నేడు నెల్లూరు

Friday, April 16, 2010

జీఎస్ఎల్‌వీ -డీ3 ప్రయోగ వ్యయం రూ.330 కోట్లు

షార్ నుంచి జీఎస్ఎల్‌వీ -డి3 ప్రయోగ వ్యయం మొత్తం 330 కోట్లు. అందులో జీఎస్ఎల్‌వీ వాహన వ్యయం 180 కోట్లు కాగా, జీ శాట్-4 ఉపగ్రహ తయారీ వ్యయం 150 కోట్లు అయిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజన్లను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 335 కోట్లు కేటాయించింది. తొలి ప్రయోగం విఫలం కావడంతో దాదాపు 500 కోట్లు బంగాళాఖాతంలో కలిసిపోయాయన్న విమర్శలను ఇస్రో ఎదుర్కోవాల్సి వచ్చింది.

తొలి ప్రయోగాలు వైఫల్యాలే...

శ్రీహరికోట సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రంలో 30 ఏళ్ళలో జరిగిన నాలుగు రాకెట్ల ప్రయోగాలలో మొదటి మూడు ప్రయోగాలు వైఫల్యం చెందాయి. 1979లో జరిగిన ఎస్ఎల్‌వి తరహా రాకెట్ల తొలి ప్రయోగం విఫలమయింది. 1987లో జరిగిన ఎఎస్ఎల్‌వీ తరహా రాకెట్ తొలి ప్రయోగం కూడా అపజయాన్ని చవిచూసింది.

అనంతరం 1993లో తొలి పీఎస్ఎల్‌వీ డి1 ప్రయోగం విఫలమయింది. 2001లో జరిగిన జీఎస్ఎల్‌వీ సిరీస్‌లో తొలి ప్రయోగం మాత్రం విజయవంతమైంది. గురువారం స్వదేశీ క్రయోజనిక్ దశతో జరిగిన జీఎస్ఎల్‌వీ -డి3 ప్రయోగం కూడా అపజయాని చవిచూసింది. అయితే ఆదిలో హంసపాదు అయినా... అనంతరం జరిగే ప్రయోగాలు విజయాలబాట పట్టడం విశేషం.

No comments: