నేడు నెల్లూరు

Thursday, April 1, 2010

ఆనం తో భానుశ్రీ శాశ్వతంగా దూరం


నెల్లూరు నగరంలో జరిగిన, జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలకు విసుగు చెందిన నగర మేయర్‌ భానుశ్రీ రాజీ యాలకు శాశ్వతంగా దూరం కానున్నట్లు తెలిసింది. ప్రశాంతంగా ఉంటున్న తనకు మేయర్‌ పదవి కిరీటం విషయం అటుంచి ఆ పదవి వల్లే తాను అన్ని విధాలా నష్టపోయానని ఆమె భావిస్తున్నారు. నమ్ముకున్న వారు నట్టేట ముంచారన్నదే భానుశ్రీ ఆవేదనగా ఆంతరంగికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిని నేరుగా ఎదుర్కోలేక ప్రత్యర్థులైన రాజీవ్‌ భవన్‌ నేతలు తనను అడ్డుగా పెట్టుకుని మానసికంగా క్షోభకు గురి చేసినా ఇన్నాళ్లూ ధైర్యంగా ఎదుర్కొన్నప్పటికీ, ఆ మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా తయారై ఆమె భర్త ట్రాన్స్‌కో డిఇఇ సుబ్బరాజును జైలుకు పంపేంతవరకు రావడంతో ఆమె కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని, మరోవైపు రూ.100 కోట్లు అక్రమంగా సంపాదించారని రాజీవ్‌ భవన్‌ నేతలు చేసిన ఆరోపణలు ఎసిబి దాడులతో తేటతెల్లమైనాయని భానుశ్రీ ఓవైపు గంభీరంగా చెబుతున్నప్పటికీ, మరోవైపు తన భర్తను అన్యాయంగా జైలుపాలు చేసి కుటుంబ గౌరవాన్ని కాస్తా వీధులపాలు చేసిన రాజీవ్‌భవన్‌ నేతలపై ఆమె తీవ్రంగా రగిలిపోతున్నారు. అయితే ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందాన తనను మానసిక క్షోభకు గురి చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకునే విషయమటుంచి తనపై ఈగ కూడా వాలనీయకుండా చూడగలరని నమ్ముకున్న ఆనం సోదరులు, ముఖ్యంగా అగ్రజుడు ఆనం వివేకానందరెడ్డి ఈ విషయంలో నిస్సహాయతను ప్రదర్శించడం ఆమె జీర్ణించుకోలేకుంది. మరోవైపు మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి కూడా ఎసిబి దాడులను అడ్డుకోలేకపోవడం, తన భర్తను జైలుకు వెళ్లనీయకుండా చూడడం, చివరకు బెయిలు మంజూరు విషయంలో కూడా ఏమాత్రం తమ రాజకీయ అనుభవం, పరపతిని ఉపయోగించలేకపోవడం వంటి కారణాలతో భానుశ్రీ అటు ఆనం వర్గంతో తెగతెంపులు చేసుకోవడంతోపాటు మరో ఆరు నెలల పదవీ కాలం ఉన్నప్పటికీ మేయర్‌ పదవిని తృణప్రాయంగా త్యజించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

No comments: