నేడు నెల్లూరు

Saturday, April 10, 2010

సిఎం పర్యటన వాయిదాపై పలు ఊహాగానాలు

అధికార పార్టీలో గ్రూపు రాజకీయాల ప్రభావం వల్లే పర్యటన వాయిదా పడినట్లు ఆ పార్టీలోని ఓ వర్గం ప్రచారం చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనుచరులుగా ముద్ర పడిన ఆనం సోదరులు ఈ పర్యటనా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుండడంతో వ్యతిరేక వర్గం సహజంగానే డీలా పడింది. వైఎస్ హయాంలో ఆనం సోదరులు హవా సాగించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి రాజకీయంగా వెనుకబడి పోయారు. దీనితో ఆనం సోదరుల ఆధిపత్యానికి తిరుగులేకుండా పోవడంతో వ్యతిరేక వర్గం ఇబ్బందులు ఎదుర్కొంది. వైఎస్ మరణానంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జిల్లాలో సమీకరణలు మారాయి. తన పాత సన్నిహితులు ముఖ్యమంత్రి కావడంతో నేదురుమల్లి సహజంగానే మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన మద్దతుతో ఆనం వ్యతిరేక వర్గం కూడా తేరుకుంది. ఓ దశలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డికి నేదురమల్లి మద్దతుతో మంత్రి వర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆనం సోదరులు మాత్రం చాపకింద నీరులా మళ్లీ తమ బలాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలో సిఎం రోశయ్య పర్యటనపై కూడా చర్చ జరిగింది. సిఎం పర్యటన కార్యక్రమాల ఖరారులో ఆనం సోదరుల ప్రమేయమే కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీన చేపట్టిన ఐదవ విడత భూపంపిణీ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి రోశయ్య చేతులు మీదుగా జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. అదే రోజు సిఎం పర్యటనకు సంబంధించి సభా స్థలాన్ని ఎంపిక చేసి పరిశీలించి వచ్చారు. అయితే సిఎం పర్యటన విషయంలో శుక్రవారం జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం జరుగుతుందని చెప్పారు. కేబినెట్ సమావేశంలో ఏం జరిగిందో కానీ సిఎం పర్యటన మాత్రం వాయిదా పడింది. దీని వెనుక ఆనం వ్యతిరేక వర్గం పట్టు ఉందనే ప్రచారం ఊపందుకుంది. తమ ప్రమేయం లేకుండా ఆనం సోదరులు చేతిలో పర్యటన ఏర్పాట్లు జరుగుతుండడంతో గ్రూపుల మధ్య సమతుల్యం దెబ్బతిని వాయిదా పడిందని ఆనం వ్యతిరేక వర్గానికి చెందిన నేతలు చెబుతున్నారు. అయితే పర్యటన వాయిదాకు సంబంధించిన కారణాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించనున్నారు. దీనితో సిఎం పర్యటన వాయిదా సంబంధించి జరుగుతున్న ఊహాగానాలకు తెరపడుతుంది.

No comments: