నేడు నెల్లూరు

Saturday, May 8, 2010

నేదురుమల్లిపై సోనియాగాంధీకి పద్మనాభరెడ్డి ఫిర్యాదు

మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్థనరెడ్డిపై స్వయాన ఆయన సోదరుడు, ఎఐసిసి సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి శుక్రవారం యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. తల్లిలాంటి కాంగ్రెస్‌ పార్టీకి నేదురుమల్లి జనార్థనరెడ్డి తీరని ద్రోహం చేశారని ఆయన సోనియాగాంధీకి చెప్పినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి భర్త, ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడిన పనబాక కృష్ణయ్యను ఓడించి తెలుగుదేశం పార్టీని జనార్థనరెడ్డి గెలిపించారని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది.

పార్టీకి ద్రోహం చేస్తున్న నేదురుమల్లి జనార్థనరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వవద్దని, ఆయనను పార్టీ నుంచి తొలగించాలంటూ ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తమ నాయకుడు నేదురుమల్లి జనార్థనరెడ్డికి రాజ్యసభ సభ్యత్వాన్ని రానీయకుండా చే సేందుకు కేంద్రమంత్రి పనబాక లక్ష్మి చేస్తున్న కుట్రలో ఇది భాగమని జిల్లాలోని నేదురుమల్లి అనుచరులు తెలిపారు. పనబాక లక్ష్మి ఎన్నివిధాలుగా కుట్రలు చేస్తున్నప్పటికీ యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ మాత్రం తమ పెద్దాయనకు అన్యాయం చేయరని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను తప్పరని చెప్పారు. అంతేకాకుండా ఇటీవల రాజస్థాన్‌ గవర్నర్‌ మృతి చెందడంతో నేదురుమల్లి జనార్థనరెడ్డిని రాజస్థాన్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కూడా పనబాక లక్ష్మి వర్గీయులు పుకార్లు పుట్టిస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదన్నారు.

Friday, May 7, 2010

వివేకా...అవివేక పనులు మానుకో

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అవివేక పనులను, అబద్ధాలకోరు తనాన్ని విడనాడాలని 12వ డివిజన్‌ తెదేపా. యువనాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు నగరంలోని పద్మావతీనగర్‌ సాయిబాబాగుడి సమీపంలో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12వ డివిజన్‌లో తెలుగుదేశం కౌన్సిల్‌లో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నఅనూరాధ నిధులను కేటాయించిందని, ఆమె హయాంలోనే 12వ డివిజన్‌లో అభివృద్ధి పనులు చాలా వరకు జరిగాయన్నారు. 2004లో కిన్నెర అపార్ట్‌మెంట్‌ రోడ్డు, ఎసి.నగర్‌ పార్క్‌ అభివృద్ధి పనులు, వేపదొరువు రోడ్డు పనులకు టెండర్లు పిలిచేందుకు రూ.10 కోట్లకు నిధులు మంజూరు చేయాలని ఆర్‌జెడికి లెటర్‌ పెడుతూ టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆర్‌జెడికి రూ.10 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించే విషయమై రద్దు చేయించేందుకు లెటర్‌ పెట్టారని వివేకాను దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించి విలేకరులకు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆర్‌జెడికి లెటర్‌ పెట్టిన సాక్ష్యాధారాలను పత్రికా విలేకరులకు ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు 12వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని, కనీసం వార్డు ఎమ్మెల్యే కోటంరెడ్డి సంధ్యను పిలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరహా పనులను వివేకా మానుకోవాలని హితవు పలికారు. తాను ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్లడం లేదని, వె ళ్తే ఏవిధంగా ఉంటుందో ఎమ్మెల్యేకి బాగా తెలుసన్నారు. ఆనం కుటుంబానికి రాజకీయాలు నేర్పించిందే బాలాజీనగర్‌, ఎసి.నగరేనని, ఆ ఏరియాల అభివృద్ధిని అడ్డుకోవడం ఆ కుటుంబానికి చెందిన రూరల్‌ ఎమ్మెల్యేకు ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లో ఏ పార్టీ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయో స్థానిక ప్రజల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్‌ చేశారు. అదే ఛాలెంజ్‌కు రూరల్‌ ఎమ్మెల్యే సిద్దమా అని ప్రశ్నించారు.

ఎసి.నగర్‌ ప్రాంతంలో పంటకాలువ పూడిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే తమ సొంత నిధులతో లక్ష రూపాయలు ఖర్చు చేసి పూడిక తీయించన ఘనత తమదేనన్నారు. నగరానికి మంచినీటిని అందించేందుకు సమ్మర్‌ వాటర్‌ స్టోరేజ్‌ని నిర్మించేందుకు రూ.102 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇవి చాలక మరో రూ.30 కోట్లను మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ సమ్మర్‌ వాటర్‌ స్టోరేజ్‌ మొదలైనప్పటికీ నగరంలోని 50 డివిజన్లకు నీరు అందదని చెప్పారు. కేవలం 30 డివిజన్ల వరకే ఈ స్టోరేజ్‌ వాటర్‌ను అందించవచ్చునని, మిగతా 20 డివిజన్ల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. 50 డివిజన్లకు మంచినీటిని అందించేంతవరకు తమ పోరాటాలు ఆగవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

కొండెక్కిన కూరగాయలు

ఓ పక్క ఎండలతో సతమతమవుతున్న సామాన్య జనానికి వేసవి ముదిరే కొద్దీ కొండెక్కుతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరింత కుంగదీస్తున్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయలకు గిరాకీ పెరిగింది. ధర నియంత్రణలో అధికారుల వైఫల్యం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది. కూరగాయాల్లో ఏ రకం చూసినా ధర అదర గొట్టేస్తోంది. అరటి కాయల నుండి వంకాయల వరకు ఇదే పరిస్థితి. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ రోజు వారీ ధరలు ప్రకటించినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీనితో కమిటీ జాబితాలోని ధరలకు, అసలు ధరలకు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. కిలో క్యారెట్ దుంపల ధర మార్కెట్ కమిటీ 25 రూపాయలుంటే మార్కెట్‌లో 30 రూపాయలు ఉంటోంది. బీరకాయలు 20 రూపాయలుంటే బయట 24 రూపాయలు పలుకుతోంది. వంకాయలు కమిటీ ధర 12 రూపాయలుంటే మార్కెట్‌లో 16 రూపాయలు ఉంటోంది. చామగడ్డలు, దొండకాయలు, బీరకాయలు, అరటి కాయలు, బీనీసు చివరకు కాకరకాయలు కూడా ధరలను మండిస్తున్నాయి. ఇక చిల్లర వ్యాపారుల వద్ద ధర మరింత పెరుగుతోంది. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో లేని వెసులుబాటు చిల్లర అంగళ్లలో ఉంటోంది. ధర తక్కువని హోల్‌సేల్ అంగళ్లకు వెళితే పుచ్చు చచ్చు చూడకుండా వ్యాపారులు తూకం వేసింది వేసినట్లే తీసుకోవాల్సి వస్తోంది. అదే చిల్లర వ్యాపారుల దగ్గర చూసి తీసుకునే అవకాశం ఉంటోంది. ఈ నేపథ్యం ధర అక్కడకు ఇక్కడకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు ధర నియంత్రణలో గాని అటు తూనికలు, కొలతల్లో గాని వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. రైతు బజార్లలో న్యాయం జరుగుతుందని వెళితే అక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. సౌకర్యాలు లేక రైతులు ఆ వైపు చూడడం లేదు. దీనితో అంగళ్లన్నీ వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. ఇక నిత్యావసరాల ధరల విషయంలో కూడా సామాన్యుడి అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. ధర తగ్గించినట్లు ప్రచారం చేసి వినియోగదారులు దానికి అలవాటు పడిన తరువాత వెంటనే దాని ధర పెంచేస్తున్నారు. దీనితో వినియోగదారులు వ్యాపారులకు దొరికి పోతున్నారు. ధరలపై వ్యాపార వర్గాలు మాత్రం పెరగడానికి కారణాలు రవాణా చార్జీలను సాకుగా చూపిస్తున్నాయి. డీజల్, పెట్రోలు ధరలు పెరగడం వల్ల అందుకు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పెట్రో ధరలు మళ్లీ పెరిగితే ఆ భారం మోయాల్సింది వినియోగదారులేనని చెబుతున్నారు.

ఇది నెల్లూరు కథ

విక్రమ సింహపురమనే పేరుతో నెల్లూరును క్రీస్తు శకం 575-600 మధ్యకాలంలో అవనిసింహ బిరుదు పొందిన సింహవిష్ణువు నెలకొల్పాడని చరిత్రకారులు పేర్కొన్నారు. జిల్లాలో లభించిన శాసనాల ఆధారంగా పెన్నానదికి తీరాన ఉండే నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు ప్రాంతాన్ని 'ముండరాష్ట్రం'గా పేర్కొన్నారు. అనంతరం నెల్లూరు, కోవూరు ప్రాంతాలను మాక్పమే ముండ రాష్ట్రమనీ, ఆత్మకూరు ప్రాంతాన్ని 'మేల్ముండ' రాష్ట్రమనీ పిలిచినట్లు పల్లవుల శాసనాలు చెబుతున్నాయి.

కోవూరు, విడవలూరు, మోడేగుం ట, వేగూరు, గండవరం, కొడవలూరు, దామరమ డుగు, ఉలవపాళ్ళ, కొండమీది కోడూరు, రేవూరు, గొల్లకందుకూరు, కనుపూరు గ్రామాలు ముండ రాష్ట్రంలో భాగాలని ఆ శాసనాల ద్వారా తెలు స్తోంది. ముండులనే జాతి నివసించినందు వల్లే ముండరాష్ట్రమనే పేరు వచ్చినట్లుగా ప్రముఖ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖరశర్మ అభిప్రాయపడ్డారు.

నెల్లూరు తీరుతెన్నులు
నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో 12, 13, 14, 15, 16 శతాబ్దాల కాలంనాటి శాసనా లు ఉన్నాయి. ఈ శాసనాల నుంచి నాటి నెల్లూరు తీరుతెన్నులను కొంతమేర అర్థంచేసుకోవచ్చు. నాడు నెల్లూరు చెరువును ఆనుకొని దర్గామిట్ట, మూలాపేట, రంగనాయకులపేటలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద మసీదు, కాపువీథిలో, చిన్నబజారులో, దర్గామిట్టలో, ఇరుగోళమ్మ ఆల యంలో కలెక్టర్ కచేరిలో కొన్ని శాసనాలు లభిం చాయి. రంగనాథస్వామి ఆలయంలో చోళులు, వారి సామంతులు తెలుగు చోడులనాటి తమిళ శాసనాలు 25 దాకా ఉన్నాయి.

వీటిలో సగం మూడవ కులోత్తుంగుడి కాలం (1178-1226 ) నాటివిగా చెబుతారు. ఈ శాసనాల్లో అంతా నెల్లూ రు 'జయగొండ చోళ మండలం లోని చేడికుల మాణిక్కవలనాటి యందలి పడై నాటి విక్రమ సింహపురమను నెల్లూరు' అని పేర్కొన్నారు. నేటి రంగనాయకుల పేటను 'తిరుప్పాడ్‌కడల్' (పాలకడలి) అని ఆలయాన్ని 'చిత్రమేళివిణ్ణగర్' అని, దేవుడ్ని 'పళ్లికొండ పెరుమాళ్' అని శాసనాల్లో పేర్కొన్నారు. హరిహర రాయల (రెండవ) నాటి (1400-01 ) ఒక తమిళ శాసనం లో ఈ దేవుడు 'శయనరాయన పెరుమాళ్ళు' అని చెప్పారు.

'సుందరపాండ్యశంది' అనే రాజు పేరిట ఓ మండపం కట్టి, అక్కడి నిత్యోత్సవాలకు కోవూరు మండల పరిథిలోని మోడేగుంట గ్రామంలో కొంతభూమిని దానం చేసినట్టు ఉంది. క్రీ.శ. 1400 నాటి ఊరికి, ఆలయానికి మధ్య పెన్నానది పారుతుండేది. నాటి జక్కనకవి తనవిక్రమార్క చరిత్ర, ఏడవ ఆశ్వాసంలో నెల్లూరు, పెన్నను రెండు పద్యాల్లో వర్ణిస్తూ పినాకిని 'పట్టాణాంతర సీమ'లో ఉందని చెప్పాడు. అందుకే 'పెన్నాదాటితే పెరుమాళ్ళ సేవ' అనే నానుడి ఏర్పడింది.

Tuesday, May 4, 2010

నేతల ఇళ్లకు వెళ్లేందుకే రోశయ్య ఆసక్తి

జిల్లాలో పర్యటించేందుకు రోశయ్య అంగీకరించిన మరుక్షణం నుంచి పలు అంశాలు చర్చనీయంగా మారాయి. ఒకపక్క ప్రజా సమస్యలు, మరోపక్క పార్టీలో వర్గ పోరు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. పరిపాలన రంగంలో అపార విశేషం గడించిన రోశయ్య జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరిస్తారని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశించారు. మంచినీటి ఎద్దడి, ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు, సాగునీటి సమస్య, పెన్నా డెల్టా ఆధునీకరణలో సమస్యలు, సెజ్‌లలో కానరాని పరిశ్రమలు, హామీగానే నిలిచిపోయిన ఉద్యోగ అవకాశాలు, నత్తనడకన కొనసాగుతున్న కిసాన్‌సెజ్‌, విమానాశ్రయ నిర్మాణం, సమగ్ర సోమశిల, ఉదయగిరి ప్రాంతానికి సాగు, తాగునీరు తదితర సమస్యలపై రోశయ్య ఏమాత్రం దృష్టి సారించలేదు.

బహిరంగ సభలో రోశయ్యకు ముందు ప్రసంగించిన నేతలు కొన్ని ప్రధాన సమస్యలు ప్రస్తావించారు. కనీసం వాటి ని కూడా ఆయన పట్టించుకోలేదు. మరోపక్క ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతి వల్ల అర్హులకు అన్యాయం జరిగింది. సంక్షేమ పథకాలు పడకేసాయి. నిధులు మంజూరు కాని కారణంగా అభివృద్ధి పనులు మూలన పడ్డాయి. సాగునీటిని వదిలినప్పటికీ కాలువల్లో పూడిక తీసే పనులు చేయలేదు. దీనిపై రైతులు కొందరు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఆయన అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. అధికారుల పనితీరుపై సమీక్ష చేయలేదు. ఒక అరగంట సేపు అధికారులతో మాట్లాడి చక్కగా చేసుకోండని చెప్పి మొక్కుబడిగా సమావేశాని ముగించారు. ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు.

ఇక జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మూడు వర్గాలు, ఆరు విభేదాలుగా విరాజిల్లుతోంది. ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు సైతం చేష్టలుడిగి నిలిచిపోవలసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో వర్గ పోరు ముందు ప్రతిపక్షాలు కనిపించకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ల వరకూ ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రధానంగా నేదురుమల్లి, ఆనం, పనబాక వర్గాల మధ్య వర్గపోరు జోరుగా సాగుతోంది.

ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉంది. రోశయ్య బహిరంగ సభలో వేదికపై ఉన్న ఆనం వ్యతిరేక వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు దింపే ప్రయత్నం చేస్తే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలు జోక్యం చేసుకున్నారు. వేదికపైనే జనార్థన్‌రెడ్డి ఆనం వర్గాన్ని, మేయర్‌ను విమర్శించడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో రాజకీయాల గురించి రోశయ్య వద్ద సమాచారం ఉంది. వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ విభేదాల గురించి మరింత స్పష్టంగా ముఖ్యమంత్రికి అవగాహన కలిగి ఉంటుంది. కనీసం ఈ పర్యటనలో భాగంగా వర్గనేతలందరినీ సమైక్య పరిచి ఐక్యంగా ఉండాలని సూచించి ఉంటే సమంజసంగా ఉండేది. పిలిచిన వారందరి ఇళ్లకు వెళ్లడంతో ఆయా వర్గ నేతలు మరింత బలపడి వర్గ రాజకీయాలను కొనసాగించే అవకాశం కలిగింది. దీనిని పరిశీలిస్తే పరోక్షంగా రోశయ్య పర్యటన వర్గాలను ప్రోత్సహించేదిగా కనిపించింది.

ప్రజాపథం కొనసాగుతున్న తరుణంలో జిల్లాకు వచ్చిన రోశయ్య సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లి స్వయంగా గ్రామస్తులతో కలిసి ఉంటే కొత్త సమస్యలు దృష్టికి వచ్చేవి. సామాన్య ప్రజానీకానికి రోశయ్య తమ వద్దకు వచ్చారన్న సంతృప్తి కలిగేది. ప్రజలకు వద్దకు వెళ్లడానికి ఆసక్తి లేకపోయినా ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేస్తే ఇటు కేడర్‌లో నైనా ఉత్సాహం కలిగేది. జిల్లాలో రెండు రోజులు మకాం వేసిన రోశయ్య ముందు అనేక అవకాశాలు ఉన్నా వాటిని వదిలి పెట్టి కేవలం నేతల ఇళ్లకు వెళ్లడానికి మాత్రమే ఆసక్తి చూపించడం విమర్శలకు దారి తీసింది. జిల్లా నేతల్లో వర్గపోరు అధికంగా ఉండటం వల్ల ఆ ప్రభావం రోశయ్య పర్యటనపై స్పష్టంగా చూపించింది.

జనార్ధన్‌రెడ్డిపై సోనియాకు ఫిర్యాదు చేస్తా : పద్మనాభరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిపై ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేస్తానని నేదురుమల్లి విద్యా సంస్థల చైర్మన్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక దర్గామిట్టలోని పనబాక లక్ష్మి నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు కోల్పోవటానికి కారణం జనార్ధన్‌రెడ్డి అన్నారు. గూడూరులో కాంగ్రెస్ టిక్కెట్టు పనబాక కృష్ణయ్యకు ఇచ్చారని, అందుకని తెలుగుదేశం పార్టీ వైపు ప్రచారం నిర్వహించి, టిడిపిని గెలిపించారన్నారు. తాను మాత్రం కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేశానని అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా అల్పాహార విందుకు విచ్చేసిన రోశయ్యకు ఫిర్యాదు చేశానని తెలిపారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డికి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మధ్య సంబంధాలు ఉన్నాయన్నారు. విద్యా సంస్థలు నిర్వీర్యమై పోతున్నాయని, అందుకని స్వాధీనం చేసుకున్నానని చెప్పడం దారణమన్నారు. తాము రోజురోజుకు విద్యా సంస్థలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాను పనబాక కృష్ణయ్యకు సహకారం అందించానని, అందువల్ల జనార్ధన్‌రెడ్డి విద్యా సంస్థలను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు.

నొప్పించక.. తానొవ్వక! : ముగిసిన సిఎం రోశయ్య పర్యటన

ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య రెండు రోజుల జిల్లా పర్యటన సోమవారం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇంటిలో అల్పాహార విందుతో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఆయన పర్యటన కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి ఇంటిలో సోమవారం ఉదయం అల్పాహార విందుతో ముగిసింది. ఆదివారం బహిరంగ సభ, ప్రభుత్వ అతిథి గృహంలో తూతూమంత్రంగా జరిగిన అధికారుల సమీక్ష తప్ప మొత్తం కార్యక్రమం గ్రూపు నాయకుల కోసమే పరిమితమయింది. రోశయ్య పర్యటన జిల్లా కాంగ్రెస్‌లోని అన్ని గ్రూపులకు చెందిన ప్రధాన నాయకుల ఇళ్లలో చేతులు కడగడానికే సరిపోయింది. పనిలో పనిగా ఆయన తన సన్నిహితుల ఇంటికి కూడా వెళ్లారు. నొప్పించక తానొవ్వక అన్న చందంగా ముఖ్యమంత్రి తన పర్యటనను పార్టీ నాయకులకు సంతృప్తి కలిగించే విధంగా మలుచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సన్మానం అందుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఆయన పర్యటన ప్రజలను అంతగా ప్రభావితం చేయక పోయినప్పకీ అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలను, ఆధిపత్య పోరును బహిర్గతం చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించని రీతిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య గ్రూపుల వ్యవహారాన్ని స్వయంగా బయట పెట్టారు. గ్రూపు రాజకీయాలకు నెలవైన జిల్లా విషయంలో ఇంతకు ముందు ముఖ్యమంత్రులు జాగ్రత్తలు తీసుకునే వారు. వివాదాలున్నట్లు సమాచారం ఉంటే వారితో మంతనాలు జరిపేవారు. సర్దిచెప్పేవారు. అవసరమైతే గద్దించి దారికి తెచ్చుకునేవారు. అయితే ప్రత్యేకంగా ఎవరి ఇళ్లకు వెళ్ళేవారు కాదు. దీనితో నాయకులంతా వీలు చూసుకుని వారే ముఖ్యమంత్రులు బస చేసే అతిథి గృహాలకు వెళ్ళేవారు. గోడు వెళ్ల బోసుకునే వారు. ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేసేవారు. తమ కష్టాలను ఏకరువు పెట్టేవారు. పనిలో పనిగా మంది మార్బలాన్ని వెంటేసుకుని బల ప్రదర్శనకు దిగేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య విషయంలో ఈ సన్నివేశాలన్నీ తారుమారయ్యాయి. ముఖ్యమంత్రే స్వయంగా గ్రూపుల నాయకుల ఇళ్లకు వెళ్లారు. నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు ఆదరించి కానుకలు సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి అందరి ఇళ్లకు వెళ్లినా నాయకులు మాత్రం ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లలేదు. 26 గంటల్లో దాదాపు 18 గంటలు గ్రూపు నాయకుల ఇళ్లకు వెళ్లడంతోనే సరిపోయింది. ఇదిలావుండగా ఇదిగో వస్తారు.. అదిగి వస్తారు.. అని ఎదురు చూసిన ప్రజలకు మాత్రం ఆయన మాటమాత్రంగానైనా సంతృప్తి కలిగించలేకపోయారు.

నగర రోడ్లకు మహర్ధశ

నెల్లూరు నగరరోడ్లకు మహర్దశ పట్ట నుంది. పలు ప్రధాన రహదారులతో పాటు డివిజన్లలోని రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయనున్నారు. దాదాపు రూ. 30 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చే రోడ్లను కూ డా అభివృద్ధి పరచనున్నారు. దీంతో నగరవాసుల కష్టాలు కొంతమేరకు గట్టెక్కనున్నాయి.

జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. 2001లో మూడు లక్షలు జనాభా ఉండగా, ప్రస్తుతం ఐదు లక్షలకుపైగా పెరిగింది. అలాగే 2005 వరకు 66 చదరపుకిలోమీటర్ల వైశాల్యం ఉన్న నగరం, జనాభా పెరిగి శివారు ప్రాంతాలు ఏర్పడుతుం డడంతో 75 చ.కి.మీటర్లకు విస్తరించిం ది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్లు అభివృద్ధి చెందలేదు.

దీంతో పలు ప్రధాన రహదారులతో పాటు డి విజన్లలోని రోడ్ల అధ్వానంగా ఉన్నా యి. నేటికీ వర్షం కురిస్తే కాలు పెట్ట లేని దుస్థితి ఉంది. రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి ప్రత్యేక చొరవతో నగర రోడ్ల పరి స్థితులు మారనున్నాయి. నిన్నమొన్న టి వరకు నడిచేందుకు వీలు లేకుండా ఉంటున్న రోడ్లు సైతం సిమెంట్‌రోడ్లు గా అభివృద్ది చెందనున్నాయి. అలాగే జాతీయరహదారి లింకు రోడ్లు అభివృ ద్ధి చెందనున్నాయి.

లింకురోడ్ల అభివృద్ధికి రూ. 18.5 కోట్లు
జాతీయ రహదారి నుంచి నగరంలోకి వచ్చే లింకు రోడ్లు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 18.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. దీంతో మినీబైపాస్ నుంచి పడారుపల్లి మెయిన్‌రోడ్డు కొండాయపాళెం రైల్వే గేటు నుంచి పాతకొండాయపాళెం వనంతోపుల మీదుగా జాతీయ రహ దారి రోడ్డు-మైపాడు మెయిన్ రోడ్డు నుంచి పద్మావతినగర్ మీదుగా జాతీయ రహదారి రోడ్డు, మినీబైపాస్ కొండాయపాళెం రోడ్డు నుంచి ఆర్టీవో కార్యాలయం రోడ్డులను తారురోడ్డు లుగా అభివృద్ధిపరచనున్నారు.

జాతీ య రహదారి నుంచి చ్రిల్డన్స్ పార్కు రోడ్డు, విజయమహల్ గేటు నుంచి మూడు సినిమాహాళ్ళ మీదుగా ము త్తుకూరు బస్టాండ్ వరకు సిమెంట్ రో డ్లును ఏర్పాటు చేయనున్నారు. ఇం దుకు సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించారు.

రూ.10 కోట్లతో డివిజన్ల రోడ్లు
కార్పొరేషన్ నిధులు రూ.10 కోట్లతో నగరంలోని 50 డివిజన్లలోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పర చనున్నారు. ఇందుకు సంబంధించి కొన్ని పనులకు టెండర్లు పూర్తి కావ డంతో పలు డివిజన్‌లలో పనులు జరు గుతున్నాయి. మరికొన్ని పనులకు టెం డర్లను పిలవాల్సి ఉంది. నగర పాలక సంస్థ జనరల్ నిధులతో పైశివారు ప్రాంతాల డివిజన్‌లకు రూ.20 లక్షలు, ఇంటర్నర్ డివిజన్‌కు రూ.10 లక్షలు చొప్పున పనులు కేటాయించారు.

అయితే కొంత మంది కార్పొరేటర్లు ఒక్క డివిజన్‌కు రూ.30 నుంచి రూ. 40 లక్షలు మేర పనులను కేటాయింప చేసుకున్నారు. ఈ నిధులతో డివిజన్ లో సిమెంట్ రోడ్లతో పాటు కాలువలు, కల్వర్టులు అభివృద్ధి పరుస్తున్నారు.

రూ.రెండుకోట్లతో విస్తరణ పనులు
నగరంలోని అయ్యప్పగుడి నుంచి ఆర్టీసీ వరకు రోడ్లు భవనాల శాఖ ఆ ధ్వర్యంలో రెండు కోట్లతో రోడ్డు విస్త రణ పనులు జరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందుతా యి. మొత్తం మీద పనులన్ని పూర్తి అయితే ఏడాదిలోపు నగర రోడ్లు అధిక భాగం అభివృద్ధి చెందను న్నాయి.

Monday, May 3, 2010

ఆకట్టుకున్న నేదురుమల్లి ప్రసంగం

నగరంలోని విఆర్‌సి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యానాలకు ప్రజల నుంచి నవ్వులు వెలిసాయి. గతంలో నెల్లూరులో ఒక చిత్రకారుడు ఉండేవాడని, అద్భుతంగా బొమ్మలు గీసే వాడని నేదురుమల్లి అన్నారు. ఆయన గాంధీ బొమ్మను వేయడం చూసి తాను పొట్టిశ్రీరాములు బొమ్మను వేయగలిగానని అన్నారు. రోశయ్య అన్ని బొమ్మల కంటే రోశయ్య బొమ్మ గీయడం భలే సులువని ఆయన వ్యాఖ్యానించారు.

రోశయ్య బొమ్మ గీయడం ఎంత సులువో ఆయన నుంచి నిధులు రాబట్టడం అంత కష్టమని ఆయన అన్నారు. ఏదైనా పనిపై ఆయన వద్దకు వెళితే గడ్డం కింద చేయి ఆనించి నవ్వుతూ కనిపిస్తారని చెప్పారు. రోశయ్య మంచి మూడ్‌లో నవ్వుతూ ఉన్నారు, పని పూర్తి చేసుకోవచ్చని భావిస్తే పొరపాటు పడినట్లేనని అన్నారు. ఒక్కపైసా ఇవ్వకుండా నవ్వుతూ బయటకు పంపించే సామర్థ్యం రోశయ్యకే స్వంతమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రోశయ్యే ఆర్థిక మంత్రిగా ఉండటం వల్ల నిధులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్థిక మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా అయిపోయారని ఆయన ఛలోక్తిగా అన్నారు.

‘రోశయ్య వస్తున్నాడు గదా....నగరం ఎట్టా ఉందో చూద్దామని తెల్లవారుజామునే కారులో బయలుదేరా....ఎక్కడ చూసినా అందంగా కనిపించిందని’ నేదురుమల్లి అన్నారు. ఏదో రోశయ్య వస్తున్నారని ముస్తాబు చేశారు గాని...మేయరమ్మా ప్రతిరోజూ ఇలా ఉండేలా చూసుకుంటే బాగుంటుందని ఆనం వర్గానికి చెందిన మేయర్‌ నందిమండలం భానుశ్రీకి చురక అంటించారు. నెల్లూరు నగరం ప్రతిరోజూ ఈ విధంగా ఉండదని రోశయ్యకు పరోక్షంగా నేదురుమల్లి వివరించగలిగారు.

నేదురుమల్లి ప్రసంగిస్తుండగా మంత్రి ఆనం సమయం దాటిపోతోందని సైగ చేశారు. దీనిని గమనించిన నేదురుమల్లి సీరియస్‌గా స్పంధించారు. నేనింకా మాట్లాడాల్సింది ఉంది....నీరు కూర్చో అంటూ కాస్త కటువుగానే సమాధానం ఇచ్చారు. జిల్లాలోనే రాష్ట్రంలోనే సీనియర్‌ నేతగా ఉన్న నేదురుమల్లి తనదైన పంథాలో వ్యవహరించి ప్రత్యేకతను చాటుకున్నారు.

ముఖ్యమంత్రి పర్యటనతో పట్టణంలో కోత ఎత్తివేత

ర్రాష్ట ముఖ్యమంత్రి రోశయ్య జిల్లా పర్యటన సందర్భంగా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో శని, ఆదివారాలు విద్యుత్ కో తను ఎత్తి వేస్తూ ట్రాన్స్‌కో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వేసవి ప్రారం భం అయిన నాటి నుంచి వేళాపాళా లేకుండా విద్యుత్ కోత విధించి ప్రజల ను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ట్రా న్స్‌కో శాఖ ముఖ్యమంత్రి జిల్లాకు వస్తుండడంతో అటు ప్రజలు ఇటు ప్రతి పక్షాలు విద్యుత్ కోత పై రగడ చేస్తారన్న ఉద్దేశంతో తాత్కాలికంగా కోతక స్వస్తి పలికింది.

ప్రజలను మభ్యపెట్టేం దుకు మున్సిపాలిటీల వరకు విద్యుత్ కోతను ఎత్తి వేశారు. ఈ విషయమై ఆన్‌లైన్ వెంకటగిరి ట్రాన్స్‌కో అధికారులను ప్రశ్నించగా విద్యుత్ కోతను రెండు రోజుల పాటు మున్సిపాలిటీలో ఎత్తి వేయవలసిందిగా జిల్లా అధికారు లు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. విద్యుత్ కోత ఎత్తివేతపై ట్రాన్‌కో జిల్లా ఎస్ఈని వివరణ కోరగా డిస్‌ప్యాచ్ సెంటర్ ఆదేశాలు మేరకు ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని మున్సిపాలిటీల్లో రెండు రోజుల పాటు విద్యు త్ కోతను ఎత్తి వేయడం జరిగిందన్నా రు. సోమవారం నుండి విద్యుత్ కోతను యథావిధిగా కొనసాగించడం జరుగుతుందన్నారు.

కరుణించని ము ఖ్యమంత్రి రోశయ్య

జిల్లాలో తొలిసారిగా ము ఖ్యమంత్రి హోదాలో ఆదివారం పర్యటించిన కొణిజేటి రోశయ్య జిల్లా ప్రజలకు నిరాశనే మిగిల్చారు. ప్రధాన సమస్యలు ప్రస్తావనే లేకపోగా, ఎలాంటి వరాలజల్లులు కురిపించలేదు. అధికారిక కార్యక్రమం ఒకటే అయినప్ప టికీ, పలు ప్రైవేటు కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపారు. పార్టీలోని విభేదాలపై నోరుమెదపని ఆయన, నేతలందరి ఇళ్లకు పరుగులు పెట్టి అందరివాడననిపించుకున్నారు. సీఎం పర్యటన ఆద్యంతం పోలీసులు అత్యుత్సాహం చూ పారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

హామీలివ్వని సీఎం
ఆదివారం ఉదయం సింహపురి రైలులో నెల్లూరుకు చేరుకున్న సీఎం రోశయ్యకు అధికారులు, అనధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన పినాకిని అతి«థిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. మంత్రులతో నేదురుమల్లి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం 11 గంటలకు వీ ఆర్ కళాశాల మైదానంలో జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. త దుపరి మంత్రి ఆనం రామనారా యణరెడ్డి ఇంట్లో భోజనం చేసి తిరిగి అతిథిగృహానికి చేరుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు విశ్రాంతి తీసుకున్నారు.

నేతల ఇళ్లకు పరుగులు
సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పత్తి రవీంద్రబాబు, ఇండీవర్ మోటార్స్ అధినేత రాజ్‌కుమార్, కేవీ చలమ య్య తదితరుల ఇళ్లలో జరిగిన తేనేటి విందుకు హాజరయ్యారు. రాత్రి 8 గంటలకు ఆర్యవైశ్య సంఘం సన్మాన సభకు రోశయ్య హాజర య్యారు.

ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం జిల్లాకు వరాలేవి ప్రకటించలేదు. భూ పంపిణీ కార్య క్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఎన్నో సమస్యలు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అయినా వీటిపై స్పందించకపోగా, పాత పథకాల అమలునే పదే పదే ప్రస్తావించారు. నెల్లూరు అవసరాలన్నీ తెలుసంటూ ప్రజాప్రతినిధులు కోరిక మేరకు సమస్యలు తీరుస్తానని ఇచ్చారు.

కృష్ణపట్నం, ఎస్ఈజెడ్‌లు, ఆపాచీల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పి స్తామని ప్రకటించినా ఇవి జిల్లాలో అమలవుతున్న పథకాలే. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ఇతరత్రా పథ కాలపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు. భూ పంపిణీ సందర్భంగా సీఎం ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపో యింది. సాయంత్రం జరిగిన సన్మాన సభలో కాస్త భిన్నరీతిలో మాట్లాడి ఆర్యవైశ్యులను ఆకట్టుకోగలిగారు.

సీఎం అయినంత మాత్రాన సంఘ సమస్యలు తీర్చలేనని, కాంగ్రెస్ పార్టీ మీ సమస్యలను తీరుస్తుందంటూ తేల్చి చెప్పారు. ఎక్కడా కూడా హా మీలు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. ప్రజాపథం, ఎమ్మెల్యేల పనితీరు, సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష జరుపుతారని గతంలో మంత్రి ఆనం ప్రకటించారు. కాని ఈ ఊసే లేకుండాపోయింది.

విభేదాలపై మౌనం
జిల్లా కాంగ్రెస్ నాయకులు గ్రూపులతో సతమతమవుతున్నారు. ఈ వర్గపోరును నియంత్రించాల్సిన సీఎం వారి ఇళ్లకు వెళ్లి తేనేటి సేవిం చడం మరింత వివాదానికి ఆజ్యం పోసింది. నేదురుమల్లి ఇంటికి వెళ్లిన సీఎంతోపాటు మంత్రి ఆనం ఒక్కరే హాజరు కాగా, మధ్యాహ్నం ఆనం ఇంట జరిగిన విందుకు ఆనం వ్యతిరేక వర్గీయులు ఒక్కరూ కూడా హాజరు కాలేదు.

అదేవిధంగా ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి ఇంటికి రోశయ్య వెళ్లగా, ఆనం వర్గీయులు వెళ్లలేదు. ఇలా ఒకరి ఇళ్లకు వెళ్లిన సీఎం మరో ఇంటికి వెళ్లేలోగా నా యకులు దూరందూరంగానే ఉం టూ వచ్చారు. నేదురుమల్లితో మాత్రం సీఎం వర్గపోరుపై ప్రస్తావిం చినట్లు సమాచారం. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నేదురుమల్లిని కోరినట్లు తెలిసింది. భూ పంపిణీ సభా వేదికపై కొందరు నేతలను దింపే ప్రయత్నం జరిగిం ది.

చివరకు పోలీసుల ద్వారా వారిని కిందకు దింపి కక్ష సాధించుకున్నట్లు ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఉదయం రోశయ్య కేంద్ర మంత్రి పనబాకలక్ష్మి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుని, తదుపరి విశాఖకు వెళ్లనన్నారు. నాయకులం దరి ఇళ్లకు వెళ్లిన సీఎం వారిని ఒక తాటిపై తీసుకురావడంలో విఫలమ య్యారనే విమర్శలు పార్టీలో విని పిస్తున్నాయి.

ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటన్నది అర్థంకావడంలేదని పరిశీలకులు అంటున్నారు. భద్రత పేరుతో పో లీసులు ముఖ్యనేతలనే సీఎం వద్దకు పంపారు. దీంతో ద్వితీయశ్రేణి నాయకులు సీఎంకు తమగోడును వినిపించే వీలులేకుండా పోయింది. పోలీసుల అత్యుత్సాహం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. బందో బస్తు పేరుతో మీడియోను కూడా పోలీసులు ఇబ్బందులు పెట్టారు. ఏది ఏమైనా రోశయ్య జిల్లా పర్యటన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నిరాశను మిగిల్చింది.

సీఎం సభలో హైడ్రామా

సీఎం సభలో రాజకీయ హైడ్రామా న డిచింది. కొంతమంది నేతలకు అవమా నం జరిగింది. ఎత్తులు,పైఎత్తులతో ఆధిపత్య పోరుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో మరోసారి పా ర్టీలోని అంతర్గత విభేదాలు బహిర్గత మయ్యాయి.

కొనసాగిన ఆధిపత్యపోరు
ఆనం సోదరుల ఆధ్వర్యంలో ఆది వారం వీఆర్ కళాశాల మైదానంలో రోశయ్య సభ జరిగింది. ఈ సభలో ఆద్యంతం రాజకీయ హైడ్రామా నడి చింది. కాంగ్రెస్‌లో ప్రధాన వర్గాలుగా ఉన్న ఆనం, ఆదాల వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది. ప్రత్యర్థి వర్గాన్ని దెబ్బతీయం ద్వారా సభలో తమ హవా కొనసాగించాలని ఆనం సోదరులు ప్రయత్నించి విఫలమ య్యారు.

సీఎం సభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్, మేయర్, ఇతర నేతలు హాజరయ్యారు. ఆనం ప్రత్యర్థి వర్గమైన అనిల్‌కుమార్ యాదవ్ విషయంలో ఇరువర్గాలు పట్టుబట్టాయి. అనిల్‌ను వేదికపైకి ఆహ్వానించకూడదని ఆనం వర్గం చేసిన ప్రయత్నాలను ఆదాల వర్గం తిప్పికొట్టింది. ఈ విషయంపై ముందురోజు నుంచే చర్చ జరిగింది.

ఆనం సోదరులు ఇతర నియోజక వర్గాలలో ఓడిపోయిన అభ్యర్థులను సభకు ఆహ్వానించి, అనిల్‌ను ఆహ్వా నించకపోతే సభలో గొడవలు, రచ్చలు జరుగుతాయని ఇంటిలిజెన్సీ వర్గాలు హెచ్చరించాయ. దీంతో సభ ప్రశాం తంగా జరిగేందుకు అటు కలెక్టర్, ఇటు ఎస్పీ ఇరు వర్గాల నేతలతో చర్చలు జరిపారు. అయితే రెండు వర్గాలు పట్టువీడక పోవడంతో సభలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తం అయింది.

వేదికపైకి అనిల్
సీఎం వేదికపైకి రాకముందే జడ్పీ చైర్మన్ కాకాణి, ఆదాలతో కలిసి అనిల్‌కుమార్‌యాదవ్ వేదికపైకి వచ్చా రు. అప్పటికే ఆనం వర్గీయులైన దేవ కుమార్‌రెడ్డి, హరిబాబుయాదవ్ వేదిక పై కూర్చొని ఉన్నారు. దీంతో పోలీసు లు కలుగచేసుకుని వేదికపైన ఉండా ల్సిన వారు మాత్రమే ఉండాలని, మిగి లిన వారంతా దిగిపోవాలని సూచిం చారు.

దీంతో దేవకుమార్‌రెడ్డి, హరి బాబుయాదవ్ అవమానకర రీతిలో వేదికపై నుంచి దిగిపోయారు. అనం తరం అనిల్‌కుమార్ యాదవ్‌ను వేదిక నుంచి దిగాలని పోలీసు అధికారి సూచించారు. దీనికి కాకాణి, ఆదాల అభ్యంతరం తెలిపారు. కలెక్టర్, ఎస్పీ లకు తాము ముందే చెప్పామని వారి అనుమతులు ఉన్నాయని తెలిపారు.

ఇందుకు పోలీసు అధికారి సమ్మతించక పోవడంతో జేసీ కలుగచేసుకుని అనిల్‌కు అనుమతి ఉందని తెలిపారు. దీంతో ఆ అధికారి వెళ్లిపోయారు. అలాగే అనిల్ వేదికపైన ఉన్నందున తమకు అవకాశం కల్పించాలని కాం గ్రెస్ కార్పొరేటర్లు సందానిబాషా, మునాఫ్, మరికొంతమంది కొద్దిసేపు గొడవ చేశారు. వారిని పోలీసులు పక్కకు నెట్టివేశారు.

కార్పొరేటర్లకు నోచాన్స్
సీఎం సభలో కార్పొరేటర్లకు అవ కాశం కలగలేదు. గతంలో సీఎం సభ లలో కార్పొరేటర్లు వేదికపైకి వెళ్లేవారు. అయితే ఈ దఫా రెండు వర్గాల మధ్య విభేదాలు ఉండడం ఆనం వర్గం కార్పొరేటర్లను సభ పైకి పిలిస్తే తమ వర్గం నుంచి కనీసం ఇద్దర్ని పిలవాలని రాజీవ్‌భవన్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో కార్పొరేటర్లందర్ని వేదికపైకి ఎక్కనివ్వలేదు. సిటీ కాంగ్రెస్ అధ్య క్షుడి హోదాలో చాట్ల నరసింహారావు మాత్రమే వేదికను అలరించారు.

మంత్రి ఇంటికి అసమ్మతి నేతలు
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన నివాసంలో ముఖ్యమంత్రి రోశ య్యకు ఆదివారం మధ్యాహ్నం భోజ నం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్ర మానికి ఆనం ప్రత్యర్థి వర్గం దూరంగా ఉండిపోయింది. ముఖ్యమంత్రితో కలిసి అందరూ వస్తారని భావించి నప్పటికీ, ప్రత్యర్థి వర్గం వ్యూహాత్మ కంగా ఆ కార్యక్రమాన్ని బహిష్కరిం చింది. నేదురుమల్లి జనార్దన్‌రెడి, జడ్పీ చైర్మన్ కాకాణి, ఎమ్మెల్యేలు ఆదాల, మేకపాటి, శేఖర్‌రెడ్డిలతోపాటు ప్రసన్న కుమార్‌రెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజ రయ్యారు. దీంతో సీఎం భోజన కార్యక్రమానికి కేవలం ఆనం వర్గం మాత్రమే హాజరైంది.

Sunday, May 2, 2010

వర్గపోరు సమసేనా..?

జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న వర్గపోరు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య చుట్టూ పరిభ్రమిస్తోంది. బహిరంగంగా నాయకులు పోటీపడి నగరంలో వేర్వేరుగా స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. తిరుపతి, పొదలకూరు రోడ్ల ఇరువైపుల ఫ్లెక్సీ బ్యానర్లతో నిండిపోయాయి. రెండు రోజులు నెల్లూరులో గడుపు తున్న సీఎం ఒకేఒక అధికారిక కార్యక్రమంలో మాత్రమే పాల్గొంటున్నారు. మి గిలిన కార్యక్రమాలన్నీ ప్రైవేటువే. పలువురు నేతల ఇళ్ళల్లో అడుగుపెట్టే సీఎం ఉదయం ఒకరింట అల్పాహారం, మధ్యాహ్నం మరొకరి ఇంట భో జనం, ఇలా రెండు రోజులు నాయకులతో గడపను న్నారు.

ఎవరికి వారుగా...
జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పనబాకలక్ష్మి ఇప్పటికే పలుసార్లు సోనియాని కలిసి నేదురు మల్లిపై ఫిర్యాదు చేశారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో విభేదించిన జడ్పీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి వేరుగా ఉంటున్నారు. ఇలా జిల్లా అగ్రనేతలు ఎవరికి వారుగా ఉండడంతో రోజురో జుకు కాంగ్రెస్ వర్గపోరు శృతిమించుతోంది.

మరో కొన్నిగంటల్లో సీఎం జిల్లాలో అడుగు పెట్టనున్న నేపథ్యంలో కోవూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మంత్రి ఆనంపై విమర్శలు సంధించా రు. నేదురుమల్లిని కలిసి మంత్రి ఆనం వ్యవహారం శైలివల్ల పార్టీ నష్టపో తుందని ఆరోపించారు. కాస్తా ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని పరో క్షంగా ఆనం మంత్రి పదవిని తప్పిస్తా మనే సంకేతాన్ని ఇచ్చారు. కార్యకర్తల కు భరోసా ఇస్తూ కాంగ్రెస్ కార్యక ర్తలకు అండగా ఉంటారని ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్ సీఎంగా ఉండగా ఆనం మాట బాగా చెల్లుబాటు ఆయ్యే ది. రోశయ్య సీఎం కావడంతో నేదురు మల్లికి ప్రాధాన్యం పెరిగింది.

జిల్లాలో ముఖ్య అధికారుల నియామకంలో నేదురుమల్లి సూ చనలు పాటిస్తు న్నారనే ప్రచారం ఉంది. తొలుత నే దురుమల్లి, ఆనం ఇళ్ళకు మాత్రమే సీఎం వెళ్తారనే సమా చారం అందింది. ఇది జీర్ణించుకోలేని కొందరు నాయకులు తమ ఇళ్ళకు రావాల్సిందేనని సీఎంపై ఒత్తిళ్ళు తెచ్చినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం నేదురుమల్లి విలేఖ రులతో మాట్లాడుతూ నాయకులు ఇళ్ళకు సీఎం వెళ్ళడంపై ప్రస్తావిస్తూ కొంత వ్యంగ్యంగా మాట్లాడారు.

ఈ నే పథ్యంలో జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న రోశయ్య పార్టీకి కాయకల్ప చికిత్స చేపట్టకపోతే రానున్న స్థానిక సంస్ధల ఎన్నికల్లో సష్టపోవలసి వస్తుందని కార్యకర్తలు మదన పడుతున్నారు. రెండు రోజులుగా నెల్లూరు ఉంటున్న ఆయన పార్టీ స్ధితిగతులపై నాయకుల తో చర్చించి అందరిని ఒక తాటిపై నడపాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలు, అభిమానులు అంటున్నా రు. మరి రోశయ్య ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే.

నేడు నగరానికి సీఎం రాక

రా ష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య ఆదివారం నెల్లూరుకు రాను న్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా జిల్లాకు వస్తున్నారు. ఆయనతోపాటు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్‌చా ర్జిమంత్రి మోపిదేవి వెంకటరమణ, జిల్లామంత్రి ఆనం రామనారాయ ణరెడ్డి పర్యటిస్తారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ నుంచి సింహ పురి ఎక్స్‌ప్రెస్‌లో బయ లుదేరి ఆ దివారం ఉదయం 7.30 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారు. అనంత రం పినాకిని అతి థిగృహానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసు కుంటారు.

అనంతరం పొదలకూ రురోడ్డులోని నేదురుమల్లి జనార్ద న్‌రెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుంటారు. అక్కడే అధికారు లతో మాట్లాడి వీఆర్ కళాశాలలో జరిగే సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఐదో విడత భూ పంపిణీ, మహిళా సంఘా లకు రుణాలు అందిస్తారు. అక్కడ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ భోజన కార్యక్రమం ముగించుకుని తిరిగి పినాకిని అతిథిగృహానికి చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు.

సాయంత్రం 4 గంటలకు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఇం టికి, ఆ తరువాత సరయూ అధినేత రాజ్‌కుమార్, మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఆర్యవైశ్యప్ర ముఖుడు కేవీ చలమయ్య తదితరుల ఇళ్లకు వెళ్లి కొద్ది సేపు గడుపుతారు.

సాయంత్రం ఆరు గంటలకు వేమాల శెట్టి బావి సత్రం స్థలంలో జరిగే ఆర్యవైశ్యులు, వాణిజ్య వర్గాల సన్మాన సభలో పా ల్గొంటారు. కార్యక్రమానంతరం అతిథిగృహానికి వెళ్లి రాత్రి బస చేస్తా రు. సోమవారం ఉదయం 8 గంటల కు కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటికి వెళ్లి అల్పాహారం స్వీకరిం చనున్నారు. అనంతరం చెన్నయ్ వెళ్లి అక్కడి నుంచి విశాఖపట్నం బయలుదేరతా రు.

Saturday, May 1, 2010

సిఎం పర్యటన పూర్తి స్థాయిలో ఖరారు

ముఖ్యమంత్రి రోశయ్య పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేసారు. ఆదివారం ఉదయం సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో జిల్లాకు రోశయ్య చేరుకుంటారు. అక్కడి నుండి పినాకినీ అతిథి గృహానికి చేరుకుంటారు. జిల్లా నాయకులతో చర్చించి సంతపేటలోని సిఎం సన్నిహితులు చలమయ్య నివాసంలో అల్పాహార విందుకు హాజరవుతారు. అక్కడ నుండి విఆర్‌సి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. మధ్యాహ్నం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నివాసంలో విందు చేస్తారు. అక్కడ నుండి పినాకినీ అతిథి గృహంకు చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం 5 గంటలకు వేమాలశెట్టిబావిలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి నేదురుమల్లి ఇంట్లో విందు చేస్తారు. అక్కడ నుండి పినాకినీ అతిథి గృహంకు చేరుకొని రాత్రికి బస చేస్తారు. సోమవారం ఉదయం టిఫిన్‌కు పనబాక ఇంటికి చేరుకుంటారు అనంతరం చెన్నైకి బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంగా 1200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ ఈ దామోదర్ పేర్కొన్నారు.

పార్టీలోని గ్రూపులను బుజ్జగించడానికే సిఎం పర్యటన : సోమిరెడ్డి ధ్వజం

ముఖ్యమంత్రి రోశయ్య జిల్లా పర్యటన కేవలం అధికార పార్టీలోని గ్రూపులను సముదాయించడానికి, బుజ్జగించటానికి పరిమితం కావటం విచారకరమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోశయ్య జిల్లాలో 38 గంటల పర్యటనలో భాగంగా ప్రజలకు కేవలం గంటన్నర సమయం కేటాయించటం దారుణమని, అది కూడా జిల్లాలోని మూడు గ్రూపుల వారి ఇళ్లలో గడిపేందుకు సిద్ధమయ్యారన్నారు. సెజ్‌ల పేరుతో జిల్లాలో భారీగా దోపిడీ జరుగుతోందన్నారు. నెల్లూరు మసూరాకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. వీటన్నింటిపై సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో జరుగుతున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని సమీక్ష నిర్వహించక పోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాథి హామీ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని, నెల్లూరు జిల్లాలో ప్రజల సమస్యలు ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. రోశయ్య మధ్యాహ్నం ఆనం ఇంట్లో భోజనం, రాత్రికి నేదురుమల్లి ఇంట్లో బస, ఉదయం టిఫిన్‌కు పనబాక వర్గానికే సమయాన్ని సరిపెడుతున్నారని అన్నారు. రోశయ్య విందుల కోసం నెల్లూరు రానవసరం లేదని, హైదరాబాద్‌లోనే ఉండవచ్చన్నారు. రాజీవ్ రహదారి, అద్దంకి నార్కెడ్‌పల్లి జాతీయ రహదారులకు రూ. 925 కోట్లు గ్రాంట్లు ఇచ్చారని, అయినా 30 ఏళ్ల వరకు టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

గ్రూపుల గోల మధ్య రేపు నెల్లూరులో సిఎం పర్యటన

వర్గపోరుకు మారుపేరైన నెల్లూరు కాంగ్రెస్‌లోని గ్రూపుల గోల మధ్య ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఏర్పాట్ల దగ్గర నుంచి ఆహ్వానపత్రాల వరకు అన్నిచోట్లా నేతల ఆధిపత్య పోరు కనపడుతోంది. జిల్లాలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీనికి ఆనం వ్యతిరేక వర్గం కూడా తయారయింది. ఈ వర్గానికి నేదురుమల్లి నుండి పరోక్షంగా మద్దతు లభిస్తోంది. ఏ అవకాశం దొరికినా వర్గాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు సార్లు వాయిదా పడిన తరువాత ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్య నగరానికి వస్తున్నారు. కేవలం నగరానికే పరిమితమైన ఆయన పర్యటనపై గ్రూపుల నీడలు కమ్ముకున్నాయి. మొదటి నుండి వ్యతిరేక వర్గానికి చెందిన ప్రజాప్రతినిథుల ప్రమేయం లేకుండా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన పర్యటించే ప్రాంతాలను, కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన వేదికలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. చివరి రోజు వరకు ఈ విషయాన్ని పట్టించుకోని ఆనం వ్యతిరేక వర్గం శుక్రవారం రంగంలోకి దిగింది. సిఎం పర్యటన ప్రాంతాలను ఉదయం ఆనం వర్గం పరిశీలించి వెళ్లగా సాయంత్రానికి వ్యతిరేక వర్గంలోని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసి పరిశీలించారు. అదే ప్రాంతంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా నగరంలోని ఆర్యవైశ్య సంఘం ముఖ్యమంత్రికి అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రితోపాటు ఆనం సోదరుల ఫోటోలతో ఆహ్వాన పత్రం ముద్రణకు సిద్ధమయింది. ఇది తెలిసిన ఆనం వ్యతిరేక వర్గం ఆహ్వాన పత్రంలో కాంగ్రెస్‌లోని రెండు గ్రూపులకు చెందిన ప్రజాప్రతినిథుల ఫోటోలను ముద్రించాలని డిమాండ్ చేసింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిథులు ముఖ్యమంత్రి రోశయ్య, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలు తప్ప మిగిలిన వారి ఫోటోలన్నీ ఎగరగొట్టేసి నగరంలో రెండు వ్యాపార సంస్థల సౌజన్యంతో ఆహ్వాన పత్రాలు ముద్రించారు. ఈ వ్యవహారం మొత్తం సిఎం పర్యటనను విమర్శలకు గురి చేసింది. గ్రూపుల వత్తిడితో ఆర్యవైశ్య సంఘం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో నగర ప్రథమ పౌరురాలు, స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫోటోలు లేకుండా చేయడం కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.