నేడు నెల్లూరు

Friday, May 7, 2010

వివేకా...అవివేక పనులు మానుకో

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అవివేక పనులను, అబద్ధాలకోరు తనాన్ని విడనాడాలని 12వ డివిజన్‌ తెదేపా. యువనాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కోరారు. గురువారం ఉదయం 11 గంటలకు నగరంలోని పద్మావతీనగర్‌ సాయిబాబాగుడి సమీపంలో జరిగినవిలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

12వ డివిజన్‌లో తెలుగుదేశం కౌన్సిల్‌లో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నఅనూరాధ నిధులను కేటాయించిందని, ఆమె హయాంలోనే 12వ డివిజన్‌లో అభివృద్ధి పనులు చాలా వరకు జరిగాయన్నారు. 2004లో కిన్నెర అపార్ట్‌మెంట్‌ రోడ్డు, ఎసి.నగర్‌ పార్క్‌ అభివృద్ధి పనులు, వేపదొరువు రోడ్డు పనులకు టెండర్లు పిలిచేందుకు రూ.10 కోట్లకు నిధులు మంజూరు చేయాలని ఆర్‌జెడికి లెటర్‌ పెడుతూ టెండర్లు పిలవడం జరిగిందన్నారు. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆర్‌జెడికి రూ.10 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించే విషయమై రద్దు చేయించేందుకు లెటర్‌ పెట్టారని వివేకాను దుయ్యబట్టారు. ఇందుకు సంబంధించి విలేకరులకు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఆర్‌జెడికి లెటర్‌ పెట్టిన సాక్ష్యాధారాలను పత్రికా విలేకరులకు ఇవ్వడం జరిగింది.

ఈ నేపథ్యంలో బుధవారం నాడు 12వ డివిజన్‌లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని, కనీసం వార్డు ఎమ్మెల్యే కోటంరెడ్డి సంధ్యను పిలవకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తరహా పనులను వివేకా మానుకోవాలని హితవు పలికారు. తాను ప్రత్యక్ష రాజకీయాల జోలికి వెళ్లడం లేదని, వె ళ్తే ఏవిధంగా ఉంటుందో ఎమ్మెల్యేకి బాగా తెలుసన్నారు. ఆనం కుటుంబానికి రాజకీయాలు నేర్పించిందే బాలాజీనగర్‌, ఎసి.నగరేనని, ఆ ఏరియాల అభివృద్ధిని అడ్డుకోవడం ఆ కుటుంబానికి చెందిన రూరల్‌ ఎమ్మెల్యేకు ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ ప్రాంతాల్లో ఏ పార్టీ హయాంలో అభివృద్ధి పనులు జరిగాయో స్థానిక ప్రజల సమక్షంలో స్థానికంగా ఉన్న సాయిబాబా గుడి వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్‌ చేశారు. అదే ఛాలెంజ్‌కు రూరల్‌ ఎమ్మెల్యే సిద్దమా అని ప్రశ్నించారు.

ఎసి.నగర్‌ ప్రాంతంలో పంటకాలువ పూడిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే తమ సొంత నిధులతో లక్ష రూపాయలు ఖర్చు చేసి పూడిక తీయించన ఘనత తమదేనన్నారు. నగరానికి మంచినీటిని అందించేందుకు సమ్మర్‌ వాటర్‌ స్టోరేజ్‌ని నిర్మించేందుకు రూ.102 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇవి చాలక మరో రూ.30 కోట్లను మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. ఈ సమ్మర్‌ వాటర్‌ స్టోరేజ్‌ మొదలైనప్పటికీ నగరంలోని 50 డివిజన్లకు నీరు అందదని చెప్పారు. కేవలం 30 డివిజన్ల వరకే ఈ స్టోరేజ్‌ వాటర్‌ను అందించవచ్చునని, మిగతా 20 డివిజన్ల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. 50 డివిజన్లకు మంచినీటిని అందించేంతవరకు తమ పోరాటాలు ఆగవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

No comments: