నేడు నెల్లూరు

Wednesday, October 6, 2010

రాజీవ్‌భవన్ నేతల ఆందోళన... ఇందిరాభవన్‌కు తాళాలు

పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షోకాజు నోటీసు జారీ చేస్తూ, ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గాంధీభవన్ నుంచి సమాచారం అందటంతో నెల్లూరులోని రాజీవ్‌భవన్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరాభవన్‌కు తాళాలు వేశారు. అనంతరం అక్కడకు చేరుకున్న పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓదార్పు యాత్రను విజయవంతం చేయాలనే బరువు బాధ్యతలను భుజాన వేసుకుని పనిచేస్తున్న తనకు అధిష్ఠానం షోకాజు జారీ చేయడం బాధాకరమన్నారు. తాను చేసిన తప్పేమీ లేదన్నారు. 25ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ ఎనలేని కృషి చేసిన తనపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో మంగళవారం జగన్ ఓదార్పు యాత్ర ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశానికి తాను హాజరయ్యానని, అదే సమయంలో గాంధీభవన్ నుంచి పిసిసి జనరల్ సెక్రటరీ రాపూరు ఆనంద్ భాస్కర్ వద్ద నుంచి వచ్చిన ఫోన్‌కాల్ ద్వారా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు తెలిసిందన్నారు. అధికారికంగా తనకు షోకాజ్ అందలేదన్నారు. ఉరిశిక్ష వేసే ఖైదీకి సైతం ఆఖరికోరిక అడుగుతారని, కానీ తనను మాత్రం వివరణ కోరకుండా ఏకపక్షంగా షోకాజు నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. తాను చేసిన తప్పులను చెప్పకుండా సభ్యత్వం నుంచి తొలగించడం దురదృష్టకరమన్నారు. తనకు ఇప్పటి వరకు ఉత్తర్వుల కాపీ అందలేదని, అందిన తర్వాత స్పందిస్తానని తెలిపారు. కేవలం వైఎస్ జగన్ చేపడుతున్న ఓదార్పుయాత్రకు మద్దతు పలికినందుకే తనను సస్పెండ్ చేశారని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో కుట్రలో జరుగుతుందన్నారు. ఇందిరాభవన్ నిర్మాణంలో తన వంతు కృషి చేశానని తెలిపారు. ఇందిరాభవన్‌ను కొందరు నాయకులు ఆక్రమణ చేస్తే, అప్పుడు తాను పోరాడానన్నారు. ఇక నుండి పార్టీకి, తనకు ఎటువంటి సంబంధం లేదని పిసిసి చీఫ్ డిఎస్ ద్వారా తెలుసుకున్న తర్వాత చాలా బాధ వేసిందన్నారు. కోటంరెడ్డిపై వేటు విషయం తెలిసిన రాజీవ్‌భవన్ నేతలు, మాజీ కార్పొరేటర్లు, జగన్ యువసేన నాయకులు రాజీవ్‌భవన్ నుంచి నల్లజెండాలతో ర్యాలీగా బయలుదేరి ఇందిరాభవన్‌కు చేరుకున్నారు. అనంతరం లోపల ఉన్న సిబ్బందిని బయటకు పంపించి, ఇందిరాభవన్ గేటుకు తాళాలు వేసి రోడ్డుపై బైఠాయించారు. షోకాజు నోటీసును వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇందిరాభవన్‌కు చేరుకుని కార్యకర్తలకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. దీంతో కార్యకర్తలు ముందుగా తాళాలు తీసేందుకు నిరాకరించినా తదుపరి తాళాలు తీశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ రూప్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ కనీసం వివరణ అడగకుండా కోటంరెడ్డిపై వేటు వేయడం దారుణమన్నారు. ఖచ్చితంగా వివరణ తెలపాలని, లేని యెడల ఉపేక్షించేది లేదన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి చీఫ్ డిఎస్, వీరప్ప మొయిలీపై అసభ్యంగా మాట్లాడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ప్రతి ఒక్కరిని వివరణ అడిగి సస్పెండ్ చేశారని, కానీ కోటంరెడ్డిని మాత్రం వివరణ అడగలేదన్నారు. ముందుగా ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో సస్పెన్షన్‌కు నిరసనగా గాంధీబొమ్మ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. బుధవారం మాగుంట లేఅవుట్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి జగన్ ఓదార్పు యాత్ర విజయవంతం కావాలని చేపడుతున్న పాదయాత్రను పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి సస్పెన్షన్‌తో వాయిదా వేసినట్లు మాజీ కార్పొరేటర్ తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు తాటి వెంకటేశ్వర్లు, నెల్లూరు మదన్‌మోహన్‌రెడ్డి, పి నాగరాజు, ఆనంద్, జయవర్ధన్, రమేష్, అద్దంకి జగన్ తదితరులు పాల్గొన్నారు.

No comments: