నేడు నెల్లూరు

Thursday, September 30, 2010

విహెచ్‌కు ఎంపి మేకపాటి సవాల్

జగన్ ఓదార్పు యాత్రపై రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతురావు చేస్తున్న వ్యాఖ్యలను నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మంగళవారం దర్గామిట్టలోని తన గెస్ట్‌హోస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరో చేసిన వ్యాఖ్యలను తాను చేశానంటూ విహెచ్ అర్థంలేని ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇంతవరకు ఎవ్వరిని పరుషపదజాలంతో మాట్లాడలేదని, అలాంటి తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. వైఎస్‌ఆర్ మరణానంతరం మృతి చెందిన వారిని ఓదార్చేందుకు ఆయన తనయుడు వైఎస్ జగన్ చేస్తున్న ఓదార్పు యాత్ర పట్ల విహెచ్ చులకనగా మాట్లాడటం బాధకరమన్నారు. జగన్ వెనుక వస్తున్న వారంతా డబ్బులతో వచ్చిన వారేనని ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. డబ్బులతో వచ్చిన జనం కాదని, వారంతా వైఎస్ అభిమానులు, జగన్ అభిమానులన్న విషయాన్ని ఆయన గుర్తించుకోవాలన్నారు. తనకు అంతా ఉబలాటంగా ఉంటే తాము డబ్బు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని, తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో ఎక్కడైనా జనంలో తనకు ఉన్న పరపతి ఏమిటో నిరూపించుకోవాలని ఆయన విహెచ్‌కు సవాల్ విసిరారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జగన్ నాయకత్వం చాలా అవసరమని చెప్పారు. అందుకే ఆయన వెంట తాము ఉన్నామన్నారు. వైఎస్ మరణానంతరం నుంచి నేటికి ఇచ్చిన మాటకు కట్టుబడి తాము జగన్ వెంట ఉన్నామన్నారు. అలాంటి తమపై వ్యాఖలు చేయడం విహెచ్ విజ్ఞతకు వదిలేస్తున్నామన్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ హస్తం గుర్తుతోపాటు భవిష్యత్తులో రాష్ట్రంలో వైఎస్ ఫొటో ఎంతో అవసరమని చెప్పారు. వేదికను ఎక్కే కాంగ్రెస్ నాయకులు ఓట్లు అడిగి ముందు హస్తంతోపాటు వైఎస్ ఫొటోను చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కొందరు పనిగట్టుకుని జగన్, సోనియాగాంధీ మధ్య చిచ్చులు పెడుతున్నారని, అలాంటి వారు తమ పద్ధతిని మార్చుకోవాలని సూచించారు. జగన్ భవిష్యత్తులో రాష్ట్ర కాంగ్రెస్‌కు దిశ, దశ నిర్దేశకునిగా మారునున్నారని తెలిపారు. అనంతరం కోవూరు ఎంపిపి అధ్యక్షులు వేలూరు కృష్ణ, ఉపాధ్యక్షులు విజయకిరణ్, కొడవలూరు జడ్పీటీసి శ్రీనివాసులు, గూడూరు 4వ వార్డు కౌన్సిలర్ టి నాగేశ్వరరావు, కొడవలూరు ఎంపిపి ఉపాధ్యక్షులు సూర్యనారాయణతో పాటు మరో 29మంది జగన్ యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సమావేశంలో టిటిడి మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments: