నేడు నెల్లూరు

Sunday, April 4, 2010

జనార్దన్‌రెడ్డికి అన్న అయినందుకు తాను సిగ్గుపడుతున్నా : నేదురుమల్లి పద్మనాభరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో ఎన్‌బికెఆర్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్‌గా తనయుడు రామ్‌కుమార్‌రెడ్డిని నియమించి తమను వీధిన పడేశారని, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డికి అన్న అయినందుకు తాను సిగ్గుపడుతున్నానని ఎఐసిసి సభ్యులు, ఎన్‌బికెఆర్ విద్యాసంస్థల ఛైర్మన్ డాక్టర్ నేదురుమల్లి పద్మనాభరెడ్డి ధ్వజమెత్తారు.

చాటు మాటుగా ఉంటూ వెన్నుపోటు పొడిచి తనను వీధిన పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తాను ముఖ్యమంత్రిని కలిశానే కానీ స్వార్ధంతో కాదన్నారు. కళాశాల నిర్మాణంలో తాను ఒక తాపీ మేస్ర్తి లాగా పని చేశానన్నారు. విద్యా సంస్థలు తమకు కావాలని జనార్దన్‌రెడ్డి అడిగితే తానే వారికి ఇచ్చేవారినని చెప్పారు. ఇంజనీరింగ్‌ కళాశాలను రామ్‌కుమార్‌రెడ్డి దౌర్జన్యంగా లాక్కున్నారని ఇదేమి న్యాయమని జనార్దన్‌రెడ్డిని అడిగితే కుమారునితో మాట్లాడుకోమన్నారని చెప్పారు. తాను రామ్‌కుమార్‌రెడ్డి దగ్గరకెళ్లి చేతులు కట్టుకుని నిలబడాల్నా అని ప్రశ్నించారు. తమ చిన్నాన బాల కృష్ణారెడ్డి మహానుభావుడన్నారు.

నాడు దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌ కార్యక్రమాలకు తమ సొమ్మే ఖర్చు చేశామన్నారు. సొమ్ము నాది సోకు జనార్దన్‌రెడ్డిది అని ఎద్దేవా చేశారు. కనీసం జనార్దన్‌రెడ్డి జీవితచరిత్ర పుస్త్తకంలో కూడా తన పేరు ప్రస్తావించలేదని పద్మనాభరెడ్డి తన బాధను వ్యక్తం చేశారు. జనార్దన్‌రెడ్డిని దళితద్రోహిగా పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. తానొక దళితునికి పనిచేయడం తప్పా అని కాంగ్రెస్‌ పార్టీకి కృషి చేయడం తప్పా అని ప్రశ్నిస్తూ జనార్దన్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌పార్టీలో ఎన్నో పదవులు పొందుతూ రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతూ కూడా గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కృషి చేయడం తప్పు కాదా అని ప్రశ్నించారు. హరిజన విద్యార్ధి ఉద్దారక సంఘానికి తాను జీవిత కాలపు చైర్మన్‌అని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. తాను ఎక్కడ విద్యా సంస్థల కోసం న్యాయ పోరాటం చేస్తామో అని జనార్దన్‌రెడ్డి కుట్రతో కోర్టులో ముందుగానే కేవియట్‌ దాఖలు చేసి రామ్‌కుమార్‌రెడ్డి అక్రమంగా ఇంజనీరింగ్‌ కళాశాలను లాక్కున్నారన్నారు.

No comments: