నేడు నెల్లూరు

Friday, May 7, 2010

కొండెక్కిన కూరగాయలు

ఓ పక్క ఎండలతో సతమతమవుతున్న సామాన్య జనానికి వేసవి ముదిరే కొద్దీ కొండెక్కుతున్న కూరగాయలు, నిత్యావసరాల ధరలు మరింత కుంగదీస్తున్నాయి. ఎండల ప్రభావంతో కూరగాయలకు గిరాకీ పెరిగింది. ధర నియంత్రణలో అధికారుల వైఫల్యం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది. కూరగాయాల్లో ఏ రకం చూసినా ధర అదర గొట్టేస్తోంది. అరటి కాయల నుండి వంకాయల వరకు ఇదే పరిస్థితి. అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ రోజు వారీ ధరలు ప్రకటించినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీనితో కమిటీ జాబితాలోని ధరలకు, అసలు ధరలకు పొంతన కుదరడం లేదు. ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. కిలో క్యారెట్ దుంపల ధర మార్కెట్ కమిటీ 25 రూపాయలుంటే మార్కెట్‌లో 30 రూపాయలు ఉంటోంది. బీరకాయలు 20 రూపాయలుంటే బయట 24 రూపాయలు పలుకుతోంది. వంకాయలు కమిటీ ధర 12 రూపాయలుంటే మార్కెట్‌లో 16 రూపాయలు ఉంటోంది. చామగడ్డలు, దొండకాయలు, బీరకాయలు, అరటి కాయలు, బీనీసు చివరకు కాకరకాయలు కూడా ధరలను మండిస్తున్నాయి. ఇక చిల్లర వ్యాపారుల వద్ద ధర మరింత పెరుగుతోంది. అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో లేని వెసులుబాటు చిల్లర అంగళ్లలో ఉంటోంది. ధర తక్కువని హోల్‌సేల్ అంగళ్లకు వెళితే పుచ్చు చచ్చు చూడకుండా వ్యాపారులు తూకం వేసింది వేసినట్లే తీసుకోవాల్సి వస్తోంది. అదే చిల్లర వ్యాపారుల దగ్గర చూసి తీసుకునే అవకాశం ఉంటోంది. ఈ నేపథ్యం ధర అక్కడకు ఇక్కడకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటు ధర నియంత్రణలో గాని అటు తూనికలు, కొలతల్లో గాని వ్యాపారులు చేతివాటం ప్రదర్శిస్తున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. రైతు బజార్లలో న్యాయం జరుగుతుందని వెళితే అక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. సౌకర్యాలు లేక రైతులు ఆ వైపు చూడడం లేదు. దీనితో అంగళ్లన్నీ వెలవెలబోయి దర్శనమిస్తున్నాయి. ఇక నిత్యావసరాల ధరల విషయంలో కూడా సామాన్యుడి అవసరాలను ఆసరాగా తీసుకుని వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. ధర తగ్గించినట్లు ప్రచారం చేసి వినియోగదారులు దానికి అలవాటు పడిన తరువాత వెంటనే దాని ధర పెంచేస్తున్నారు. దీనితో వినియోగదారులు వ్యాపారులకు దొరికి పోతున్నారు. ధరలపై వ్యాపార వర్గాలు మాత్రం పెరగడానికి కారణాలు రవాణా చార్జీలను సాకుగా చూపిస్తున్నాయి. డీజల్, పెట్రోలు ధరలు పెరగడం వల్ల అందుకు అనుగుణంగా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. పెట్రో ధరలు మళ్లీ పెరిగితే ఆ భారం మోయాల్సింది వినియోగదారులేనని చెబుతున్నారు.

No comments: