫ్లక్లీల గురించి తెలియదా? ఆయన దృష్టికి ఎవరూ తీసుకురాలేదా?హరికృష్ణ గొడవ చేసేవరకు ఆయనకు ఈ విషయం తెలియదా?

జూనియర్ ఎన్.టి.ఆర్ వైఖరి ఇదేనా!

ప్రముఖ సినీనటుడు , రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ కుమారుడు అయిన జూనియర్ ఎన్.టి.ఆర్ మహానాడుకు హాజరుకావడం లేదని ప్రకటించారు. ఆయన, తన తండ్రి హరికృష్ణ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని లతో కలిసి నెక్లస్ రోడ్లోని ఎన్.టి.ఆర్.ఘాట్ కు వెళ్లి నివాళులర్పించారు. ఎన్.టి.ఆర్ జయంతి సందర్భంగా సాధారణంగా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని విబేదాలు లేవని కార్యకర్తలకు, ప్రజలకు ఒక సందేశం, ఒక సంకేతం ఇవ్వడానికి రాజకీయ నేతలు ప్రయత్నిస్తుంటారు.అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్.టి.ఆర్లు చంద్రబాబుతో కలిసి నివాళులర్పించకపోవడమే కాక,
విడిగా రావడం, తర్వాత తాను మహానాడు కు వెళ్లడం లేదని ప్రకటించడం అనేక సందేహాలకు తావిస్తోంది . తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు కొత్త దశకు చేరుకుందన్న అబిప్రాయం కలుగుతుంది. తాను షూటింగ్ లలో బిజీగా ఉన్నందున మహానాడుకు వెళ్లడం లేదని, వచ్చే మహానాడుకు వెళతానని ఎన్.టి.ఆర్ చెప్పారు. స్వయంగా చంద్రబాబో, లేక ఎర్రన్నాయుడో ఫోన్ చేసి ఆహ్వానిస్తే వెళ్లకపోవడంలోని ఆంతర్యం అర్ధం చేసుకోవడం కష్టం కాదు.ఎందుకంటే మహానాడు జరుగుతున్న గండిపేట కు అరగంట ప్రయాణం .ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేవరకు మూడురోజులపాటు జరిగే మహానాడుకు వెళ్లడానికి టైమ్ సరిపోవడం లేదని అంటే అది నమ్మశక్యం కాదు. తన ప్రాముఖ్యతనుపార్టీలో పెంచుకోవడానికి,చంద్రబాబు నాయుడుకు చికాకు కలిగించడానికి, నారా లోకేష్ కన్నా తనకే ప్రజాదరణ ఉందని , కార్యకర్తలలో పలుకుబడి ఉందని రుజువు చేసుకోవడానికి
జూనియర్ ఎన్.టి.ఆర్ చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబుకు , హరికృష్ణ కుటుంబానికి మధ్య గ్యాప్ ఉందని మరోసారి ఈ సన్నివేశం తేల్చి చెప్పింది.

గాలి సోదరులతో వెంకయ్యకు లింక్


భారతీయ జనతాపార్టీలో కర్నాటక రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అందులోను గాలి సోదరులుగా పేరొందిన మైనింగ్ యజమానులకు మంత్రి పదవులు ఇవ్వడంలో ఎవరి బాద్యత ఎంత అన్నదానిపై చర్చ జరుగుతోంది.మన రాష్ట్రానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు ఎమ్.వెంకయ్య నాయుడు వారికి మంత్రి పదవులు రావడంలో ముఖ్య పాత్ర పోషించారని స్వయంగా లోక్ సభ లో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆయనతోపాటు అరుణ్ జైట్లి, అనంతకుమార్ లు కూడా కీలక భూమిక పోషించారని ఆమె తెలిపారు. అప్పట్లో అరుణ్ జైట్లి కర్నాటక ఇన్ చార్జీగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. గాలిసోదరులు జనార్దనరెడ్డి, సోమశేఖరరెడ్డి, కరుణాకరరెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఒకే కుటుంబానికి మూడు మంత్రి పదవులు ఇవ్వడమేమిటని తాను ప్రశ్నించానని, కాని అక్కడున్న రాజకీయ పరిస్థితుల రీత్యా ఇవ్వవలసి వచ్చిందని అన్నారని ఆమె వెల్లడించారు. బళ్లారికి తాను కేవలం ఏడాదికి ఒకసారి వరలక్ష్మి పూజకు మాత్రమే వెళతానని అన్నారు. ఆంగ్ల పత్రిక ఔట్ లుక్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వెంకయ్య నాయుడు ఆంద్రప్రదేశ్ కు చెందిన వెంకయ్యనాయుడుకు గాలి సోదరులకు సంబందాలు ఉండగా, గాలి సోదరులకు కాంగ్రెస్ నేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబంతో అప్పట్లో సంబందాలు ఉన్న విషయం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

Tuesday, May 24, 2011

మరో కుటుంబంలో జగన్‌ చిచ్చు

కేవలం తనకుటుంబంలో సోనియా చిచ్చుపెట్టిందని ప్రత్యేకపార్టీనే పెట్టిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాల్లో చిచ్చురేపేలా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేల సోదరులు,కుటుంబసభ్యులు జగన్ పార్టీలో చేరిపోవడంతో కుటుంబం,బంధువర్గాల్లో ఘర్షణలు మొదలయ్యాయి. ఇప్పటికే ఈ కోవలో ధర్మానప్రసాదరావు,రఘువీరారెడ్డి,నన్నపనేనిరాజకుమారి (అల్లుడు జగన్ పార్టీ)తదితరులున్నారు. అయితే తాజాగా గుంటూరుకు చెందిన మంత్రి కాసుకృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి జగన్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ కుటుంబంలో కూడా చిచ్చు రేగింది. తనయుడ్ని విడిచి ఉండలేనని కృష్ణారెడ్డి చెప్తున్న నేపథ్యంలో వారి కుటుంబసభ్యులంతా కృష్ణారెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేసి , వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి చేరాలని ఒత్తిడి తెస్తున్నట్లు ఇవాళ కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఇదే కానీ నిజమైతే మరో మంత్రి జగన్ నీడలో చేరిపోయినట్లే. మరి జగన్‌వైపు మంత్రిగారు వెళ్తారా లేదా తనకే ఎసరు పెట్టిన జగన్‌పై ప్రతీకారం తీర్చుకుంటారా అన్నది కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

లోకేష్ కు పోటీగా జూనియర్ ఎన్.టి.ఆర్

తెలుగుదేశం పార్టీలో మళ్లీ లోకేష్, జూనియర్ ఎన్.టి.ఆర్ ల లొల్లి కొనసాగేలా కనిపిస్తోంది.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ను చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలన్న డిమాండుకు పోటీగా జూనియర్ ఎన్.టి ఆర్.ను కృష్ణా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం ఇన్ ఛార్జీగా నియమించాలని ఎన్.టి.ఆర్.మద్దతుదారులు డిమాండు చేయబోతున్నారట.కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జరగనున్నజిల్లా పార్టీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేయాలని ఎన్.టి.ఆర్ మద్దతుదారులు పట్టబట్టబోతున్నారని
ప్రచారం జరుగుతోంది.కొద్ది కాలం క్రితం నారా లోకేష్ టిడిపిలో చంద్రబాబు వారసుడు అవుతారన్ని వచ్చిన కధనాలపై జూనియర్ ఎన్.టి.ఆర్ తరపున కూడా ఆయనే వారసుడన్న ప్రచారం చేయడం జరిగింది. పార్టీలో ఇది తీవ్ర వివాదానికి దారి తీసింది. అయితే చంద్రబాబు గట్టిగా వ్యవహరించడంతో జూనియర్ ఎన్.టి.ఆర్, ఆయన తండ్రి హరికృష్ణ లు కొంచెం తగ్గారు. అయినప్పటికీ లోలోపల దీనిపై మధనం జరుగుతోంది.ఈ సమయంలో లోకేష్ ను చంద్రగిరి ఇన్ఛార్జి అంటూ వార్తలు రావడంతో వెంటనే జూనియర్ ఎన్.టి.ఆర్ మద్దతుదారులు రంగంలో దిగడం ద్వారా వారసత్వ పోరునుకొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అర్ధం అవుతుంది.అయితే చంద్రబాబు మాత్రం లోకేష్ పై తీర్మానం చేయడంపై అసహనం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.అయితే చంద్రబాబుకు తెలియకుండా అలాంటి తీర్మాం చేస్తారా అన్న వాదన కూడా ఉంది.అయితే భవిష్యత్తులో యువనేతల మధ్య రాజకీయ ఘర్షణ జరగడానికి అన్ని అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తుంది

చిరంజీవి ఏ ముహూర్తాన రాజకీయాలలోకి వచ్చారో

ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ఏ ముహూర్తాన రాజకీయాలలోకి వచ్చారో కాని , ఆ రోజు నుంచి ఆయన కష్టాలు పడుతూనే ఉన్నారు.మొదట ఆయన రాజకీయాలలోకి వస్తారా?రారా అన్న సస్పెన్స్ సాగింది.ఆ తర్వాత రాజకీయాలలో ఎలా రాణిస్తారన్న చర్చ,తదనంతరం టిక్కట్ల గోల, రకరకాల ఆరోపణలు,ఎన్నికల ప్రచారంలో అంతా రకరకాల ఆరోపణలు, ఎన్నడూ ఊహించని విమర్శలు.. వాటిని తట్టుకుని నిలబడితే బాక్సాపీస్ దగ్గర బోల్తా పడిన సినిమా మాదిరి దెబ్బతిని కేవలం పద్దెనిమిది సీట్లే వచ్చాయి.ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి నానా తంటాలు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలన్న నిర్ణయం , అదేదో వేగంగా సాగుతుందనుకుంటే ఇప్పుడు మళ్లీ సస్పెన్స్. అప్పుడే కాంగ్రెస్ లో విలీనం చేయాలని తీర్మానం చేసి మూడు నెలలు అయినా ఇంకా ఎన్నికల కమిషన్ ఇంకా పరిశీలిస్తూనే ఉంది.ఈలోగా ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా ఉండి జగన్ వర్గంలోకి వెళ్లిన శోభానాగిరెడ్డి ఈ విలీనం చెల్లదంటూ ఎన్నికల సంఘానికి, ఉప సభాపతికి ఫిర్యాదు చేశారు. అంతేకాక ప్రకాశం జిల్లా కు చెందిన లక్ష్మ య్య నాయుడు అనే వ్యక్తి ఏకంగా విలీనంపై కోర్టుకు ఎక్కారు. ఈయన వల్ల లక్షల నష్టం జరిగిందన్న అబియోగం మోపారు.ఇవి చాలవన్నట్లుగా తెలంగాణ తీర్మానంలో చిరంజీవి పార్టీ మార్పుచేసుకున్నందునే తెలంగాణ లోఆత్మహత్యలు జరిగాయంటూ పోలీసులకు ఫిర్యాదు.చాలా చిత్రమైన రాజకీయం అనిపించి ఉండాలి చిరంజీవికి.వీటన్నిటిని భరించి, కేంద్రంలో మంత్రి పదవి చేద్దామంటే విలీనం అయ్యేదెప్పుడో అర్దం కావడం లేదట.ఇదే విషయాన్ని చిరంజీవిని కొందరు ప్రశ్నిస్తే, తనకే తెలియడం లేదు అని నిట్టూర్చారట.నిజమే రాజకీయం అంటే తెలియని చిరంజీవికి ఇవన్ని చిక్కులు,చికాకులే.

శతాబ్ది రైళ్లలో టెలివిజన్

శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ప్రయాణికులకు వాల్యూ యాడెడ్ సర్వీపుల కింద ప్రయాణికులకు టిలిజన్ సదుపాయం కలిగించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.
ఇప్పటికే ఒక శతాబ్ది రైలులోప్రయోగాత్మంగా అమలు చేయగా, దానికి మంచి స్పందన ప్రయాణికులలోకనిపించడంతో ముందుగా అరడజను శతాబ్ది రైళ్లలోటెలివిజన్ సెట్లు ఏర్పాటు చేస్తున్నారు.ఎక్జిక్యూటివ్ క్లాస్ లో, ఎసి ఛైర్ కార్ లలో ప్రతి సీటు వెనుక పది అంగుళాల సైజు ఉన్న ఎల్ సిడి టివి అమర్చుతారు. వార్తా ఛానళ్లు, క్రీడల ఛానళ్లు అందుబాటులో ఉండే విదంగా సర్వీస్ ప్రొవైడర్ల కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. ఆయా సర్వీస్ ప్రొవైడర్లకు సంవత్సరానికి పదమూడు నుంచి పద్దెనిమిది లక్షల వ్యయం అవుతుందని అంచనా, అయితే టివీ సర్వీస్ స్కీమ్ ద్వారా సంవత్సరానికి ఒక సీటు ద్వారా ఇరవై ఏడు లక్షల రూపాయల ఆదాయం వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు.ప్రస్తుతానికి అమృతసర్, కల్క, లక్నో, భోపాల్, అజ్మీర్ , డెహ్రాడూన్ లకు వెళ్లే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఈ టివీ స్కీమ్ ను అమలు చేయబోతున్నారు.

Monday, May 23, 2011

తీహారు జైలులో కరుణానిధి


తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తన ముద్దుల కుమార్తె కనిమొళిని తీహారు జైలులో కలుసుకుని పరామర్శించారు. కనిమొళి అరెస్టుపై ఆయన తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అన్యాయంగా అరెస్టు చేశారని కరుణానిది వాపోతున్నారు. కరుణానిది, కనిమొళి కలిసినప్పుడు వారిద్దరి మద్య సహజంగానే విచారం పెల్లుబుకుతుంది.పట్టుపరుపులపై, హంసతూలికాతల్పం వంటి మంచాలపై విశ్రాంతి తీసుకునే తన కుమార్తె జైలులో కటిక ప్రదేశంలో పడుకోవలసి రావడం కరుణానిది ఊహించని విషయం. పైగా కనిమొళి జైలులో తొలి రోజు సరిగా నిద్ర పోలేకపోయింది. దోమల బాధ, సరైన టాయిలెట్ సదుపాయం లేకపోవడం వంటి బాధలు ఆమెను ఇబ్బందులకు గురి చేశాయి. కాగా కనిమొళిని తన సాహిత్య వారసురాలుగా కరుణానిధి గతంలో ప్రకటించారు. ఆమెను రాజ్యసభ సభ్యురాలిగా చేశారు. ఆమె కలైంగర్ టివీ ఛానల్ పెడితే సంతోషించారు. అలాంటి కనిమొళి తీహారు జైలు నాలుగు గోడల మధ్య మగ్గడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. ఎనబైఎనిమిది సంవత్సరాల వయసులో కరుణానిధికి ఇది మానసికంగా పెద్ద దెబ్బే.కరుణానిధితో పాటు తల్లి రజతి అమ్మాళ్, భర్త
అరవిందన్ కూడా కనిమొళిని కలిశారు.

చంద్రగిరి ఇన్‌ఛార్జ్‌గా నారాలోకేష్‌


చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌ రాజకీయ అరంగ్రేటానికి రంగం సిద్ధమవుతుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి లోకేష్‌ను ఇన్‌ఛార్జ్ చేయాలంటూ ఆ ప్రాంత టిడిపినాయకులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని చిత్తూరు జిల్లా పార్టీ సమావేశంలో పెట్టి ఆమోదించజేస్తామని చెప్తున్నారు. ఆ తరువాత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయనతో కూడా ఒప్పిస్తామని వీరు చెప్తున్నారు. గత పదిపదిహేనేళ్లగా చంద్రగిరికి సరైన ఇన్‌ఛార్జ్ లేక టిడిపి ఇబ్బంది పడుతుందని , ఆ లోటును భర్తీ చేయడానికి నారాలోకేష్‌ అయితేనే సమర్థుడని వీరు వాదిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలు లోకేష్‌కు గానీ, చంద్రబాబుకు గానీ తెలియకుండా చేయరు. చంద్రబాబు కూడా లోకేష్ రాజకీయాల్లోకి రావడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. అతనికి ఆసక్తి ఉంటే అతని ఇష్టమేనని వ్యాఖ్యానిస్తూ వచ్చేవారు. పైగా కొద్దికాలం క్రితం తెలుగుదేశం వారసుడెవరు అన్న అంశంపై జూనియర్‌ఎన్టీఆర్‌, లోకేష్‌ల మధ్య పోటీ కూడా ఏర్పడినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నారా లోకేష్‌ను ఇన్‌ఛార్జ్‌గా పెట్టాలని చంద్రగిరి ప్రాంతనేతలు తీర్మానం చేయడానికి ప్రాధాన్యత ఉంటుంది.

పాపం రజనీకాంత్


గొప్పవాళ్లకు ఒక్కోసారి పెద్ద సమస్యలు వస్తుంటాయి. వారికి అనారోగ్యం సోకితే ఇటీవలి రోజులలో మరీ చికాకు ఎదురవుతోంది.రజనీకాంత్ అనారోగ్యానికి గురి అయిన తర్వాత కాసేపటికి ఇంటర్ నెట్ ప్రపంచంలో ఆయనకు సంబంధించిన వదంతులు రకరకాలుగా గుప్పుమన్నాయి.రజనీకాంత్ చనిపోయారని కొన్ని వెబ్ సైట్ లు పేర్కొని గగ్గోలు పుట్టించాయి.దీంతో రజనీకాంత్ కు ఉన్న కోట్లాది అబిమానులలో అనేకమంది ఇంటర్ నెట్ ల్ ఆయనకు సంబంధించిన విశేషాల కోసం విపరీతంగా అన్వేషించారట.అసలు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలన్నది వారి ఉద్దేశం.ఆ సందర్భంగా చూస్తే ఒక వెబ్ సైట్ ఏకంగా రజనీకాంత్ మరణించినట్లుగా పేర్కొనడమే కాకుండా ఒక నకిలీ చిత్రాన్ని పెట్టడం, దాని కింద శివాజిరావు గైక్వాడ్( రజనీకాంత్ అసలు పేరు) 1950, డిసెంబర్ 12 అంటూ పేర్కొని ఆయనకు శ్రద్దాంజలి ఘటించేవరకు వెళ్లాయి. రజనీకాంత్ నిజంగా చనిపోయారా? లేక జీవించి ఉన్నారా అన్నది తేల్చుకోవడానికి ఆయన అభిమానులు గత శనివారం నాడు ఆన్ లైన్ లో పేర్కొన్న రెండు కీ పదాలు ఏమిటంటే రజనీకాంత్ డెత్, రజనీకాంత్ డైడ్ అన్న కీ వర్డ్స్ ను ఇంటర్ నెట్ వినియోగదారులు అత్యధికసార్లు వాడినట్లు వెల్లడైంది. ఈ వదంతుల గోల భరించలేక, రజనీ చనిపోయారని జరుగుతున్న ప్రచారంపై షాక్ కు గురైన రజనీ కుటుంబ సభ్యులు రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని బహిరంగ ప్రకటన చేయవలసి వచ్చింది. తాజా గా రజనీకాంత్ తన కుమార్తెతో కలిసి నిలబడి ఉన్నఫోటోను కూడా విడుదల చేశారు.రజనీకాంత్ అలర్జీ బ్రాంకైటీస్, వైరల్ ఫీవర్ తో బాదపడుతున్నారు.

మహేష్ బాబు భార్య నమ్రతకు టోకరా


ప్రముఖ సినీనటుడు మహేష్ భాబు భార్య నమ్రత శిరోద్కర్ తనను మోసం చేసిన ఒక వ్యాపారిపై కేసు పెట్టారు. జూబ్లి హిల్స్ రోడ్డు నెంబరు 81 లో మహేష్ దంపతులు కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఫర్హద్ బిన్ అలీ వారి ఇంటికి వెళ్లి గ్రిల్స్, గ్లాస్ వర్క్ చేస్తానని, పనికి ఆర్డర్ కోరారు. ఆ మీదట శిరోద్కర్ గ్లాస్ పనికి గాను ఒప్పందం కుదుర్చుకుని 8.5 లక్షల రూపాయల మేర బయానా గా చెల్లించారు. అయితే ఆ తర్వాత ఆ వ్యాపారి పని చేయడానికి చాలా ఆలస్యం చేశారు.కొంత పనిచేసినా అది కూడా సంతృప్తికరంగా సాగలేదు.తదుపరి ఆమె అతని పనిని రద్దు చేసుకుని అయినంతవరకు డబ్బు తీసుకుని మిగిలిన డబ్బు వెనక్కి ఇచ్చివేయాల్సిందిగా కోరారు. అందుకు ఆ వ్యాపారి కూడా అంగీకరించి ,అయిన ఖర్చు పోను 4.63 లక్షల రూపాయల మేర చెక్ జారీ చేశారు.కాని ఆ తర్వాత చెక్కు చెల్లలేదు.మరోసారి ఆ వ్యాపారిని హెచ్చరిస్తే ఇంకో చెక్కు ఇచ్చినా అది కూడా చెల్లలేదు.దాంతో ఆమె కోర్టులో కేసు వేయగా వారి ఆదేశం మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సత్యసాయికి మహాసమాధి

సత్యసాయిబాబాను పూడ్చిన చోట మహా సమాధి నిర్మించాలని సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నిర్ణయించారు. ఈనెల 27నుంచి సత్యసాయిబాబా మహాసమాధి నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు రత్నాకర్,ఎస్వీ గిరి సమక్షంలో సాయిబాబా అనువాదకుడు అనిల్‌కుమార్ ప్రకటించారు. జూలై మొదటివారానికల్లా దీని నిర్మాణం పూర్తి చేస్తామని ఆయనన్నారు. అంతవరకు భక్తులకు ఇప్పుడున్న సమాధిని సందర్శించనివ్వలేమని, దయచేసి సాయిభక్తులంతా అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. సత్యసాయి సింహాసనాన్ని సభా మందిరంలో భక్తుల సందర్శనార్థం ఉంచి రోజువారీ భజన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అయితే నిర్మించబోతున్న మహాసమాధి భక్తులకు దివ్యనాభూతి కలిగేలా ఉంటుందని అన్నారు.

యువతిపై సామూహిక అత్యాచారం

కావలి : ఓ యు వతిపై కావలి పీజీ సెంటర్ సమీపంలోని జామాయిల్ తో టల్లో ముగ్గురు యువకులు సామూహి క అత్యాచారం చేశారు. పోలీసుల కథ నం మేరకు .. కలిగిరికి చెందిన ఆ యు వతి కొండాపురం మండలం రేణమాల కు చెందిన గూడూరు రమేష్‌తో ప్రేమలో పడింది. శనివారం ఇద్దరూ కావలి కి చేరుకొని పెదపవని రోడ్డు మీదుగా జామాయిల్ తోటల్లోకి షికారుకెళ్లారు. పెదపవని రోడ్డుకు చెందిన కాకనాటి తి రుపతి, సాదా సురేష్, పుల్లా కుమార్‌రాజా అనే యువకులు వీరిద్దరినీ గమనించారు. జామాయిల్ తోటల్లోకి వెళ్లి వారికి మా యమాటలు చెప్పి బ్యాగుతీసు కున్నారు.

ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లిపోయా రు. సాయంత్రం ఆ యువతి బ్యా గులో బంగారం, నగదు మాయమవడాన్ని గమనించింది. ఆ ముగ్గురు యు వకులకు ఫోన్ చేయగా అక్కడే జామాయిల్ తోటల్లో పడి ఉంటాయి వెళ్లి వె దుక్కోమని చెప్పారు. ఆ యువతి ప్రి యుడితో కలసి రాత్రివేళ జామాయిల్ తోటలో వెదుకులాడుతుండగా ముగ్గు రు యువకులు వచ్చి రమేష్‌పై దాడి చేశారు. అతడు పారిపోయాడు. అనంతరం ఆ ముగ్గురూ యు వతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. రమేష్ తన స్నేహితులతో వచ్చి నిందితులలో ఇద్దరిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జొన్నవాడ కామాక్షితాయి స్థల పురాణం

బాధలతో అలమటించే భక్తులను ఆదుకొనే అమ్మగా, మనసులో తలచిన కాంక్షలను తీర్చే కాంక్షితార్థ ప్రదాయనిగా జొన్నవాడ కామాక్షితాయి వెలుగొందుతోంది. జొన్నవాడ కామాక్షితాయిని సేవిస్తే తమ బాధలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు తరలివచ్చి అమ్మకు వరపడుతుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ అమ్మవారు స్వప్న దర్శనంతో కోర్కెలను తీరుస్తారని భక్తుల నమ్మకం. భక్తి శ్రద్ధలతో రెండు పూటలా 41 రోజుల పాటు కామాక్షితాయికి వరపడితే కోర్కెలు తీరుతాయన్న విశ్వాసంతో వందలాది మంది భక్తులు జొన్నవాడలో బస చేస్తుంటారు. ప్రధానంగా అనారోగ్యంతో బాధపడే వారు, అంగవైకల్యం కలిగిన వారు, సంతానలేమి తో బాధపడే వారు అమ్మవారి ఆల యంలో ప్రదక్షణ చేసి ఫలితం పొందారని పలువురు చెబుతుంటారు.

స్థల పురాణం
జొన్నవాడ కామాక్షితాయి ఆలయం ఏర్పాటు వెనుక దాగిన కథ పురాణ గాథల ప్రకారం ఇలా ఉంది. దేవిని యజ్ఞ వాటికలో ఆరాధించే మహామునులు, శ్రీకామాక్షిదేవి చిత్కళను మనస్సులో రూపొందించుకొని, ఆ తర్వాత అదేవిధంగా నిర్మించి దేవి ఉన్న చోటనే ప్రతిష్ఠించారు. ఆ మహామూర్తే నేడు పూజలందుకుంటున్న శ్రీకామాక్షితాయి అని ఉత్తరాఖండంలో పేర్కొని ఉంది. ఎల్లప్పుడూ కరుణ తొణకిసలాడుతున్నందున ఈ దేవికి కామాక్షి అనే పేరు సార్థకమైంది. కామాక్షితాయిని జొన్నవాడ సమీపంలోని పెనుబల్లి గ్రామానికి చెందిన ఒక రైతు భక్తి శ్రద్ధలతో పూ జించేవాడు. ప్రతి శుక్రవారం తనను పూజిస్తే దర్శనమిస్తానంటూ కామాక్షితాయి ఆ రైతుకు వరమిచ్చింది. ఆ భ క్తుడు సంతోషపడి నియమం ప్రకారం ప్రతి శుక్రవారం పాదదర్శనం కావాలని కోరాడు. అప్పటి నుంచి ప్రతి శుక్రవారం కామాక్షితాయి భక్తులకు దర్శనమివ్వసాగింది. నియమం ప్రకారం తన పాదదర్శనమిచ్చే కామాక్షితాయి ఒక శుక్రవారం దర్శనమివ్వడం ఆలస్యమైంది. అందుకు కోపించిన ఆ భక్తుడు 500 ఏళ్లపాటు ఆలయం పాడుబడుతుందని శపించాడు. పెన్నానదిలో వరదలు ఏర్పడి కామాక్షితాయి గుడిని ముంచివేసి ఆ ప్రాంతమంతా ఇసుక మేటలుగా ఏర్పడింది. ఆ తరువాత ఈ ప్రాంతంలో కొందరు ప్రజలు నివాసాలు ఏర్పరచుకొని జీవించసాగారు. ఇసుక తోడినప్పుడు నీరు రావడంతో స్థానికులు గంగమ్మ, యాదమాంబ అని రాతి విగ్రహాన్ని పెట్టి పూజలు చే యడం ప్రారంభించారు. కాలగమనం లో ఇసుక మేటలు తొలగి కామాక్షితా యి ఆలయం బయటపడింది. అప్పటి నుంచి కామాక్షితాయి మళ్లీ పూజ లందుకుంటోంది. గంగమ్మ, యాదమాంబలకు వేరే గుడి నిర్మించారు.

కొడిముద్దలతో సంతాన సాఫల్యం
సంతానలేమితో బాధపడే మహిళలు బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణం నుంచి 11 రోజులపాటు వరపడుతుంటారు. ధ్వజారోహణం, అవరోహణ సమయంలో ఇచ్చే కొడిముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలుగు
తుందన్న ప్రగాఢ విశ్వాసంతో వందలాది మంది మహిళలు ఈ వ్రతాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో చేపడతారు.

Saturday, May 21, 2011

నెల్లూరు జిల్లా వారితో పెళ్లిళ్లు చేయడం మంత్రి చేసిన తప్పా ?

రాష్ట్రమంత్రి డి.కె. అరుణకు తన కుమార్తెలతో అనుకోని చిక్కు వచ్చిపడింది.మరో మంత్రి జూపల్లె కృష్ణారావుకు అరుణకు గద్వాల పంచాయతీ నడుస్తోంది. తన సహకారం లేకుండా గద్వాలలో ఎలా పాదయాత్ర చేస్తావని అరుణ, ఎట్టి పరిస్థితులలో తాను గద్వాలలో పాదయాత్ర చేస్తానని కృష్ణారావు మాట,మాట అనుకుంటున్నారు. ఇద్దరు తమ వాదనలతో అందరిని ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నారు. ఇద్దరూ నువ్వు తెలంగాణ ద్రోహి వంటే నవ్వు తెలంగాణ ద్రోహి అని విమర్శించుకుంటున్నారు. ఇంతవరకు ఓ.కె. అయితే కృష్ణారావు ఒక అడుగు ముందుకు వేసి అరుణకు సీమాంధ్ర వారితో సంబంధాలు ఉన్నాయని, వారికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఒక ఆరోపణ చేశారు.దానికి కారణం ఏమిటంటే అరుణ తన ఇద్దరు కుమార్తెలను నెల్లూరు జిల్లాకు చెందిన వారితో పెళ్లిళ్లు చేశారు.దాంతో సీమాంధ్ర కనెక్షన్ ఏర్పడిందన్నది కృష్ణారావు అభియోగం అని అరుణ అంటున్నారు. కుమార్తెల పెళ్ళిళ్లకు , తెలంగాణ కు ముడిపెడతారా అని అరుణ వాపోతున్నారు. తాను గాంధీ భవన్ కు వెళ్లి అజాద్ కలిసి తెలంగాణ కోసం పట్టుబట్టానని ఆమె గుర్తు చేస్తున్నారు.ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరడంతో వ్యక్తిగత స్థాయిలో విమర్శలు కురిపించుకుంటున్నారు. అయితే రాజకీయ వివాదాలు, నేతల గొడవలు సంగతి ఎలా ఉన్నా వ్యక్తిగత సంభంధాలను కూడా విమర్శలలోకి తీసుకురావడం ఎంతవరకు సరైనదో అర్ధం కాదు. ఆ మాటకు వస్తే అరుణ ఒక్కరికే సీమాంధ్రవారితో సంబంధాలు లేవు. సీనియర్ నేత, పెద్ద తెలంగాణ ఉద్యమ నేత గా చెప్పుకునే పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తెను నెల్లూరు యువకుడికే ఇచ్చారు.అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష మాజీ నేత విజయరామారావు కుమార్తె గుంటూరు యువకుడిని ప్రేమించి పెళ్లాడారు. ఆ మాటకు వస్తే తెలంగాణ రాస్ట్ర సమితి ముఖ్యనేతలు కొందరికి కూడా సీమాంధ్రలో బంధుత్వాలు ఉన్నాయి. కనుక తెలంగాణ వాదానికి , వ్యక్తిగత సంబంధాలకు లింకు పెట్టి మాట్లాడడం మంచిది కాదేమో.

Friday, May 20, 2011

వెంకటస్వామికి అస్వస్థత


సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికైన జి.వెంకటస్వామి అస్వస్థతకు గురయ్యారు.ఎనభై ఏళ్లకు పైగా వయసు ఉన్న వెంకటస్వామి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, బిపి పెరిగిందని చెబుతున్నారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలిచి వైద్య చికిత్సలందిస్తున్నారు. ఆయన కుమారుడు వివేక్ పెద్దపల్లి ఎమ్.పిగా ఉండగా, మరో కుమారుడు వినోద్ గత రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు.ఇటీవలి కాలంలో సోనియాగాంధీ పై విమర్శలు కురిపించి సంచలనం సృష్టించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ప్రయత్నం చేసే నేతగా గుర్తింపు పొందారు.

ఆకస్మికంగా కిరణ్ కు ఢిల్లీ పిలుపు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆకస్మికంగా శనివారం ఉదయమే ఢిల్లీ వెళుతుండడం కాంగ్రెస్ వర్గాలలో చర్చనీయాంశం అయింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం మే 22 వ తేదీన డిల్లీ వెళ్లవలసి ఉంది. అనంతపురం వెళ్లి అక్కడ ఎమ్.పి అనంత వెంకట్రామిరెడ్డి ఇంట్లో వివాహానికి హాజరై, అక్కడనుంచి బెంగుళూరు వెళ్లి డిల్లీ విమానం ఎక్కాలి. కాని సడన్ గా కిరణ్ కు పిలుపు రావడం కాస్త సంచలనంగా మారింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జీ గులాం నబీ అజాద్ రెండు రోజుల పర్యటన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రికి పిలువు రావడం అందరి మెదడుకు మేతగా మారింది. ఏ ఏ అంశాలపై కిరణ్ ను పిలిచారు. తెలంగాణ అంశంపై మాట్లాడతారా? లేక జగన్ వర్గం వ్యవహారంలో ఏమి చేయాలన్నదానిపై చర్చిస్తారా? లేక కిరణ్ పై వచ్చిన ఫిర్యాదుల నేపధ్యంలో ఏదైనా తీవ్రమైన చర్యలు చేపడతారా? ఆయన వైఖరి మార్చుకోవడానికి అవసరమైన సలహాలు ఇస్తారా?మంత్రివర్గంలో మార్పులు,చేర్పులకు అవకాశం కల్పిస్తారా? ఇలా రకరకాల విషయాలపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఏది ఏమైనా అజాద్ హైదరాబాద్ పర్యటన తర్వాత ఇక్కడి పరిస్థితులపై స్పష్టత చాలావరకు వచ్చిందని, అందువల్ల ఏదో ఒక కార్యాచరణ చేపట్టడానికి సమయం ఆసన్నమైందని, అందువల్లనే ముఖ్యమంత్రిని డిల్లీకి రమ్మని కబురంపారని అంటున్నారు.

కరుణానిధికి అస్వస్థత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆకస్మికంగా అస్వస్థులయ్యారు. 2జి కేసులో తన కుమార్తె కనిమొళి అరెస్టు అయ్యారన్న సమాచారం విన్న తర్వాత కరుణానిది అస్వస్థతకు గురి అయ్యారు.ఆయన చెంత స్టాలిన్, ఆర్కాట్ వీరాస్వామి, అన్బళగన్ ప్రభృతులు ఉన్నారు.కరుణానిదికి ఆయన వ్యక్తిగత వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా అరెస్టయిన కనిమొళిని, కళైంగర్ టీవీ ఎమ్.డి శరత్ కుమార్ లను తీహారు జైలుకు తరలించారు.88ఏళ్ల వయసులో కరుణానిధికి ఈ కష్టం వస్తుందని ఎవరూ ఊహించలేదు. గత పదేళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన కరుణానిధి సొంత కుటుంబ సభ్యులే ఈ రకంగా జైలు పాలవుతారని ఎవరూ అనుకోలేదు.తన డబ్బై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని కరుణానిధి ఎదుర్కుంటున్నారు.ఒక పక్క అధికారాన్ని కోల్పోయి బాధలోఉంటే ఇప్పుడు తన కుమార్తె కనిమొళి అరెస్టు కావడం దెబ్బమీద దెబ్బగా మారింది.కాగా తాజా పరిణామాలపై డి.ఎమ్.కె. సీనియర్ నేతలు సమీక్షించుకుంటున్నారు.కాగా కేంద్ర మంత్రి, కరుణానిధి కుమారుడు అళగిరి పై కూడా కేసు పెట్టే విషయంపై అన్నాడిఎమ్ కె ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి.

కరుణానిధి కూతురు కనిమొళి అరెస్ట్


డిఎంకె ఎంపీ కనిమొళి అరెస్ట్ అయ్యారు. టూజి స్పెక్ట్రమ్ కేసులో ఇరుక్కొన్న కనిమొళిని సిబిఐ కోర్టు పలుదఫాలుగా విచారణ చేసింది. అయితే ఆమె కూడా అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నప్పటికీ పాటియాలా కోర్టు తిరస్కరించింది. దీంతో కనిమొళిని పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలుకు పంపిస్తున్నారు. కనిమొళి అరెస్ట్ కావడంతో ఆమె తండ్రి కరుణానిధి కన్నీళ్లు కార్చారని కొన్ని మీడియాల్లో కథనాలు విన్పించాయి.అయితే కనిమొళి అరెస్ట్ తో యుపిఎకు మద్ధతిస్తున్న డిఎంకె పునరాలోచనలో పడవచ్చునని తెలుస్తోంది.

ముఖ్యమంత్రిపై వేటు వేయాలంటున్న మంత్రులెవరు?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రులపై ఎదురుదాడి చేస్తున్నారా? పలువురు మంత్రులు కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ గులాం నబీ అజాద్ ను కలిసి ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. తమతో ముఖ్యమంత్రి సంప్రదింపులు జరపడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని,తమ అప్రాధాన్య శాఖలను మార్చలేదని ఆయా మంత్రులు ఆరోపణలు చేశారు. దీనిపై అజాద్ ముఖ్యమంత్రి కిరణ్ తో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు మంత్రులు తనకు సహకరించడం లేదని , క్యాబినెట్ విషయాలను కూడా లీక్ చేస్తున్నారని ఆరోపించారు. కోస్తాకు చెందిన ఇద్దరు మంత్రులను తొలగించాలని , అందుకు తనకు అనుమతి ఇవ్వాలని కిరణ్ కుమార్ రెడ్డి గట్టిగా గులాం నబీ అజాద్ ను కోరినట్లు కధనాలు వస్తున్నాయి. ఇంతకీ ఎవరా మంత్రులు అన్న ఆరా తీస్తే ప్రధానంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి.ఒకరు బొత్స సత్యనారాయణ. ఈయన విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయి శాఖల కేటాయింపు జరపగానే తిరుగుబాటు చేసి ఆయనను నైతికంగా దెబ్బతీశారన్న అభిప్రాయం ఉంది.అంతేకాక, ఆయా సందర్బాలలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని సి.ఎమ్. భావిస్తున్నారు. కొద్ది రోజులు క్రితం విలేకరుల సమావేశం పెట్టి ముఖ్యమంత్రి కూడా కడప ఓటమికి బాధ్యత వహించాలన్నట్లుగా మాట్లాడారు. ఇక మరో మంత్రి వట్టి వసంతకుమార్ పేరు చెబుతున్నారు. ఆయన కూడా కిరణ్ కు వ్యతిరేకంగా శిబిరం నడిపి మంత్రి పదవి కూడా కొన్నాళ్ల పాటు తీసుకోకుండా ఇబ్బంది పెట్టారు. వీరిద్దరిని తొలగించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

2014 వరకు కిరణ్ ను ఉండనిస్తారా?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందా?ఆయనను మార్చే అవకాశం లేదా? మరి అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత హడావుడి
చేయడం ఎందుకు? అందరి అబిప్రాయాలు తీసుకోవడం ఎందుకు?కేంద్రమంత్రి , రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ గులాం నబీ అజాద్ జరిపిన రెండు రోజుల పర్యటనలో కిరణ్ గురించి
కాని, కిరణ్ ప్రభుత్వం గురించి కాని సానుకూలంగా చెప్పిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయినప్పటికీ ఇప్పట్లో కిరణ్ ను మార్చలేమని గులాం నబీ అజాద్ అన్నట్లు కధనాలు వస్తున్నాయి.అంటే దీనర్ధం ఇంకోరకంగా కూడా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు తెలంగాణ ఇవ్వనట్లేనా అన్నది కొందరి అనుమానం.అయితే రాజకీయాలు
ఎప్పుడూ ఒకేరకంగా ఉండవు.నిత్య చైతన్యంగా ఉంటాయి. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు.కిరణ్ప్రభుత్వంపై ఇంత అసంతృప్తి ఉందా అని తెలుసుకుని అజాద్
ఆశ్చర్యపోయారట.ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కిరణ్ వైఖరిలో మార్పు తీసుకు వస్తానని అంటున్నారట. అది సాధ్యమయ్యేపనేనా? రాజకీయాలలో
ఒకసారి అంతరం ఏర్పడితే, అది ఏదో రూపంలోబయటపడుతూనే ఉంటుంది.ఇప్పటికే మంత్రులు, ముఖ్యమంత్రి కి మధ్య బేదాభిప్రాయాలు ఉన్నాయి.వాటిని సర్దుబాటు
చేసుకోలేదు. ఎమ్మెల్యేలు కిరణ్ నియంత్రణలో లేరు. వారిని సమన్వయపరచుకోవలి.పార్టీ యంత్రాంగం గురించి దాదాపు తెలియని స్థితి ఉంది. వీటన్నటిని సరిచేసుకుని
ముందుకు వెళ్లడం అంత తేలికకాదు. నిజంగానే కిరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని వెళితే బాగానే ఉంటుంది. బహుశా ఇందుకోసం కిరణ్ కు కొంత సమయం ఇవ్వవచ్చు. నిర్దిష్ట
గడువులోగా వైఖరి మార్చుకుని పార్టీ పరిస్థితిని మెరుగుపరచకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వస్తుందని హెచ్చరించవచ్చు. అప్పటికి సెట్ రైట్ అయితే ఒకే.
లేకుంటే మాత్రం కిరణ్ ను మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక కొన్నిపత్రికలలో వచ్చినట్లు కిరణ్ ను వ్యతిరేకించిన ఎమ్మెల్యేలకు ఝలక్ ఇవ్వడం కాదు. అది రివర్స్
అవడానికి కూడా ఎంత సమయం పట్టదు. కనుక 2014 వరకు కిరణ్ ఉంటారని గులాం నబీ సంకేతాన్ని ఇచ్చినా, అదంతా ఆయన చేతిలో కూడా లేదు. తెలంగాణ అంశం, కిరణ్
వ్యవహార శైలి, ప్రభుత్వ సమర్ధతపై ఆధారపడే ఆయన ప్రభుత్వ మనుగడ ఉంటుంది

టాటా మోటార్స్ రహస్యంగా రూపొందిస్తున్న కాన్సెప్ట్ కారు


ఆటోమోటివ్ రంగంలో సంచలనాలకు మారు పేరయిన టాటా మోటార్స్ మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధమవుతోంది. చౌక కారు ప్రవేశపెట్టినా లేదా నీటితో నడిచే కారుకు రూపకల్పన చేస్తున్నా.. భారత్‌లో కాకుండా ప్రపంచ దేశాలలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాధించుకున్న టాటా మోటార్స్ మరో ఎక్స్‌ట్రాడినరీ కాన్సెప్ట్ కారును రూపొందిస్తోంది. మూడు ఇంధన వేరింయట్(పెట్రోల్, సిఎన్జీ, డీజిల్)లలో లభిస్తూ బహుళ ప్రాచుర్యం పొందిన మారుతి వ్యాగన్ఆర్ కారును పోలి ఉండేలా ఓ అద్భుతమైన కాన్సెప్ట్ కారును టాటా మోటార్స్ రహస్యంగా రూపొందిస్తోంది.

టాటా మోటార్స్ అందిస్తున్న ఇండికా కారులో అధిక స్థలం, సౌకర్యవంతమైన లెగ్ రూమ్ కలిగి ఉంటాయి. అలాగే మారుతి అందిస్తున్న వ్యాగన్ఆర్ కారు లోపలి రూఫ్ కొంచెం ఎత్తులో ఉండి పొడవైన వ్యక్తులకు అనుకూలంగా అధిక స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు మోడళ్ల ద్వారా ప్రేరణ పొందింన కంపెనీ ఈ కాన్సెప్ట్ కారును రూపొందిస్తుంది. ఇండికా కారు కన్నా మరింత అధిక స్థలం, లెగ్ రూమ్‌తో మరియు రూఫ్‌ను ఎత్తుగా ఉండటంతో పాటు ఎక్కువగా ఇంటీరియర్ స్పేస్‌కు వినియోగించుకునే విధంగా ఈ కాన్సెప్ట్ కారు తయారవుతోంది. టాటా డాల్ఫిన్ ప్రాజెక్టులో భాగంగా ఈ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను మాత్రం టాటా మోటార్స్ వెల్లడించాల్సి ఉంది. మార్కెట్ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. టాటా రూపొందిస్తున ఈ కాన్సెప్ట్ కారు ఇంచుమించు ఫోటోలో చూపిన విధంగా ఉండొచ్చని తెలుస్తుంది. ఈ కారు కూడా పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లలో లభించనుంది. టాటా ఇండికా దిగువ రేంజ్‌లో ఈ కారును ప్రవేశపెట్టడమా లేక ఇండికాను ఈ కొత్త మోడల్‌తో రీప్లేస్ చేయడమా అనేది తేలాల్సి ఉంది. అయితే గడచిన దశాబ్ధ కాలంగా ఇండికా మార్కెట్లో ఉంది, కాబట్టి రీప్లేస్ చేస్తుందని ఊహించాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ కాన్సెప్ట్ కారు పెర్ఫామెన్స్ విషయానికి వస్తే వ్యాగన్ఆర్ మాదిరిగానే కంఫర్ట్‌గా ఉండనుంది. మారుతి వ్యాగన్ఆర్, ఆల్టో కార్లతో ఈ కాన్సెప్ట్ కారు పోటీపడే అవకాశం ఉంది.

Tuesday, May 17, 2011

రోజాపై కొత్త వదంతులు


ప్రముఖ సినీ నటీ రోజాపై అప్పుడే కొత్త వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి.రోజా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారా?అంటూ ఒక ఛానల్ హడావుడి చేసింది. దానికి కారణం ఏమిటంటే ఆ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టిన నలభై ఎనిమిది గంటల నిరాహారదీక్షకు రోజా వెళ్లకపోవడమే ఈ వదంతులకు ఆదారంగా ప్రసారం చేశారు. ప్రముఖ సినీ నటులు జీవిత,రాజశేఖర్ ల దారిలోనే ఆమె కూడా వెళతారా అంటూ కధనాలు ఇచ్చారు. రోజా గుంటూరు వెళ్లని మాట నిజమే . కాని అంతామాత్రాన
ఆమె తమకు దూరం అయిపోయినట్లేనని ఎలా అంటారని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.రోజాకు వ్యక్తిగత పనులు ఉండడం వల్ల ఆమెకు వెళ్లి ఉండకపోవచ్చని వారు అంటున్నారు. అంటే జగన్ కావాలని సినిమా నటులను దూరంగా ఉంచదలిచారా అన్నది ఈ కధన సారాంశం. సినీగ్లామర్ కన్నా తన గ్లామరే పెద్దదని ఆయన చెప్పదలిచారన్నది వారి ఉద్దేశం కావచ్చు. అయితే జగన్ ప్రస్తుతం ఎవరి గ్లామన్ మీద ఆధారపడవలసిన పరిస్థితిలో లేరన్నది కూడా వాస్తవం. ఏది ఏమైనా ఎవరైనా ప్రముఖులు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి హాజరు కాలేదంటే కచ్చితంగా అదే వార్తే అవుతుంది.అయితే హాజరు కానంతమాత్రాన అధారం ఉంటే తప్ప వారు పూర్తిగా దూరం అయినట్లు అనుకోనవసరం లేదు. ఇంతకీ ఈ హడావుడి చేసిందంతా జగన్ కు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకున్న ఒక ఛానల్ కాబట్టి దానిని సీరియస్ గా తీసుకోనవసరం లేదన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వర్గాల వాదనగా ఉంది.

నాగార్జునకు తప్పిన ప్రమాదం

బ్రిటిష్ ఎయిర్ వేస్ కు చెందిన విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరుతున్న సమయంలో విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన సంగతిని గుర్తించిన విమాన పైలట్ వంటనే విమానాన్ని నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ విమానంలో ప్రముఖ సినీనటుడు నాగార్జునతో సహా పలువురు వి.ఐ.సిలు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు ఈ విమానం బయల్దేరవలసి ఉంది.ప్రయాణికులంతా విమానంలో కూర్చుని తలుపులు మూసి వేసిన తర్వాత ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ముప్పు తప్పిందని అంటున్నారు.

తండ్రి కాబోతున్న హీరో విష్ణు


ప్రముఖ హీరో మోహన్ బాబు తనయుడు మంచువిష్ణు త్వరలో తండ్రి కాబోతున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి బంధువుల అమ్మాయి అయిన వెరోనికాను మూడేళ్లక్రితం
విష్ణు ప్రేమవివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో తన తల్లి దగ్గర (అమెరికా) ఉంచడానికి విష్ణు కూడా వెళ్లాడని సమాచారం. అందుకే ఈ మధ్య విష్ణు కూడా కాస్త
షూటింగ్ లకు దూరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మోహన్ బాబు
దంపతులు చాలా హేపీగా ఫీలయినట్లు సమాచారం. తాత కాబోతున్న మోహన్ బాబుకు,
తండ్రి కాబోతున్న విష్ణుకు ఆల్ ది బెస్ట్...

రజనీకాంత్ కు డయాలిసిస్


ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ కు డయాలిసిస్ చేస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు.రజనీకాంతో గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురి అయిన సంగతి తెలిసిందే.చెన్నై లోని రామచంద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్ కు ఊపిరితిత్తులలో పేరుకున్న నీటిని డాక్టర్లు తొలగించారు. ఊపిరితిత్తులలో ప్లమ్ పేరుకుని ఉండడంతో ఆయన శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారని, దానిని తొలగించడంతో కాస్త ఇబ్బంది తగ్గిందని చెప్పారు.ఇక ఆయన కిడ్నీలను సోమవారం వరకు మందులతోనే నడిపినప్పటికీ, మంగళవారంనాడు డయాలిసిస్ చేయడం మంచిదని బావించి
ఆ మేరకు డయాలిసిస్ కూడా చేశారు.ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన మిగిలిన భాగాలు వేటికి ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్లు తెలిపారు. కాగా తమకు తమ అభిమాన నటుడు రజనీకాంత్ ను చూసే అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబునాయుడు, నరేంద్ర మోడి వంటి ప్రముఖులు
మాత్రం రజనీకాంత్ ను పరామర్శించారు.

పవన్ కళ్యాణ్‌పై వదంతులు


సినిమాల్లో ఉన్నవాళ్లకి, రాజకీయాల్లో ఉన్నవాళ్లకి వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు వస్తుంటాయి. సెలబ్రటీస్‌గా , పబ్లిక్ ఫిగర్స్‌ గా ఉన్నవారి వ్యక్తిగత జీవితాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రజలు వీరి గురించి లేనిపోనివి మాట్లాడుకుంటారు కూడా. ఒక్కోసారి లేనిపోనివి మాట్లాడుకుంటుంటారు. మెగాస్టార్ సోదరుడు పవర్‌స్టార్‌గా పేరొందిన పవన్‌కళ్యాణ్‌కు ఇలాంటి సమస్యలు తప్పడం లేదు. పవన్ కళ్యాణ్-రేణుకాదేశాయ్‌లిద్దరూ విడిపోతున్నారంటూ సినీపరిశ్రమలో ఎవరో వదంతులు సృష్టించారు. ఈ మధ్యకాలంలో రేణుదేశాయ్‌ ఎక్కువగా పూణేలో ఉంటున్నారని, దాంతో వీరిద్దరి మధ్య అంతరాలు వచ్చాయని, విడిపోవడమే ఆలస్యమన్నట్లుగా ప్రచారం చేసేశారు. ఈ వదంతులపై రేణుదేశాయ్‌ తీవ్ర ఆగ్రహాన్ని , అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మాట్లాడారు. తమ బంధం విడిపోనిదని, మరింత బలపడుతుందని ఆమె చెప్తున్నారు. ఇలాంటి వదంతులు చూసి నేను షాక్ అయ్యాను..ఇలాంటివి ఎందుకు పుట్టిస్తారో అర్థం కాదు. మా ఇద్దరి ప్రేమబంధం సుస్థిరమైనదని మీడియాతో రేణుదేశాయ్ చెప్పారు. కొద్దికాలం క్రితం రేణుదేశాయ్‌ లగేజితో సహా పూణె వెళ్లారని, పవన్ మాత్రం హైదరాబాద్‌లో ఉండిపోయారని, దాంతో వీరిమధ్య ఏదో జరిగిందంటూ కొందరు కథలు అల్లారు. అదంతా రబ్బీస్ అని ఆమె కొట్టిపారేస్తూ ఇలాంటి విషయాలేవీ మా పిల్లల చెవిన పడకూడదని జాగ్రత్తలు పడుతున్నట్లు చెప్పారు. బద్రి, జానీ వంటి సినిమాల్లో పవన్‌తో కలిసి నటించిన రేణూ, ఆ తర్వాత ప్రేమలో పడి ఆరేళ్లపాటు సహజీవనం సాగించారు. అది పెద్ద వివాదం కావడంతో పవన్ తన మొదటిభార్య నందినికి పరిహారం చెల్లించి విడాకులు తీసుకొని రేణును 2009లో వివాహమాడారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. బాబు పేరు అఖిరానందన్, పాప పేరు ఆదియా. పవన్ కళ్యాణ్ పూణెలో ఒక ఇళ్లు కొనుక్కొని అక్కడికి మారినప్పటి నుంచి ఈ వదంతులు మొదలయ్యాయి. జూబ్లిహిల్స్‌లోని ఆయన ఇంటిని పునర్నిర్మాణం కోసం పడేశారు. అందుకే పూణె వెళ్లారు. కేవలం సినిమా షూటింగ్‌లకే హైదరాబాద్ వస్తుంటారు. అయితే బాబు చదువు కోసమే ఆమె పవన్‌తో హైదరాబాద్ రాలేకపోతున్నారని పవన్ ఫ్రెండ్ ఒకాయన చెప్తున్నారు. అంత మాత్రానే విడిపోయినట్లా అని మండిపడుతున్నారు.

Monday, May 16, 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా?వస్తున్న కధనాల ప్రకారం చూస్తే రాష్ట్ర మంత్రులు పలువురు ఆయన ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా సోమవారం వస్తున్న గులాం నబీ అజాద్ వద్ద కిరణ్ కుమార్ రెడ్డి కి వ్యతరేకంగా గట్టిగా మాట్లాడబోతున్నారు. కాగా ఛీఫ్ విప్ భట్టి విక్రమార్క ప్రకటించినదాని ప్రకారం అజాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్.పిలతో ఒక్కక్కరితో విడి,విడి గా మాట్లాడారని చెప్పారు. సాధారణంగా అబిఫ్రాయ సేకరణ జరపదలచినప్పుడే ఇలా చేస్తారు.దీనిని బట్టి అజాద్ ముఖ్యమంత్రి పనితీరుపై ఒక అంచనాకు రావడానికి, అవసరమైతే మార్చాలా?వద్దా అన్న నిర్ణయం తీసుకోవడానికి కూడా ఈ బేటీని వాడుకుంటారని, అందరి అభిప్రయాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.అందుకే రెండు రోజుల పాటు ఇక్కడే మకాం చేస్తున్నారు.కాగా మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవీబాధ్యతలు చెప్పటిన తొలిరోజే తిరుగుబాటు చేసినా అప్పట్లోసర్ది చెప్పారు. కాని వారి శాఖలు మార్చలేదు.ఆ అసంతృప్తి రగులుతోంది. అన్నిటికి మించి కిరణ్ చాలామంది కన్నా జూనియర్ . ఆ భావన చాలామందిలో ఉంది. ఆయన పెద్దగా ఎవరిని కలుపుకుని వెళ్లడం లేదని, తనకు అన్నితెలుసు అన్నట్లు వ్యవహరిస్తారనేది అందరి ఫిర్యాదు. ఇక అధిష్టానం కూడా అప్పట్టో ఎవరి అబిప్రాయం తీసుకోకుడానే నేరుగా కిరణ్ ను నియమించింది. అది జరిగి అప్పుడే ఆరునెలలు అవుతుంది. ఈ ఆరునెలల్లో పార్టీపై,ఎమ్మెల్యేలపై, ప్రభుత్వంపై ఏ మా్త్రం పట్టు సాధించారన్నది స్వయంగా అజాద్ పరిశీలించవచ్చని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డికి ఒక పరీక్ష రోజు కింద లెక్క. ఎంతమంది ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు కిరణ్ కు అనుకూలంగా చెబుతారన్నది ఒక ప్రశ్న. ఇక ఎమ్.పిలు చాలామంది కిరణ్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. వారి మనోగతం కూడా అజాద్ తెలుసుకోవచ్చు.అలాగే తెలంగాణ అంశంపై అదిష్టానం భావన తెలిపి, తెలంగాణ నేతల అబిప్రాయాలను సేకరించే అవకాశం ఉంది.

ఆ మాజీ సి.ఎమ్. నేదురుమల్లి?


నల్లధనం కేసులో అరెస్టయిన హసన్ అలీఖాన్ కు గతంలో సంబందాలు పెట్టుకున్న రాజకీయ నేతలు గిజగిజలాడే పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో ఇవేవి అవుతాయిలే అనుకున్నవారు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఆంద్రప్రదేశ్ కు సంబందించిన మాజీ ముఖ్యమంత్రి ఒకరికి సంబంధాల ఉన్నట్లు ప్రచారం కావడంతో మొదట చంద్రబాబునాయుడు పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే దానిని ఆయన తీవ్రంగా ఖండించారు.పైగా హసన్ అలీకి వ్యతిరేకంగా ప్రకటనలు కూడా ఇచ్చారు. తాజాగా హసన్ అలీ సహ నిందితుడు కాశీనాద్ తపూరియా వెల్లడించిన వివరాల ప్రకారం మరో మాజీ ముఖ్యమంత్రిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయి.హసన్ అలీ మాజీ ఎమ్.పి సర్వారాయచౌదరిని తనకు పరిచయం చేశారని, ఆ తర్వాత మరో మాజీ ముఖ్యమంత్రిని కూడా పరిచయం చేశారని తపూరియా వల్లడించారు.చౌదరిని ముంబయిలోని ఆయన ఫ్లాట్లో కలిశానని, ఖాన్ కూడా అక్కడే ఉండేవారని, రెండువేల సంవత్సరంలో ఆంద్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశానని అన్నారు. అయితే ఖాన్ కు, వారికి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయా?లేవా అన్న విషయం తనకు తెలియదని తపూరియా చెప్పారు.అయితే పరిశీలిస్తే 1999లో గెలిచిన వారిలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఉన్నారు. ఆయన 1999లో నరసరావుపేట లో గెలుపొంది లోక్ సభ సభ్యునిగా ఉన్నారు. అంతేకాక ఎ.ఎస్.చౌదరికి, నేదురుమల్లికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.అందువల్ల తపూరియా నేదురుమల్లి పేరు చెప్పారా అన్నఅనుమానం వ్యక్తం అవుతోంది. అయితే నేదురుమల్లికి ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని తపూరియా చెప్పకపోవడం కొంతలో కొంత ఉపశమనంగా భావించాలి. కాగా సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తో సంబంధాలు ఉన్న ప్రముఖ బిల్డర్, సినీ నిర్మాత యూసఫ్ లక్డవాలా తో కూడా సంబంధాలు ఉన్న విషయాన్ని హసన్అలీ వెల్లడించారని తపూరియా తెలిపారు. తీగ లాగితే డొంక కదిలినట్లు హసనీ అలీ లింకులు ఎక్కడి నుంచి ఎక్కడకు వళుతున్నాయో!

జయలలితకు ఇష్టమైన నెంబర్‌




మతపరమైన విశ్వాసాలు, నమ్మకాలు బాగా అధికంగా ఉండే తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి గా జయలలిత తన నమ్మకాలకు అనుగుణంగానే ప్రమాణస్వీకారం చేశారు.ఆమె తన స్టైల్‌లోనే మంత్రులతో కలిసి కూర్చున్నారు. అంత పెద్ద సీనియర్ మంత్రులు సైతం ఆమెకు కాస్త దూరంగా, చాలా వినయంగా కూర్చుని కన్పించారు. జయలలిత సీటుకు అటు ఇటూ కనీసం 2, 3 అడుగుల గ్యాప్ వరకు ఎవరూ కూర్చోలేదు.మాజీ ముఖ్యమంత్రి అయిన పన్నీర్‌సెల్వం జయలలితతో మాట్లాడటానికి లేచినపుడు ఆ సన్నివేశం చూస్తే వారికి జయలలిత పట్ల గౌరవమో, భయమో అర్థం కాని పరిస్థితిలో కన్పించారు. ఇక ఆమె నమ్మకాలను చూస్తే సరిగ్గా 12.15నిముషాలకు మద్రాస్ వర్శిటీలోని సెంటినరీ హాల్‌లోకి ప్రవేశించారు. ఎందుకంటే ఆమెకు 9 నెంబర్‌పై ఆపార నమ్మకం. 12.15అంకెలన్నీ కలిపితే తొమ్మిది అవుతుంది. అందుకే ఆ టైంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.వంకాయరంగు చీర ధరించి వచ్చిన జయలలిత మొత్తం 33మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో 24మంది కొత్తవారు కావడం విశేషం. ఇక ఆమె ఇంటినెంబర్ కూడా 36కావడం (మూడుఆరు కలిపితే తొమ్మిది)మరో విశేషం.వీల్ చైర్‌లో వచ్చిన గవర్నర్ సూర్జిత్‌సింగ్ బర్నాలాను సాదరంగా జయలలిత ఆహ్వానించి తన మంత్రివర్గ సహచరులను పరిచయం చేశారు. జాతీయగీతం తరువాత తమిళగీతం ఆలపించిన జయలలిత తమిళంలోనే ప్రమాణస్వీకారం చేశారు. కాగా ఈమె విజయంలో మిక్సీలు,గ్రైండర్లతో పాటు కీలకపాత్ర పోషించాయని తమిళవిశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.