నేడు నెల్లూరు

Wednesday, April 28, 2010

సిఎం పర్యటన పేరుతో దండకాలు

రాష్టమ్రుఖ్యమంత్రి కె.రోశయ్య జిల్లా పర్యటన వ్యాపారులకు సంకటంగా మారింది. మే నెల 2వ తేదీన ఆయన పర్యటన దాదాపుగా ఖరారు కావడంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దండకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వ్యాపార వర్గానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక నేత వసూళ్లలో కీలకపాత్ర పోషిస్తున్నారు. కోట్లాది రూపాయల దండకాలే ధ్యేయంగా ఆయన వ్యవహరించడం వ్యాపారులకు మింగుడు పడని విధంగా తయారైంది. నగరంలో కాంగ్రెస్‌ పార్టీలో పట్టున్న ఒక వర్గానికి సన్నిహితంగా మెలిగే నాయకుడు కావడంతో వ్యాపారులు ఆయన అడిగినంత మొత్తం ఇచ్చుకోలేక, కాదనలేక సతమతం అవుతున్నారు.

రాష్టమ్రుఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొట్టమొదటిసారిగా నెల్లూరుకు వస్తున్న రోశయ్యను ఘనంగా స్వాగతం పలకాలని, సత్కరించాలని ఒక సామాజిక వర్గం నిర్ణయించింది. దీంతో అధికారపార్టీకి చెందిన నగరంలోని ప్రముఖ నేత సూచన మేరకే ఈ దండకాలు ప్రారంభించినట్లు స్టోన్‌హౌస్‌పేటకు చెందిన నేత ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకమారు సమావేశం ఏర్పాటుచేసి వ్యాపార వర్గాలకు ఇండెంట్లు ఫిక్స్‌ చేశారు. దీనికి ఏమాత్రం పైసా కూడా తగ్గేది లేదంటూ హుకుం జారీ చేశారు. ఆయనకు సన్నిహితంగా మెలిగే మరికొందరు ఛోటా నేతలు ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇంకేముంది వ్యాపారుల వద్దకు చేరుకుని తమ వెంటనే డబ్బులు ముట్టజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్టమ్రుఖ్యమంత్రి పర్యటనకు ప్రభుత్వమే అన్ని ఖర్చులు భరిస్తుందని, తాము ప్రత్యేకంగా సన్మానం చేయాలన్నా ఇంత పెద్ద ఎత్తున నిధులు అవసరం రావని ఒక నేత విచారం వ్యక్తం చేశారు. ఒకరిద్దరు వ్యాపారులు నేరుగా సదరు నేత దృష్టికి తీసుకువెళ్లి తమకు కేటాయించిన మొత్తాలను కొంత తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసుకున్నారు.

అయితే ఈ ప్రతిపాదనను ససేమిరా ఒప్పుకోక పోవడమే కాకుండా మన వాడు ముఖ్యమంత్రి అయితే డబ్బు ఇవ్వడానికి వెనుకాడతారా, రేపు ఏదైనా సమస్య వస్తే మాదగ్గరికి ఎలా వస్తారో చూస్తానని ఆయన రుసరుసలాడినట్లు తెలిసింది. వ్యాపారాలు చేసే సమయంలో ఒకటో రెండో లొసుగులు తప్పనిసరిగా ఉంటాయని, నగరంలో పట్టున్న నేతకు సన్నిహితంగా ఈ వ్యక్తి మెలుగుతుండటంతో కాదనే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో ఈ విషయాన్ని సదరు సీనియర్‌ నేత దృష్టిలో పెట్టేందుకు కూడా వ్యాపార వర్గాలు వెనుకాడుతున్నాయి. మొత్తం మీద సిఎం రోశయ్య పర్యటన చిన్నచిన్న వ్యాపారులకు, ముఖ్యంగా స్టోన్‌హౌస్‌పేటలో హోల్‌సేల్‌ వ్యాపారులకు చిక్కులను తెచ్చిపెట్టింది.

No comments: