నేడు నెల్లూరు

Wednesday, April 28, 2010

ప్రజాసమస్యలు గాలికి వదిలి వ్యక్తిగత ప్రతిష్టలకే పట్టం

నెల్లూరు కార్పొరేషన్‌గా మారి సుమారు ఐదేళ్లు కావడంతోపాటు మరికొద్ది నెలల్లో తిరిగి కార్పొరేషన్‌ ఎన్నికలు రానుండడం తెలిసిందే. ఇప్పటివరకు కార్పొరేషన్‌లో జరిగిన ప్రతి చర్చల్లో అజెండాల్లోనూ, బడ్జెట్‌ సమావేశాల్లోనూ, సాధారణ సమావేశాల్లోనూ ప్రజాసమస్యలను మేయర్‌ ముందుంచి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన కార్పొరేటర్లు వ్యక్తిగత ప్రతిష్టలకే ప్రాధాన్యమిస్తూ, కేవలం వారి అధినాయకత్వం నుండి అందుతున్న ఆదేశాల మేరకే కార్పొరేషన్‌లో చర్చలు జరగడం శోచనీయం.

ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ సమస్యలను కార్పొరేషన్‌లో ఉంచి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తలచి కార్పొరేటర్లను ఎన్నుకోవడం జరిగింది. అయితే ఆ సంగతి మరచని కార్పొరేటర్లు వర్గాల వారీగా తయారవడమే కాకుండా ప్రజా సమస్యలను గాలికి వదిలిపెట్టి ఎవరిపాటికివారు గ్రూపులుగా మారి సమావేశం మొదలుకాగానే ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ సమావేశాన్ని జరగనీయకుండా చివరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ సమావేశం అయిపోయిందనిపిస్తున్నారు. ఎంతో బాధ్యతగా, గౌరవంగా మెలగాల్సిన కార్పొరేటర్లు నువ్వు, నేను, వాడు అంటూ సంబోధించుకుంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటూ ముష్టి యుద్ధాలకు తలపడే విధంగా వ్యవహరించే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రసారాలు, పత్రిల్లో వస్తున్న కథనాలు చూస్తుంటే నగర ప్రజల్లో వీరిపట్ల తీవ్ర వ్యతిరేకభావంతోపాటు, అసలు కార్పొరేటర్లు అంటేనే ఛీకొట్టే పరిస్థితి నెలకొనివుంది.

మేయర్‌లను మార్చడంతోపాటు ప్రస్తుతం మేయర్‌కు కార్పొరేషన్‌లో వర్గాలుగా ఏర్పడి కార్పొరేటర్లు మద్దతు ఇవ్వకపోవడమేగాక ఏకవచనంతో పిలుస్తూ విచక్షణ కోల్పోవడంతోపాటు కేవలం ఆగ్రహావేశాలకే పరిమితం అవుతూ ఎంతసేపటికీ ప్రచార సాధనాల్లో తాము కనపడాలని వివిధ రకాల ప్రయత్నాలు చేయడం కూడా ప్రజలకు కార్పొరేటర్లు అంటేనే ఏవగింపు ఏర్పడే పరిస్థితి నెలకొనివుంది. గడచిన ఐదేళ్లలో ప్రజాసమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నవిధంగా ఉన్నాయన్న వ్యాఖ్యలు నగరమంతా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్‌ స్థాయికి ఎదిగి ఐదు లక్షల జనాభాకు పైగా నెల్లూరు నగరం చేరుకోవడం జరిగింది.

దీనికి సంబంధించి ప్రజలకు అవసరమైన పనులను నెరవేర్చడంలో కార్పొరేషన్‌ పూర్తిగా విఫలమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాలుగైదు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నప్పటికీ గత రెండు రోజుల కిందట కార్పొరేషన్‌లో జరిగిన బడ్జెట్‌ సమావేశం, సాధారణ సమావేశాల్లో కార్పొరేటర్లు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. నగరంలోని నడిబొడ్డులోని కొన్ని ప్రాంతాల్లో వేసవి కాలం వచ్చిందంటే మంచినీటి సమస్య తీవ్రంగా ఉండడం జగమెరిగిన సత్యమే. అలాగే కొన్ని ప్రాంతాల్లో మురుగు కాలువలు, పైపులు సక్రమంగా లేకపోవడంతో అవి పగిలి మంచినీటిలో కలిసి ప్రజలు రోగాలబారిన పడుతున్న సంఘటనలు ప్రతి ఏడాది జరుగుతున్నా, కార్పొరేషన్‌ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలు లేవు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేటర్లు సమావేశాలు నిర్వహించి అధికారులకు సూచనలిచ్చిన దాఖలాలు కూడా లేవు. అలాగే నగరంలో ఏ సందూ గొందూ చూసినా, మురుగునీరు కాలువల నుండి పొంగి ప్రవహించడంతోపాటు పలు రోడ్లు దుర్వాసనను వెదజల్లుతుంటాయి.

ఇది ఒక ఎతె్తైతే, అదే వీధుల్లో చెత్తా చెదారాలు ప్రతి ఇంటిముందు కుప్పలు కుప్పులుగా దర్శనమిస్తూ ప్రజలు రోగాలకు కేంద్రాలుగా మారి ఉన్నాయనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అలాగే పలు డివిజన్లలో విద్యుత్‌ లైట్లు కొన్ని నెలలు, సంవత్సరాలుగా వెలగకపోయినప్పటికీ సదరు ఆ కార్పొరేటర్లు పట్టించుకోవడంగాని, సంబంధిత అధికారులతో సంప్రదించి ఆ లైట్లను వేయించే ప్రయత్నం కూడా చేపట్టకపోవడం శోచనీయం. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు సైతం జరుగుతున్న సంఘటన లు కోకొల్లలు. ప్రతిసారి డివిజన్లలో నెలకొనివున్న సమస్యలను కార్పొరేషన్‌ సమావేశాల్లో చర్చిస్తామన్న ఉద్దేశ్యం ఏఒక్క కార్పొరేటర్‌కి లేకపోవడం శోచనీయం. ప్రతిఒక్క కార్పొరేటర్‌ తమ డివిజన్లకు ఏ మేరకు నిధులు కేటాయించారు? ఏ మేరకు కమిషన్లు వస్తాయి? అన్న విషయాలపై దృష్టి సారించినంత శ్రద్ధ ప్రజాసమస్యలపై సారించడంలేదన్న వ్యాఖ్యలు నగరంలో వినిపిస్తున్నాయి.

నగరంలో నిత్యం వేలాదిమంది చుట్టుపక్కల గ్రామాల నుండి, నగరాల నుండి ప్రజలు నెల్లూరుకు రాకపోకలు సాగిస్తుంటారు. కనీసం వీరి సౌకర్యార్థం మరుగుదొడ్లు కూడా నగరంలో లేకపోవడం సిగ్గుచేటు. ఫలితంగా ఎక్కడ ఖాళీ ప్రాంతం కనపడితే అక్కడ మూత్ర విసర్జన చేస్తుంటారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ దుర్వాసనను వెదజల్లుతుంటాయి. ఇకపోతే కార్పొరేషన్‌గా మారి ఐదేళ్లు అవుతున్నప్పటికీ, మళ్లీ నాలుగైదు నెలల్లో కార్పొరేషన్‌ ఎన్నికలు రాబోతున్నప్పటికీ ఐదు లక్షల జనాభా దాటుతున్నప్పటికీ, గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయంలోని సిబ్బందే ఇప్పటికీ కొనసాగుతుండడం విశేషం. రానున్న మూడు, నాలుగు నెలల్లో ప్రజాసమస్యలపై దృష్టి సారించి వాటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

No comments: