నేడు నెల్లూరు

Wednesday, April 21, 2010

ఎప్పుడో పోయేవాడ్ని.. చెక్కతో కొట్టబట్టే బతికా : మంత్రి ఆనం

విద్యుత్ ప్రమాదంలో ఎప్పుడో మృతి చెందేవాడినని ఆ సందర్భంలో తన పినతండ్రి ఎసి సుబ్బారెడ్డి చెక్కతో కొట్టబట్టే బతికానని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. తమ స్వగ్రామమైన సౌత్ రాజుపాళెంలో ఓమారు విద్యుత్ తీగ పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యానని, ఇది గమనించిన తన పినతండ్రి, దివంగత ఎసి సుబ్బారెడ్డి చెక్కతో కొట్టి ఆయన కారులోనే నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారన్నారు. తన చేతివేలిపై విద్యుత్ తీగ పట్టుకోవడంతో ఏర్పడ్డ గాయపు మచ్చను చూపూతూ గత సంఘటనను గుర్తుచేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ప్రజాపథం సభలో ఆయన ఈ సందర్భాన్ని స్వయంగా ప్రస్తావించడం విశేషం. ఆ గ్రామ ప్రజాపథంలో భాగంగా స్థానిక రైతులు ఓ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఉన్న స్విచ్ ఆన్/ ఆఫ్ చేసే విభాగం దెబ్బతినడంతో ప్రమాదభరితంగా మారిదంటూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. వెంటనే స్థానిక ట్రాన్స్‌కో అధికార్లనుద్దేశించి ఈ సమస్య పరిష్కరించాలంటూ మంత్రి ఆదేశించారు. ఒకటి రెండురోజుల్లో ట్రాన్స్‌కో అధికారులు సంబంధిత మెటీరియల్ అమర్చి సమస్య పరిష్కరించిందీ లేనిదీ తనకు తెలపాలని గ్రామస్థులనుద్దేశించి సూచించారు. అలా ఆ అధికారులు బాగు చేయకుంటే తానే వచ్చి మరమ్మతులు చేసి సమస్య పరిష్కరిస్తానని హాస్యోక్తిగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భాన్ని కొనసాగిస్తూ... వాస్తవంగానైతే తనకు కరెంట్ పనులు తెలియదని, అలా చేస్తూ ఒకప్పుడు గాయపడ్డ సందర్భాన్ని ఈ గ్రామంలో గుర్తు చేసుకున్నారు. తనను కాపాడిన సమయంలో కాకతాళీయంగా ఎసి సుబ్బారెడ్డి విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేస్తున్న సంగతి కూడా రామనారాయణ జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ప్రజాపథం కార్యక్రమాలు ఊరూరా వాడివేడిగా జరుగుతుండగా ఒక్కసారిగా మంత్రి నోట ఈ ఆటవిడుపు వ్యాఖ్యలు సరదాగా వినిపించడంతో సభలో నవ్వులు పూశాయి. కాగా, అప్పట్లో ఎసి సుబ్బారెడ్డి విద్యుత్, పిడబ్ల్యూడి (పిఆర్, ఇరిగేషన్) శాఖల మంత్రిత్వ బాధ్యతను నిర్వహిస్తుండేవారు. అందువల్ల అందరూ ఆయనను వాడుక భాషలో నీరూ, నిప్పు మంత్రిగా పిలుస్తుండేవారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన అరవయ్యేవ దశకపు చివరి సంవత్సరాల్లో నెల్లూరు జిల్లా మొత్తమీద వ్యక్తిగతంగా సొంత కారు అంటూ ఒకే ఒక్కరికి ఉండేది అదీ ఎసి సుబ్బారెడ్డికి మాత్రమేనని సమాచారం.

No comments: