నేడు నెల్లూరు

Wednesday, April 21, 2010

ఎసి కూరగాయల మార్కెట్టులో వ్యాపారుస్తుల జిమ్మిక్కులు

నెల్లూరు నగరం నడిబొడ్డున వున్న ఎసి.సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌లో కూరగాయల వ్యాపారస్తుల చేతిలో కొనుగోలుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌లో ఒక్కసారి పరిశీలించినా వ్యాపారస్తులు చేసే జిమ్మిక్కు ఏ ఒక్కరికైనా ఇట్టే అర్థమైపోతుంది. మార్కెట్‌కు సంబంధించి అధికారులు మార్కెట్‌పైనే ఉన్నప్పటికీ వ్యాపారస్తులు చేస్తున్న జిమ్మిక్కులు వారికి తెలియవంటే ఎవరూ నమ్మని పరిస్థితిలో ఉన్నారు. కారణం వ్యాపారస్తుల నుండి నెలసరి మామూళ్లు సంబంధిత అధికారులకు అందడమేనన్న వ్యాఖ్యలు లేకపోలేదు. మార్కెట్‌లో అడుగుపెట్టిన కొనుగోలు దారుడికి ఒక దుకాణంకు వెళ్తే కేజీ కూరగాయలు ఒక ధర చెప్పడం జరుగుతుంది. మరికొద్ది ముందుకెళ్తే మరో దుకాణాదారుడు అదే ధరకు మూడు కేజీల కూరగాయలనుఇస్తామంటూ పెద్దగా అరుస్తూ కొనుగోలుదారులను ఆకర్షించడం కనిపిస్తుంది. అయితే ఈ విషయమై కేజీ కూరగాయల ధర చెప్పిన దుకాణాదారుని అడిగితే, అదే ధరకు మూడు కేజీలిచ్చే వ్యాపారస్తుని తూకంలో తేడా ఉంటుందని పక్క వ్యాపారస్తుడే చెప్పడం విశేషం.

ఉదాహరణకు మార్కెట్‌లోని ఒక దుకాణాదారుడు కేజీ టమోటాలను పది రూపాయలు చెప్పినట్లయితే మరికొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో దుకాణాదారుడు అదే పది రూపాయలకు మూడు కేజీల టమోటాలను ఇస్తున్నామని పెద్దగా అరవడం మనకు వినపడుతుంది. కొనుగోలుదారుడు ఎక్కువగా రూ.10లకు మూడు కేజీలిచ్చే దుకాణాదారుని వైపే మొగ్గుచూపు తుంటారు. ఈ విషయమైవారిని ప్రశ్నిస్తే తమ ఖాతాలు ఖచ్చితంగా ఉంటాయని, వారి ఖాతాల్లో మోసం ఉంటుందని, మార్కెట్‌లోనే ఒక వ్యాపారస్తునిపై మరో వ్యాపారస్తుడు చెప్పుకునే దుస్థితి ఏర్పడి ఉంది. తూకాల్లో మోసాల విషయమై పలుమార్లు సంబంధిత అధికారులు దాడులు నిర్వహించి వందో రెండొందలో జరిమానా విధించడం జరుగుతుండడంతో అదే వ్యాపారస్తుడు తిరిగి అదే మోసానికి పాల్పడడం ఆనవాయితీగా మారింది. రోజుకు ఎసి మార్కెట్‌లో లక్షలాది రూపాయలు వ్యాపారం జరుగుతుండగా, ఇందులో వేలాది రూపాయల కూరగాయలను కొనుగోలు చేస్తున్న ప్రజలు భారీగా నష్టపోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఈ దుకాణాల వద్ద కూరగాయల బేరాన్ని వారు చెప్పిన రేటుకు కొనకుండా బేరసారాలు చేసినట్లయితే ఆ దుకాణాదారులు రెండర్థాలతో కొనుగోలుదారులను హేళన చేస్తున్నట్లు తెలిసింది.

దీనికి సబంధించి కూడా కొనుగోలుదారులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో చూపుడుకు ధర్మ కాటా ఏర్పాటు చేసినా, అది ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయదో తెలియదు. పైగా ధర్మ కాటా విషయమై కూరగాయలు కొనుగోలు చేసే ఏ ఒక్కరికీ దాని గురించి తెలియదంటే అతిశయోక్తి లేదు. మార్కెట్‌లో ఎన్నిసార్లు సంబంధిత అధికారులు దాడులు చేసి చిన్నా చితకా కేసులను నమోదు చేస్తూ కొద్దిపాటి పెనాల్టీలను విధిస్తూ తిరిగి అదే వ్యాపారస్తునికి అమ్ముకునే విధంగా అనుమతి ఇస్తుండడంతో ఈ తరహా తప్పుడు తూకాలతో ప్రజలను మోసగించే వ్యాపారస్తులు మార్కెట్‌లో కోకొల్లలుగా తయారయ్యారన్న అపవాదులను సంబంధిత అధికారులు మూట కట్టుకుంటున్నారు. ఇటీవలే తూనికల, కొలతల శాఖ అధికారులు ఈ మార్కెట్‌పై దాడులు నిర్వహించి పలు వ్యాపారస్తుల మీద కేసులు పెట్టిన సంఘటనలు కూడా జరిగిన విషయం విదితమే.

అయినప్పటికీ వ్యాపారస్తుల్లో ఎటువంటి మార్పులు రాకపోగా కూరగాయల వినియోగదారులని ఎన్ని రకాలుగా మోసగించవచ్చో అన్ని రకాల మోసాలకు గురి చేస్తూ ఎక్కువ రేట్లతో ప్రజలను దోచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు మార్కెట్‌ మొత్తం మీద కూడా సకాలంలో చెత్తా చెదారాలను కార్పొరేషన్‌ అధికారులు తొలగించకపోవడంతో కుళ్లిన కూరగాయలను దుకాణాదారులు మార్కెట్‌ సమీపంలోనే పోస్తుండడంతో మార్కెట్‌ ఏరియా అంతా దుర్గంధపూరితమైన వాతావరణం నెలకొంది. కూరగాయలు కొనుగోలు చేసేవారు ముక్కులు మూసుకుని కొనాల్సి వస్తుందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ సంబంధిత తూనికల, కొలతల శాఖ అధికారులు ఈ మార్కెట్‌పై దృష్టి సారించి మోసాలకు పాల్పడే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూరగాయలు కొనుగోలుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. మోసాలకు పాల్పడే ఏదైనా ఒక దుకాణాదారునిపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లయితే మిగిలిన దుకాణాదారులైనా నిజాయితీగా తమ వ్యాపారాలను కొనసాగించే అవకాశం ఉందని పలువురు కోరుతున్నారు.

No comments: