నేడు నెల్లూరు

Wednesday, October 6, 2010

జగన్ వర్గానికి మరో ఝలక్

జగన్ ఓదార్పు యాత్ర పేరు మీద జిల్లా కాంగ్రెస్‌లో మరో నేతపై వేటు పడింది. ఈసారి నిబంధనలు సైతం బేఖాతరయ్యాయి. జగన్ ఓదార్పు యాత్రకు మద్దతు పలకడంతోపాటు పార్టీ నాయకులపై విమర్శలు చేసిన నెపంపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డిని పదవి నుండి, ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగిస్తూ పిసిసి నిర్ణయం తీసుకుంది. దీనితో జిల్లా కాంగ్రెస్‌లో కలకలం రేగింది. ఈ సంఘటన ఎలాంటి పరిణమాలకు దారితీస్తుందనేది సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. పార్టీ ప్రాథమిక సభ్యత్వం, పదవి నుండి తొలగించిన సమాచారాన్ని మంగళవారం వెంకటాచలం మండలం పర్యటనలో ఉన్న కోటంరెడ్డికి ఫోన్ ద్వారా పిసిసి సంయుక్త కార్యదర్శి రాపూరు ఆనంద భాస్కర్ తెలియ జేశారు. పిసిసి తీసుకున్న నిర్ణయంపై కోటంరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్యచరణపై వ్యూహం రూపకల్పనలో నిమగ్నమయ్యారు. అంతకుముందు డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డిపై షోకాజ్ నోటీసులు సంధించిన పిసిసి ఆయన్ను కూడా పార్టీ నుండి సాగనంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి ముందు లాంఛనాలన్నీ దాదాపు పూర్తి చేశారు. నేడో రేపో ఆయన విషయంలో నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్న తరుణంలో కోటంరెడ్డిపై చర్య తీసుకోవడం కలకలం సృష్టించింది. కోటంరెడ్డి విషయంలో పిసిసి కఠినంగానే వ్యవహరించడం వెనుక జిల్లాకు చెందిన బలమైన వర్గాల హస్తం ఉందని విమర్శలు వస్తున్నాయి. డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి, పిసిసి కార్యదర్శి కోటంరెడ్డి శ్రీ్థరరెడ్డి ఇద్దరూ జిల్లాను శాశించే స్థాయిలో ఉన్న రెండు ప్రధాన గ్రూపులకు దూరంగా రాజకీయం నడుపుతున్నారు. దీనితో రెండు వర్గాలకు కూడా శతృవులుగా మారారు. దీనితో ఇద్దరిపైనా ఒకరి తరువాత ఒకరిపై వేటు పడింది. డిసిసి అధ్యక్షుడు ఎల్లసిరిపై చర్య తీసుకునే విషయంలో నేదురుమల్లి జనార్దనరెడ్డి, అలాగే కోటంరెడ్డి విషయంలో ఆనం వర్గం వత్తిడి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కోటంరెడ్డిపై వేటు విషయంపై స్పందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడిన తీరు ఇందుకు బలం చేకూర్చుతోంది. ఇదిలావుండగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర నుండి అంతర్గత వైరం ఉన్న నేదురుమల్లి సహజంగానే జగన్ విషయంలో దూరంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత విధేయులుగా ఉన్న ఆనం వివేకానందరెడ్డి ఆయన తనయుడు జగన్ విషయంలో తేడాగా వ్యవహరించడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయింది. కాగా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఆనం వివేకానందరెడ్డి, నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్లినపుడల్లా జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఓ నాయకుడిపై వేటు పడుతోందనే ప్రచారం జరగడం విశేషం.

No comments: