నేడు నెల్లూరు

Friday, October 1, 2010

ఆస్తి వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే కురుగొండ్ల

వెంకటగిరి పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏటా నిర్వహించే పోలేరమ్మ జాతర జరుగుతున్న సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె (మొదటి భార్య కూతురు) కవిత తమకు ఆస్తి పంపకంలో అన్యాయం జరిగిందంటూ నిరసనకు దిగింది. వెంకటగిరిలోని ఎమ్మెల్యే ఇంటి ముందు ఆమె ధర్నాకు దిగడం ఈ సందర్భంగా చర్చనీయాంశమైంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు 1983లో కురుగొండ్ల రామకృష్ణకు వెంకటరత్నమ్మ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా 1993లో రామకృష్ణ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. 1996లో సింధు అనే మరో యువతితో రామకృష్ణకు వివాహమైంది.

వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మొదటి భార్య తల్లిదండ్రులు రామకృష్ణకు వివాహ సంద ర్భంలో అర ఎకరా పొలాన్ని (నాయుడుపేటలోని) రాసి ఇచ్చారు. విడాకులిచ్చే సమయంలో రామకృష్ణ ఆ అరెకరాలో మూడవ వంతు వారికి రాతపూర్వకంగా ఇస్తానని చెప్పినట్లు కవిత చెబుతోంది. అయితే ఈ విషయమై పలుసార్లు ఆయన చుట్టూ తిరిగినప్పటికీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఆయన ఎమ్మెల్యే కావడంతో అధికార, ధనబలంతో తమను లెక్కచేయకపోవడమే కాకుండా తమకు చెందాల్సిన ఆస్తిని ఇవ్వడం లేదని ఆమె ఆరోపిస్తోంది. ఈ విషయమై గురువారం ఆమె ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఎమ్మెల్యే ఆమెను ఇంట్లోకి పిలిపించారు. దీంతో మీడియా కూడా అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేవలం తనపై కొందరు కక్ష కట్టుకుని ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

తాను ఆస్తి వ్యవహారం ఎప్పుడో సెటిల్‌ చేసుకున్నానని, తాను రాసిచ్చాను అనడం సరికాదన్నారు. న్యాయపరంగా తాను రాసిచ్చినట్లు రుజువైతే తాను వారికి రూపాయి చెల్లించాల్సి ఉంటే రెట్టింపుగా రూ.2లుగా చెల్లిస్తానని చెప్పారు. వెంకటగిరి జాతర జరుగుతున్న సందర్భంగా ఇలాంటి చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదని, దీని వెనుక కుట్ర దాగివుందని చెప్పి ఆయన కారులో వెళ్లిపోయారు. దీంతో కవిత కారుకు అడ్డు తగలడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కవిత విలేకరులతో మాట్లాడుతూ మీడియా చూస్తుండగానే తన తండ్రి ప్రవర్తించిన తీరును గమనించాలని చెప్పింది. తమ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాను ఎంతవరకైనా పోరాడుతానని ఆమె పేర్కొంది.

No comments: