నేడు నెల్లూరు

Saturday, May 1, 2010

పార్టీలోని గ్రూపులను బుజ్జగించడానికే సిఎం పర్యటన : సోమిరెడ్డి ధ్వజం

ముఖ్యమంత్రి రోశయ్య జిల్లా పర్యటన కేవలం అధికార పార్టీలోని గ్రూపులను సముదాయించడానికి, బుజ్జగించటానికి పరిమితం కావటం విచారకరమని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రోశయ్య జిల్లాలో 38 గంటల పర్యటనలో భాగంగా ప్రజలకు కేవలం గంటన్నర సమయం కేటాయించటం దారుణమని, అది కూడా జిల్లాలోని మూడు గ్రూపుల వారి ఇళ్లలో గడిపేందుకు సిద్ధమయ్యారన్నారు. సెజ్‌ల పేరుతో జిల్లాలో భారీగా దోపిడీ జరుగుతోందన్నారు. నెల్లూరు మసూరాకు గిట్టుబాటు ధర లభించలేదన్నారు. వీటన్నింటిపై సమీక్ష నిర్వహించేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదా అని ఆయన ప్రశ్నించారు. జిల్లాలో జరుగుతున్న అవినీతి ఎక్కడ బయటపడుతుందోనని సమీక్ష నిర్వహించక పోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉపాథి హామీ పథకంలో భారీ కుంభకోణం జరిగిందని, నెల్లూరు జిల్లాలో ప్రజల సమస్యలు ఎవరూ పట్టించుకోవటం లేదన్నారు. రోశయ్య మధ్యాహ్నం ఆనం ఇంట్లో భోజనం, రాత్రికి నేదురుమల్లి ఇంట్లో బస, ఉదయం టిఫిన్‌కు పనబాక వర్గానికే సమయాన్ని సరిపెడుతున్నారని అన్నారు. రోశయ్య విందుల కోసం నెల్లూరు రానవసరం లేదని, హైదరాబాద్‌లోనే ఉండవచ్చన్నారు. రాజీవ్ రహదారి, అద్దంకి నార్కెడ్‌పల్లి జాతీయ రహదారులకు రూ. 925 కోట్లు గ్రాంట్లు ఇచ్చారని, అయినా 30 ఏళ్ల వరకు టోల్‌ఫీజు వసూలు చేస్తున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు.

No comments: