నేడు నెల్లూరు

Monday, May 3, 2010

ఆకట్టుకున్న నేదురుమల్లి ప్రసంగం

నగరంలోని విఆర్‌సి గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రోశయ్య సమక్షంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. ఆయన చేసిన వ్యాఖ్యానాలకు ప్రజల నుంచి నవ్వులు వెలిసాయి. గతంలో నెల్లూరులో ఒక చిత్రకారుడు ఉండేవాడని, అద్భుతంగా బొమ్మలు గీసే వాడని నేదురుమల్లి అన్నారు. ఆయన గాంధీ బొమ్మను వేయడం చూసి తాను పొట్టిశ్రీరాములు బొమ్మను వేయగలిగానని అన్నారు. రోశయ్య అన్ని బొమ్మల కంటే రోశయ్య బొమ్మ గీయడం భలే సులువని ఆయన వ్యాఖ్యానించారు.

రోశయ్య బొమ్మ గీయడం ఎంత సులువో ఆయన నుంచి నిధులు రాబట్టడం అంత కష్టమని ఆయన అన్నారు. ఏదైనా పనిపై ఆయన వద్దకు వెళితే గడ్డం కింద చేయి ఆనించి నవ్వుతూ కనిపిస్తారని చెప్పారు. రోశయ్య మంచి మూడ్‌లో నవ్వుతూ ఉన్నారు, పని పూర్తి చేసుకోవచ్చని భావిస్తే పొరపాటు పడినట్లేనని అన్నారు. ఒక్కపైసా ఇవ్వకుండా నవ్వుతూ బయటకు పంపించే సామర్థ్యం రోశయ్యకే స్వంతమని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రోశయ్యే ఆర్థిక మంత్రిగా ఉండటం వల్ల నిధులు రాబట్టడంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఆర్థిక మంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా అయిపోయారని ఆయన ఛలోక్తిగా అన్నారు.

‘రోశయ్య వస్తున్నాడు గదా....నగరం ఎట్టా ఉందో చూద్దామని తెల్లవారుజామునే కారులో బయలుదేరా....ఎక్కడ చూసినా అందంగా కనిపించిందని’ నేదురుమల్లి అన్నారు. ఏదో రోశయ్య వస్తున్నారని ముస్తాబు చేశారు గాని...మేయరమ్మా ప్రతిరోజూ ఇలా ఉండేలా చూసుకుంటే బాగుంటుందని ఆనం వర్గానికి చెందిన మేయర్‌ నందిమండలం భానుశ్రీకి చురక అంటించారు. నెల్లూరు నగరం ప్రతిరోజూ ఈ విధంగా ఉండదని రోశయ్యకు పరోక్షంగా నేదురుమల్లి వివరించగలిగారు.

నేదురుమల్లి ప్రసంగిస్తుండగా మంత్రి ఆనం సమయం దాటిపోతోందని సైగ చేశారు. దీనిని గమనించిన నేదురుమల్లి సీరియస్‌గా స్పంధించారు. నేనింకా మాట్లాడాల్సింది ఉంది....నీరు కూర్చో అంటూ కాస్త కటువుగానే సమాధానం ఇచ్చారు. జిల్లాలోనే రాష్ట్రంలోనే సీనియర్‌ నేతగా ఉన్న నేదురుమల్లి తనదైన పంథాలో వ్యవహరించి ప్రత్యేకతను చాటుకున్నారు.

No comments: