నేడు నెల్లూరు

Friday, May 7, 2010

ఇది నెల్లూరు కథ

విక్రమ సింహపురమనే పేరుతో నెల్లూరును క్రీస్తు శకం 575-600 మధ్యకాలంలో అవనిసింహ బిరుదు పొందిన సింహవిష్ణువు నెలకొల్పాడని చరిత్రకారులు పేర్కొన్నారు. జిల్లాలో లభించిన శాసనాల ఆధారంగా పెన్నానదికి తీరాన ఉండే నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు ప్రాంతాన్ని 'ముండరాష్ట్రం'గా పేర్కొన్నారు. అనంతరం నెల్లూరు, కోవూరు ప్రాంతాలను మాక్పమే ముండ రాష్ట్రమనీ, ఆత్మకూరు ప్రాంతాన్ని 'మేల్ముండ' రాష్ట్రమనీ పిలిచినట్లు పల్లవుల శాసనాలు చెబుతున్నాయి.

కోవూరు, విడవలూరు, మోడేగుం ట, వేగూరు, గండవరం, కొడవలూరు, దామరమ డుగు, ఉలవపాళ్ళ, కొండమీది కోడూరు, రేవూరు, గొల్లకందుకూరు, కనుపూరు గ్రామాలు ముండ రాష్ట్రంలో భాగాలని ఆ శాసనాల ద్వారా తెలు స్తోంది. ముండులనే జాతి నివసించినందు వల్లే ముండరాష్ట్రమనే పేరు వచ్చినట్లుగా ప్రముఖ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖరశర్మ అభిప్రాయపడ్డారు.

నెల్లూరు తీరుతెన్నులు
నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో 12, 13, 14, 15, 16 శతాబ్దాల కాలంనాటి శాసనా లు ఉన్నాయి. ఈ శాసనాల నుంచి నాటి నెల్లూరు తీరుతెన్నులను కొంతమేర అర్థంచేసుకోవచ్చు. నాడు నెల్లూరు చెరువును ఆనుకొని దర్గామిట్ట, మూలాపేట, రంగనాయకులపేటలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తోంది. పెద్ద మసీదు, కాపువీథిలో, చిన్నబజారులో, దర్గామిట్టలో, ఇరుగోళమ్మ ఆల యంలో కలెక్టర్ కచేరిలో కొన్ని శాసనాలు లభిం చాయి. రంగనాథస్వామి ఆలయంలో చోళులు, వారి సామంతులు తెలుగు చోడులనాటి తమిళ శాసనాలు 25 దాకా ఉన్నాయి.

వీటిలో సగం మూడవ కులోత్తుంగుడి కాలం (1178-1226 ) నాటివిగా చెబుతారు. ఈ శాసనాల్లో అంతా నెల్లూ రు 'జయగొండ చోళ మండలం లోని చేడికుల మాణిక్కవలనాటి యందలి పడై నాటి విక్రమ సింహపురమను నెల్లూరు' అని పేర్కొన్నారు. నేటి రంగనాయకుల పేటను 'తిరుప్పాడ్‌కడల్' (పాలకడలి) అని ఆలయాన్ని 'చిత్రమేళివిణ్ణగర్' అని, దేవుడ్ని 'పళ్లికొండ పెరుమాళ్' అని శాసనాల్లో పేర్కొన్నారు. హరిహర రాయల (రెండవ) నాటి (1400-01 ) ఒక తమిళ శాసనం లో ఈ దేవుడు 'శయనరాయన పెరుమాళ్ళు' అని చెప్పారు.

'సుందరపాండ్యశంది' అనే రాజు పేరిట ఓ మండపం కట్టి, అక్కడి నిత్యోత్సవాలకు కోవూరు మండల పరిథిలోని మోడేగుంట గ్రామంలో కొంతభూమిని దానం చేసినట్టు ఉంది. క్రీ.శ. 1400 నాటి ఊరికి, ఆలయానికి మధ్య పెన్నానది పారుతుండేది. నాటి జక్కనకవి తనవిక్రమార్క చరిత్ర, ఏడవ ఆశ్వాసంలో నెల్లూరు, పెన్నను రెండు పద్యాల్లో వర్ణిస్తూ పినాకిని 'పట్టాణాంతర సీమ'లో ఉందని చెప్పాడు. అందుకే 'పెన్నాదాటితే పెరుమాళ్ళ సేవ' అనే నానుడి ఏర్పడింది.

No comments: