నేడు నెల్లూరు

Saturday, May 1, 2010

గ్రూపుల గోల మధ్య రేపు నెల్లూరులో సిఎం పర్యటన

వర్గపోరుకు మారుపేరైన నెల్లూరు కాంగ్రెస్‌లోని గ్రూపుల గోల మధ్య ముఖ్యమంత్రి రోశయ్య ఆదివారం జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఏర్పాట్ల దగ్గర నుంచి ఆహ్వానపత్రాల వరకు అన్నిచోట్లా నేతల ఆధిపత్య పోరు కనపడుతోంది. జిల్లాలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోదరులు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి వర్గం మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. దీనికి ఆనం వ్యతిరేక వర్గం కూడా తయారయింది. ఈ వర్గానికి నేదురుమల్లి నుండి పరోక్షంగా మద్దతు లభిస్తోంది. ఏ అవకాశం దొరికినా వర్గాలు తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు సార్లు వాయిదా పడిన తరువాత ఆదివారం ముఖ్యమంత్రి రోశయ్య నగరానికి వస్తున్నారు. కేవలం నగరానికే పరిమితమైన ఆయన పర్యటనపై గ్రూపుల నీడలు కమ్ముకున్నాయి. మొదటి నుండి వ్యతిరేక వర్గానికి చెందిన ప్రజాప్రతినిథుల ప్రమేయం లేకుండా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆయన పర్యటించే ప్రాంతాలను, కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన వేదికలను జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. చివరి రోజు వరకు ఈ విషయాన్ని పట్టించుకోని ఆనం వ్యతిరేక వర్గం శుక్రవారం రంగంలోకి దిగింది. సిఎం పర్యటన ప్రాంతాలను ఉదయం ఆనం వర్గం పరిశీలించి వెళ్లగా సాయంత్రానికి వ్యతిరేక వర్గంలోని జడ్పీ చైర్మన్ కాకాణి గోవర్దనరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు కలిసి పరిశీలించారు. అదే ప్రాంతంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదిలావుండగా నగరంలోని ఆర్యవైశ్య సంఘం ముఖ్యమంత్రికి అభినందన సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రితోపాటు ఆనం సోదరుల ఫోటోలతో ఆహ్వాన పత్రం ముద్రణకు సిద్ధమయింది. ఇది తెలిసిన ఆనం వ్యతిరేక వర్గం ఆహ్వాన పత్రంలో కాంగ్రెస్‌లోని రెండు గ్రూపులకు చెందిన ప్రజాప్రతినిథుల ఫోటోలను ముద్రించాలని డిమాండ్ చేసింది. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయిన ఆర్యవైశ్య సంఘం ప్రతినిథులు ముఖ్యమంత్రి రోశయ్య, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫోటోలు తప్ప మిగిలిన వారి ఫోటోలన్నీ ఎగరగొట్టేసి నగరంలో రెండు వ్యాపార సంస్థల సౌజన్యంతో ఆహ్వాన పత్రాలు ముద్రించారు. ఈ వ్యవహారం మొత్తం సిఎం పర్యటనను విమర్శలకు గురి చేసింది. గ్రూపుల వత్తిడితో ఆర్యవైశ్య సంఘం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఆహ్వాన పత్రంలో నగర ప్రథమ పౌరురాలు, స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫోటోలు లేకుండా చేయడం కూడా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

No comments: