నేడు నెల్లూరు

Tuesday, April 20, 2010

ఎముకలు ఏరేస్తున్నారు...ఆపై అమ్మేస్తున్నారు

నెల్లూరు నగరంలోని బోడిగాడితోట ఎదురుగావున్న సుమారు 10 ఇళ్లలో మృతి చెందిన మూగజీవాలతోపాటు బతికిన మూగజీవాలను చంపివేస్తూ వాటి మాంసాన్ని నగరంలోని పలు వ్యాపారస్తులకు కేజీల లెక్కన అమ్మేస్తున్నారు. ఈ మాంసాన్ని నగరంలోని పలు ప్రధాన సెంటర్లలో చికిన్‌పకోడా తయారు చేసి అత్యంత గోప్యంగా అమ్మకాలు చేస్తున్నారు. ఈ తరహా చికిన్‌ పకోడా దుకాణాలు నగరంలోని కొన్ని ప్రధాన కేంద్రాలలో చికిన్‌ పకోడా కంటే రూ.10లు తక్కువగానే దీన్ని అమ్ముతుండడంతో ఎక్కువగా నగరంలోని పలువురు దీనివైపే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఆపైన
వాటి ఎముకలను ఆ ఇళ్లలో నిల్వ ఉంచుతూ చెనై్న, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర నగరాలకు సంబంధించిన వ్యాపారస్తులకు అమ్ముతూ లక్షలాది రూపాయలు సంపాదించే పనిలో పలువురు వ్యాపారస్తులు పనిచేస్తున్నారు.

ఈ మూగజీవాల్లో ఎక్కువగా బర్రెలు, ఆవులు, దూడలు ఉంటున్నాయి. ఎక్కువగా వీటికి సంబంధించిన ఎముకలనే ఈ ఇళ్లలో ఉంచుతుండడంతో వీటికి సంబంధించిన దుర్వాసన సమీపంలోని సత్యనారాయణపురం, వైకుంఠపురం తదితర ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తుంది. ఈ వాసన పీల్చి పలువురు వ్యాధులకు గురైనట్లు చెబుతున్నారు. వంట నూనెలలో కలిపేందుకు, నూనెను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అలాగే వీటి తోళ్లను బ్లీచింగ్‌తో కడిగి అదే ప్రాంతాల్లో ఆరబెడుతుండడంతో ఈ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. మైపాడు రోడ్డులో పాత చె క్‌పోస్ట్‌ నుంచి జాకీర్‌హుస్సేన్‌ నగర్‌ జంక్షన్‌వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్లే ప్రయాణీకులు, పాదచారులు ముక్కుమూసుకుని వెళ్లాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఇదంతా ఒక ఎతె్తైతే ఆ ప్రాంతంలోని పేదరికంలో మగ్గుతున్న పదేళ్లలోపు పిల్లలను, అనాధ పిల్లలను చేరదీసి ఎముకల వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఈ పిల్లలను సమీపంలోని బోడిగాడి తోటకు పంపి మనుషుల ఎముకలను సైతం ఏరించి వాటిని కూడా బర్రెల, ఆవుల ఎముకలతో కలిపేస్తూ అమ్ముకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఎక్కువగా శుక్రవారం, శనివారం, ఆదివారం సమయాల్లో ఈ మూగజీవాలకు సంబంధించి ఎక్కువగా ఎముకలను అక్కడే ఒలిచి వ్యర్థ పదార్థాలను సమీపంలోని సర్వేపల్లి కాలువలో పడవేస్తూ, ఎముకలను మాత్రం ఇళ్లలో భద్రపరుస్తూ, వ్యాపారస్తులకు మంగళ, బుధవారాల్లో చె నై్న, గుంటూరు, విజయవాడకు చెందిన వ్యాపారస్తులకు రాత్రి 8 గంటలపైన అత్యంత గోప్యంగా లారీల్లో లోడు చేస్తూ రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ వ్యాపారంపై అత్యంత గోప్యంగా నిర్వహిస్తున్నారు. ఎటువంటి అనుమానం రాకుండా పగలు సమయాల్లో ఆ పది ఇళ్ల వరకు సుమారు 10 మంది వరకు కాపలా ఉండడం, ఆ ఇళ్ల వద్ద ఎవరైనా ఆగినట్లయితే వారి గురించి విచారణ చేయడంతోపాటు, అనవసరంగా వివాదాలకు దిగుతూ, వారిని కొట్టి ఆ ప్రాంతం నుంచి తరిమివేస్తున్నట్లు సమాచారం. అత్యవసర పరిస్థితుల్లో, ఏదైనా వాహనం ఆ ఇళ్ల వద్ద ఆగినట్లయితే ఆ వాహనం ఎవరిది, ఎందుకు ఆగింది, ప్రెస్‌కు, లేదా పోలీసులకు సంబంధించినవారా అని ఆరా తీస్తూ వారిని ఆ ప్రాంతం నుంచి అతి తొందరగా వెళ్లేలా చూస్తున్నట్లు తెలిసింది.

ఈ ప్రాంతంలో సుమారు గత పదేళ్లుగా అత్యంత గోప్యంగా ఈ ఎముకల వ్యాపారం చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై స్థానికులు ఇప్పటికే చాలామంది అధికారులకు లేఖలు రాసినప్పటికీ స్పందన లేదని పలువురు పేరు చెప్పేందుకు ఇష్టంలోని స్థానికులు తె లపడం విశేషం. కొన్ని సందర్భాల్లో కార్పొరేషన్‌కు సంబంధించిన పలువు అధికారులు మాత్రం మామూళ్లు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. స్థానికులు కార్పొరేషన్‌ అధికారులకు, సంబంధిత అధికారులకు రాస్తున్న లేఖల ఆధారంగా చర్యలు తీసుకోకపోవడమే గాక ఆ లేఖలను అడ్డం పెట్టుకుని ఆ వ్యాపారస్తుల వద్ద భారీగా మమూళ్లు వసూలు చేసి స్తబ్దుగా ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే మూగజీవాలకు సంబంధించిన ఎముకలను నిల్వ ఉంచడంతో స్థానికులు పలు రోగాలకు గురవుతున్నట్టు, అలాగే పలు చర్మ వ్యాధులు అంటుకుంటున్నట్టు సమాచారం.

గతంలో కేవలం మూగ జీవాలకు సంబంధించిన ఎముకలను, చర్మాలను మాత్రమే ఎగుమతులు చేసే ఈ వ్యాపారస్తులు తాజాగా అనాధ పిల్లలను సేకరించి బోడిగాడి తోటలోని మనుషుల ఎముకలను కూడా సేకరించి జంతువుల ఎముకలతో కలిపి ఎగుమతులు చేస్తుండడంతో స్థానికులకు తెలిసినప్పటికీ ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నట్టు తెలిసింది. వీరికి అంగబలం, ఆర్థిక బలంతోపాటు రాజకీయ పలుకుబడి కూడా ఉండడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లోని పలువురికి తెలిసినప్పటికీ వారు మఫ్టీల్లో వచ్చి ఆదివారం సమయాల్లో మామూళ్లు వసూలు చేసుకుని వెళ్తున్నట్టు తెలిసింది. ఈ ఎగుమతులు ఎక్కువగా మంగళవారం, బుధవారం, రాత్రిళ్లు మాత్రమే చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ఈ ప్రాంతంలో దాడులు చేసి ఈ తరహా వ్యాపారాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేనిపక్షంలో ఎముకల వ్యాపారస్తులు బోడిగాడి తోటలోని మనుషుల ఎముకలను కూడా అతి త్వరలో మాయం చేసే ప్రమాదం లేకపోలేదు.

No comments: