నేడు నెల్లూరు

Tuesday, April 13, 2010

నగరం లో ట్రాఫిక్‌ రూట్లపై మార్పులు

రోజు రోజుకీ నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రూట్లను పరిశీలించి పలువురు సలహాలు, సూచనల మేరకు రూట్‌ మ్యాప్‌ను తయారు చేసినట్లు జిల్లా ఎస్‌పి ఇ.దామోదర్‌ తెలిపారు. శనివారం ఉమేష్‌ చంద్ర అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 26వ తేదీ నుంచి కలెక్టర్‌ ఆఫీసుకు పోయేరోడ్డును వన్‌వేగా చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ ఆఫీస్‌కు వెళ్లే వాహనాలు నెహ్రూ బొమ్మ, అభిరామ్‌ హోటల్‌, జడ్పీ సెంటర్‌, స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, దోభీ బజార్‌ సెంటర్‌, డైకస్‌ రోడ్డు సెంటర్‌ వైపు వెళ్లవచ్చని తెలిపారు. ఈ ప్రాంతాల్లో వెళ్లే వాహనాలకు ఎటువంటి వాహనాలు ఎదురు రాకూడదని సూచించారు.

అదేవిధంగా ఆచారి వీధి నుంచి దోభీ సెంటర్‌ మీదుగా వచ్చే వాహనాలు కలెక్టర్‌ ఆఫీసు నుంచి వచ్చే వాహనాలు డైకస్‌రోడ్డు మీదుగా, పాత చేపల మార్కెటు మీదుగా, ఉమామహేశ్వరి ఆలయం వైపు వచ్చి అక్కడ నుంచి జడ్పీ సెంటర్‌కు గాని, వాహబ్‌పేట ద్వారా నెహ్రూ బొమ్మ సెంటర్‌కు వెళ్లవచ్చునని తెలిపారు. అయితే ఈ వన్‌వే ట్రాఫిక్‌ అమలు చేసేందుకు అనువుగా ప్రజల వద్ద నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దీనిపై సూచనలు ఏవైనా తెలియజేయాలనుకున్నవారు నగర డిఎస్పీ రాధికారెడ్డిని, నార్త్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌రెడ్డికిగాని రాత పూర్వకంగా తెలియజేయాల్సిందిగా ఎస్‌పి కోరారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ నుంచి 7 సీటర్‌, అప్పి ఆటోలను నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించడం, తిరుగటాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లుగా ఎస్‌పి తెలిపారు. లారీలు, టిప్పర్లు, హెవీ గూడ్స్‌ వెహికల్స్‌ను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించకుండా నిషేధాన్ని అమలుపరుస్తున్నట్లు తెలిపారు.

ఈ విధమైన నిషేధాఙ్ఞలు నెల్లూరు పట్టణంలోకి ప్రవేశించే పలు కూడళ్ల వద్ద నుంచి అమలులో ఉంటుందని ఎస్‌పి తెలిపారు. వాటిలో కోవూరు వైపు నుంచి వచ్చు వాహనాలు వెంకటేశ్వరపురం వరకు, జొన్నవాడ వైపు నుంచి వచ్చు వాహనాలు ఇరుగాళమ్మవారి ఆలయం వరకు, మద్రాసు వైపు నుంచి వచ్చు వాహనాలు హైవే నుండి, టౌన్‌లోకి వచ్చు ఎంట్రీ పాయింట్‌ అయిన అయ్యప్పగుడి రోడ్డు వరకు, ముత్తుకూరు వైపు నుంచి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్‌-5 అండర్‌ బ్రిడ్జి వరకు, చిల్డ్రన్స్‌ పార్క్‌ నుంచి వచ్చు వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్‌ అయిన చింతారెడ్డిపాళెం వరకు, గొలగమూడి వైపు నుంచి వచ్చే వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్‌ వరకు, నరుకూరు నుండి వచ్చే వాహనాలు ఎన్‌హెచ్‌-5 అండర్‌ బ్రిడ్జి వరకు, మైపాడు రోడ్డు నుంచి వచ్చే వాహనాలు సబ్‌ స్టేషన్‌ సెంటర్‌ వరకు, ఎన్టీఆర్‌ నగర్‌ నుంచి వచ్చు వాహనాలు ఎన్‌హెచ్‌-5 ఎంట్రీ పాయింట్‌, పొదలకూరురోడ్డు నుంచి వచ్చే వాహనాలు తెలుగుగంగ ప్రాజెక్టు వరకు వస్తాయని ఎస్‌పి తెలిపారు. అదేవిధంగా మద్రాస్‌ బస్టాండు వద్దవున్న కూరగాయల మార్కెట్‌ వద్దగాని, ఐసిఐసిఐ బ్యాంకు వద్ద గాని, వాహనాలను పార్క్‌ చేయకుండా వాటిని అక్కడేవున్న కోనేరు గ్రౌండ్‌లో పార్క్‌ చేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డిఎస్‌పి జిఆర్‌.రాధిక, రూరల్‌ డిఎస్‌పి రవికుమార్‌, ట్రాఫిక్‌ సిఐలు, నగర సిఐ, ట్రాఫిక్‌ ఎస్‌ఐలు, నగర ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments: