నేడు నెల్లూరు

Friday, April 16, 2010

ఆటోల పై నిషేధం అమలు కాలేదు

నెల్లూరు నగరంలోకి 15వ తేదీ నుండి 7 సీటర్‌ ఆటోల ప్రవేశాన్ని జిల్లా ఎస్‌పి నిషేధించడం తెలిసిందే. అయితే రవాణా శాఖాధికారులు మాత్రం నగరంలో అసలు 7 సీటర్‌ ఆటోలు లేవని తేల్చి చెప్పడం విశేషం. కేవలం నగరంలో 3 ప్లస్‌ 1 ఆటోలకు తాము అనుమతి ఇవ్వగా ఆ ఆటోలు 7 సీటర్‌ ఆటోలుగాను, అదేవిధంగా 4 సీటర్‌ అప్పీ ఆటోలు, 5 సీటర్‌ కెపాసిటీతో నగరంలో ప్రయాణీకులను ఎక్కించుకుని తిప్పుతున్నారని రవాణా శాఖాధికారులు తెలుపుతున్నారు.

అయితే పోలీసు అధికారులు మాత్రం నగరంలోకి రూరల్‌ ప్రాంతాల నుండి 7 సీటర్‌ ఆటోలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయని, అటువంటి వాటిని నిషేధించాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్‌పి ఇచ్చిన ఆదేశాల మేరకు 7 సీటర్‌ ఆటోల నిషేధంపై ఆటో యజమానులు లీగల్‌గా అనుమతిని పొందడానికి కోర్టులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఆటో యజమానులు ఇప్పటికే తమకు ఉన్నంతలో కొంత సొమ్మును సేకరించుకుని మిగిలింది ఫైనాన్స్‌ ద్వారా ఆటోలను కొని అధికారుల ఆదేశాలను విన్న వెంటనే ఆటోలను అమ్ముకోలేక, ఫైనాన్స్‌లు కట్టలేక ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా స్థాయిలో ఎక్కడా కూడా 7 సీటర్‌ ఆటోలను నగరాల్లోకి రాబోయే రోజుల్లో ప్రవేశానికి అనుమతి ఇవ్వరేమోనని భయాందోళనకు గురవుతున్నారు. రవాణా శాఖాధికారులు 7 సీటర్‌ ఆటోలు లేవని తేల్చడంతో వాటి నిషేధానికి సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించడానికి పోలీస్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫలితంగా 15వ తేదీ నుంచి అమలు చేయాల్సిన 7 సీటర్స్‌ ఆటోలు నగర ప్రవేశ నిషేధం అమలు కాలేదు. నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలనే జిల్లా ఎస్‌పి ఉద్దేశ్యం చాలా వరకు మంచిదే అయినప్పటికీ, నగరంలో ఉన్న రహదారులను వెడల్పు చేయకుండా వాహనదారులపై పడడం ఏమంత బాగులేదని పలువురు విమర్శిస్తున్నారు. ఆటోల సీటింగ్‌ కెపాసిటీని బట్టి నిషేధం వర్తింపచేసేదానికంటే, ఓవర్‌లోడు చేయకుండా ఆటోలపై చర్యలు తీసుకుంటే మంచిదని సామాన్య ప్రయాణీకులు, ఆటోను నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆటోవాలలు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రమాదాలు జరిగినపుడు అప్పటికప్పుడే పోలీసు అధికారులు స్పందిస్తూ తీసుకునే అనేక నిర్ణయాల్లాగే ఆటోలపై నిషేధం పూర్తిగ కొనసాగుతుందా లేక మూలన పడుతుందా అనేది వేచి చూడాల్సిందే.

No comments: