నేడు నెల్లూరు

Tuesday, May 4, 2010

నొప్పించక.. తానొవ్వక! : ముగిసిన సిఎం రోశయ్య పర్యటన

ముఖ్యమంత్రి డాక్టర్ కొణిజేటి రోశయ్య రెండు రోజుల జిల్లా పర్యటన సోమవారం ముగిసింది. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇంటిలో అల్పాహార విందుతో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఆయన పర్యటన కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి ఇంటిలో సోమవారం ఉదయం అల్పాహార విందుతో ముగిసింది. ఆదివారం బహిరంగ సభ, ప్రభుత్వ అతిథి గృహంలో తూతూమంత్రంగా జరిగిన అధికారుల సమీక్ష తప్ప మొత్తం కార్యక్రమం గ్రూపు నాయకుల కోసమే పరిమితమయింది. రోశయ్య పర్యటన జిల్లా కాంగ్రెస్‌లోని అన్ని గ్రూపులకు చెందిన ప్రధాన నాయకుల ఇళ్లలో చేతులు కడగడానికే సరిపోయింది. పనిలో పనిగా ఆయన తన సన్నిహితుల ఇంటికి కూడా వెళ్లారు. నొప్పించక తానొవ్వక అన్న చందంగా ముఖ్యమంత్రి తన పర్యటనను పార్టీ నాయకులకు సంతృప్తి కలిగించే విధంగా మలుచుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున సన్మానం అందుకున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఆయన పర్యటన ప్రజలను అంతగా ప్రభావితం చేయక పోయినప్పకీ అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలను, ఆధిపత్య పోరును బహిర్గతం చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వ్యవహరించని రీతిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య గ్రూపుల వ్యవహారాన్ని స్వయంగా బయట పెట్టారు. గ్రూపు రాజకీయాలకు నెలవైన జిల్లా విషయంలో ఇంతకు ముందు ముఖ్యమంత్రులు జాగ్రత్తలు తీసుకునే వారు. వివాదాలున్నట్లు సమాచారం ఉంటే వారితో మంతనాలు జరిపేవారు. సర్దిచెప్పేవారు. అవసరమైతే గద్దించి దారికి తెచ్చుకునేవారు. అయితే ప్రత్యేకంగా ఎవరి ఇళ్లకు వెళ్ళేవారు కాదు. దీనితో నాయకులంతా వీలు చూసుకుని వారే ముఖ్యమంత్రులు బస చేసే అతిథి గృహాలకు వెళ్ళేవారు. గోడు వెళ్ల బోసుకునే వారు. ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేసేవారు. తమ కష్టాలను ఏకరువు పెట్టేవారు. పనిలో పనిగా మంది మార్బలాన్ని వెంటేసుకుని బల ప్రదర్శనకు దిగేవారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య విషయంలో ఈ సన్నివేశాలన్నీ తారుమారయ్యాయి. ముఖ్యమంత్రే స్వయంగా గ్రూపుల నాయకుల ఇళ్లకు వెళ్లారు. నాయకులు ఎవరికి తోచిన విధంగా వారు ఆదరించి కానుకలు సమర్పించుకున్నారు. ముఖ్యమంత్రి అందరి ఇళ్లకు వెళ్లినా నాయకులు మాత్రం ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లలేదు. 26 గంటల్లో దాదాపు 18 గంటలు గ్రూపు నాయకుల ఇళ్లకు వెళ్లడంతోనే సరిపోయింది. ఇదిలావుండగా ఇదిగో వస్తారు.. అదిగి వస్తారు.. అని ఎదురు చూసిన ప్రజలకు మాత్రం ఆయన మాటమాత్రంగానైనా సంతృప్తి కలిగించలేకపోయారు.

No comments: