నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

నమ్మితే నట్టేట మునిగినట్లే!

ఒకరిపై ఒకరికి నమ్మకం అవసరం.. అది ఉన్నప్పుడే సమాజంలో రాణించగలం. అలాంటి నమ్మకాన్ని కొందరు సొమ్మ చేసుకుంటున్నారు. రూ.కోట్లలో బాధితులకు శఠగోపం పెడుతున్నారు. ఇలా మోసపోయిన వారు నెల్లూరులో బారులు తీరుతున్నారు. దీంతో నమ్మితే నట్టేట మునిగినట్టే అన్న చందంగా బాధితుల పరిస్థితి మారింది. పొదుపు భవిష్యత్తుకు మదుపు అనే భావన జిల్లా ప్రజల్లో మెండుగా ఉంది. ఈ నేపథ్యంలో పలువురు పేద, మధ్య తరగతి ప్రజలు తమ పిల్లల చదువు కోసమనో, పెళ్లిళ్లకోసమో, వృద్ధాప్యంలో ఉపయోగపడుతుందనో తమ సంపాదనలో కొంత దాచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ క్రమంలో తినోతినకో కష్టపడి సంపాదించిన సొమ్మను నెల నెల చీటీలు వేస్తున్నారు.

అలాగే తమ వద్ద ఉన్న నగదుకు బ్యాంకుల్లో తక్కువ వడ్డీ వస్తుందని ఎక్కువ వడ్డీ ఆశించి అడిగిన వారికి ఇస్తుంటారు. ఇలాంటివారిని నమ్మించి, నట్టేట ముంచే వారు సమాజంలో రోజురోజుకు ఎక్కువ అవుతున్నారన్న విషయం ఇటీవల నగరంలో జరిగిన ఘరానా మోసాలు పరిశీలిస్తే అర్ధం అవుతోంది. అందులో కొన్ని మచ్చుకు...

నవాబుపేటకు చెందిన ఓ బంగారు వ్యాపారి తోటి వ్యాపారుల వద్ద, సన్నిహితుల వద్ద నమ్మకం ఉంటూ ఆర్థిక లావాదేవీలు సాగిస్తూ వచ్చాడు. అలా నమ్మకంగా వ్యవహరిస్తూనే పలువురి వద్ద ఎక్కువ మొత్తంలో అప్పులు చేశాడు. ఆ తర్వాత వారి నమ్మకాన్ని వమ్ము చేసి రూ. కోటికి పైగా ఎగనామం పెట్టాడు. దీంతో బాధితులు గోడు చెప్పడానికి వీలులేకుండా పోయింది.

నగరంలోని ట్రంకు రోడ్డులో ఉన్న బ్యూటీ ప్లాజా నిర్వాహకుడు ప్రభుశంకర్ గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక లావాదేవీలు నడపుతున్నాడు. డైలీ, నెలవారి చీటీలు నిర్వహించడం, పలువురి వద్ద వడ్డీకి అధిక మొత్తంలో అప్పులు తీసుకోవడం చేస్తూ నమ్మకంగా ఉన్నాడు. ఇలా తనని నమ్మిన పలువురికి రూ. 9 కోట్లకు పైగా శఠగోపం పెట్టాడు.

నగరంలోని దర్గామిట్టలో ఉన్న శ్రవణ్య ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రజల్లో ఉన్న అమాయకత్వాన్ని సొమ్మ చేసుకుని రూ.. 20 కోట్లకుపైగా శఠగోపం పెట్టి బోర్డు తిప్పేసింది. పలు రకాలుగా ఇబ్బందులు పడే వారు అక్కడ సులువుగా రుణాలు ఇస్తున్నారంటే నమ్మారు. దీంతో వారు ముందుగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత శాతం కట్టమంటే అప్పు చేసి, కట్టారు. ఆ సొమ్మతో శ్రవణ్య సంస్థ బోర్డు తిప్పేయడంతో వారి ఇబ్బందులు తీరకపోగా ఇంకా అప్పుల్లో కూరుకు పోయారు.

నగరంలోని స్టోన్‌హౌస్‌పేటకు చెందిన మాల్యాద్రి తన మాటతీరుతో అందరిని నమ్మించాడు. పలువురి వద్ద రూ. కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చాడు.

డైలీ, వీక్లీ, మంత్లీ చీటీలు నిర్వహించడం, ఇతరుల వద్ద వేయడం, ఫైనాన్స్ కార్యకలాపాలు సాగించేవాడు. అలా రూ.. 4 కోట్లకు పైగా ఎగనామం పెట్టి కుటుంబీకులతో పరారయ్యాడు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా అనేకం జరిగాయి.

లబోదిబో మనడమే బాధితుల వంతు
నమ్మకంగా ఉండి మోసం చేసే వారు ఎక్కువ కావడంతో బాధితులు లబోదిబోమనడమే తప్ప ఏమీ చేయలేక పోతున్నారు. ఒక్కొక్కరు రూ. లక్షల్లో నష్టపోయి ఏమి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు తాము ఏమి చేయలేమని చేతులెత్తేస్తున్నారు.

డబ్బు దాచుకోవడానికి నిర్ధిష్టమైన మార్గాలున్నాయి:
డబ్బు దాచుకోవాలంటే నిర్ధిష్టమైన మార్గాలు అనేకం ఉన్నాయి. బ్యాంకుల్లో పలు రకాల పథకాలు ఉన్నాయి. అక్కడ దాచుకుంటే ఏ క్షణంలోనై తిరిగి పొందే అవకాశం ఉంది. కాని ప్రైవేటు వ్యక్తులను నమ్మి డబ్బు దాచుకోవాలంటే ఆ డబ్బు తిరిగి వస్తుందో లేదో చెప్పలేం. ప్రైవేటు ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టి, బ్యాంకుల్లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేయాలి. మోసాలకు పాల్పడిన వారిపై ఫిర్యాదు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
ఇ. దామోదర్, జిల్లా ఎస్పీ

No comments: