నేడు నెల్లూరు

Tuesday, May 4, 2010

నేతల ఇళ్లకు వెళ్లేందుకే రోశయ్య ఆసక్తి

జిల్లాలో పర్యటించేందుకు రోశయ్య అంగీకరించిన మరుక్షణం నుంచి పలు అంశాలు చర్చనీయంగా మారాయి. ఒకపక్క ప్రజా సమస్యలు, మరోపక్క పార్టీలో వర్గ పోరు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. పరిపాలన రంగంలో అపార విశేషం గడించిన రోశయ్య జిల్లాలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి సహకరిస్తారని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశించారు. మంచినీటి ఎద్దడి, ధాన్యం అమ్మకాలలో ఇబ్బందులు, సాగునీటి సమస్య, పెన్నా డెల్టా ఆధునీకరణలో సమస్యలు, సెజ్‌లలో కానరాని పరిశ్రమలు, హామీగానే నిలిచిపోయిన ఉద్యోగ అవకాశాలు, నత్తనడకన కొనసాగుతున్న కిసాన్‌సెజ్‌, విమానాశ్రయ నిర్మాణం, సమగ్ర సోమశిల, ఉదయగిరి ప్రాంతానికి సాగు, తాగునీరు తదితర సమస్యలపై రోశయ్య ఏమాత్రం దృష్టి సారించలేదు.

బహిరంగ సభలో రోశయ్యకు ముందు ప్రసంగించిన నేతలు కొన్ని ప్రధాన సమస్యలు ప్రస్తావించారు. కనీసం వాటి ని కూడా ఆయన పట్టించుకోలేదు. మరోపక్క ఉపాధి హామీ పథకంలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ఇందిరమ్మ గృహాల్లో జరిగిన అవినీతి వల్ల అర్హులకు అన్యాయం జరిగింది. సంక్షేమ పథకాలు పడకేసాయి. నిధులు మంజూరు కాని కారణంగా అభివృద్ధి పనులు మూలన పడ్డాయి. సాగునీటిని వదిలినప్పటికీ కాలువల్లో పూడిక తీసే పనులు చేయలేదు. దీనిపై రైతులు కొందరు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. దీనిపై ఆయన అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. అధికారుల పనితీరుపై సమీక్ష చేయలేదు. ఒక అరగంట సేపు అధికారులతో మాట్లాడి చక్కగా చేసుకోండని చెప్పి మొక్కుబడిగా సమావేశాని ముగించారు. ఈ సమావేశానికి మీడియాను ఆహ్వానించలేదు.

ఇక జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ మూడు వర్గాలు, ఆరు విభేదాలుగా విరాజిల్లుతోంది. ఒకరిపై మరొకరు బురద జల్లుకుంటూ ఉంటే ప్రతిపక్షాలు సైతం చేష్టలుడిగి నిలిచిపోవలసిన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌లో వర్గ పోరు ముందు ప్రతిపక్షాలు కనిపించకుండా పోయాయి. మాజీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి కార్పొరేటర్ల వరకూ ఘర్షణలు కొనసాగుతునే ఉన్నాయి. ప్రధానంగా నేదురుమల్లి, ఆనం, పనబాక వర్గాల మధ్య వర్గపోరు జోరుగా సాగుతోంది.

ఈ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఉంది. రోశయ్య బహిరంగ సభలో వేదికపై ఉన్న ఆనం వ్యతిరేక వర్గానికి చెందిన అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు దింపే ప్రయత్నం చేస్తే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలు జోక్యం చేసుకున్నారు. వేదికపైనే జనార్థన్‌రెడ్డి ఆనం వర్గాన్ని, మేయర్‌ను విమర్శించడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో రాజకీయాల గురించి రోశయ్య వద్ద సమాచారం ఉంది. వారి ఇళ్లకు వెళ్లే సమయంలో ఈ విభేదాల గురించి మరింత స్పష్టంగా ముఖ్యమంత్రికి అవగాహన కలిగి ఉంటుంది. కనీసం ఈ పర్యటనలో భాగంగా వర్గనేతలందరినీ సమైక్య పరిచి ఐక్యంగా ఉండాలని సూచించి ఉంటే సమంజసంగా ఉండేది. పిలిచిన వారందరి ఇళ్లకు వెళ్లడంతో ఆయా వర్గ నేతలు మరింత బలపడి వర్గ రాజకీయాలను కొనసాగించే అవకాశం కలిగింది. దీనిని పరిశీలిస్తే పరోక్షంగా రోశయ్య పర్యటన వర్గాలను ప్రోత్సహించేదిగా కనిపించింది.

ప్రజాపథం కొనసాగుతున్న తరుణంలో జిల్లాకు వచ్చిన రోశయ్య సమీపంలోని ఒక గ్రామానికి వెళ్లి స్వయంగా గ్రామస్తులతో కలిసి ఉంటే కొత్త సమస్యలు దృష్టికి వచ్చేవి. సామాన్య ప్రజానీకానికి రోశయ్య తమ వద్దకు వచ్చారన్న సంతృప్తి కలిగేది. ప్రజలకు వద్దకు వెళ్లడానికి ఆసక్తి లేకపోయినా ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటుచేస్తే ఇటు కేడర్‌లో నైనా ఉత్సాహం కలిగేది. జిల్లాలో రెండు రోజులు మకాం వేసిన రోశయ్య ముందు అనేక అవకాశాలు ఉన్నా వాటిని వదిలి పెట్టి కేవలం నేతల ఇళ్లకు వెళ్లడానికి మాత్రమే ఆసక్తి చూపించడం విమర్శలకు దారి తీసింది. జిల్లా నేతల్లో వర్గపోరు అధికంగా ఉండటం వల్ల ఆ ప్రభావం రోశయ్య పర్యటనపై స్పష్టంగా చూపించింది.

No comments: