నేడు నెల్లూరు

Monday, October 4, 2010

సస్పెండ్ చేసినా భయపడం....కోటంరెడ్డి ధ్వజం

షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లకు భయపడేది లేదని, డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డికి షోకాజ్ నోటీసు జారీచేయడం దారుణమని పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి స్పష్టం చేశారు. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతిస్తున్న నాయకులను వేధిస్తూ కాంగ్రెస్ పార్టీ వినాశనానికి కంకణం కట్టుకున్న నాయకులను మాత్రం వదిలేస్తున్నారని దుయ్యబట్టారు. శనివారం స్థానిక రాజీవ్‌గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిసిసి చీఫ్ శ్రీనివాస్ రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని, టిడిపి, పిఆర్‌పికి వెళ్ళమని డిసిసి అధ్యక్షులు ఎల్లసిరి అనలేదన్నారు. ఓదార్పు యాత్ర కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందని, కార్యకర్తలు ఓదార్పు యాత్రలో పాల్గొనాలని మాత్రమే చెప్పారని అన్నారు. గోపాల్‌రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పు ఏముందని ఆయన ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొనాలని, వ్యక్తిగత యాత్రలో పాల్గొనవద్దని పిసిసి హెచ్చరించడం దారుణమన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్ వేసేందుకు వెళ్ళిన డిఎస్‌కు డిపాజిట్‌లు కూడా దక్కవని, ముఖ్యమంత్రి రోశయ్యను ఖబడ్దార్ అని, తెలంగాణా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీట్లు రాకపోతే స్వీట్లు పంపిణీ చేసిన వారిపై, వీరప్పమొయిలీపై అసభ్యంగా మాట్లాడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇవన్నీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు రావా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ కుటుంబాన్ని కొందరు నాయకులు విమర్శిస్తే షోకాజ్, సస్పెన్షను, డిస్మిస్‌లు ఏమీ ఉండవా అని అన్నారు. జగన్ వెంట నడిచిన నాయకులకు షోకాజ్‌లు ఇస్తూ పోతే, రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు శాశ్వత షోకాజ్ ఇస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎందుకు సర్వనాశనం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు రెండు కళ్లుగా ఉండాల్సిన పిసిసి చీఫ్ డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సమాధి కడుతున్నారో తెలియడం లేదన్నారు. కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ పట్ల అసభ్యంగా మాట్లాడితే డిఎస్‌కి కనపడలేదా అని అన్నారు. నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన నాయకులకు పదవులు ఇవ్వకుండా, ఊసరవెల్లిలా విమర్శలు చేస్తున్న తులసిరెడ్డికి పదవులు ఇవ్వడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే, డిఎస్, రోశయ్యకు ధైర్యం ఉంటే మొట్టమొదటి సారిగా కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి దగ్గుబాటి పురంధ్రేశ్వరికి వెంటనే షోకాజ్ నోటీసు ఇవ్వాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావడంలేదని మాట్లాడిన డిఎల్ రవీంద్రరెడ్డికి షోకాజ్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ గురించి నీచంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా సిఎం వారిని ప్రోత్సహించడం దారుణం అన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఒకటి, రెండు చోట్ల ఓదార్పు యాత్రలో పాల్గొంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. అనంతరం వైఎస్‌ఆర్ ఫార్మర్స్ ట్రస్టు చైర్మన్ మాద్దాలి శరణ్‌కుమార్ వైఎస్‌ఆర్ విగ్రహ ఏర్పాటుకు అయ్యే పూర్తి ఖర్చు తానే భరిస్తానని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అలాగే 42వ డివిజన్‌లోని సుబేదారుపేటలో సుమారు 100మంది యూత్ నాయకులు జగన్ యాత్రకు మద్దతు ఇస్తామని ముందుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అనిల్‌కుమార్‌యాదవ్, తాటి వెంకటేశ్వర్లు, తారీక్, పి నాగరాజు, నూరుద్దీన్, బాలాజి, వంశీ, ఉడతా ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

No comments: