నేడు నెల్లూరు

Tuesday, October 5, 2010

నెల్లూరు నగరాని ఊరిస్తున్న విమానాశ్రయం

నేటి యాంత్రిక యుగానికి తగ్గట్టుగా సమాజం అడుగులేస్తోంది. కాలంతోపాటు మనిషి పడుగెడుతున్నాడు. వేగంగా గమ్య స్థానాలకు చేరాలని ప్రతిఒక్కరూ ఉబలాటపడుతుంటారు. ఇప్పటివరకు జిల్లా ప్రజలు రోడ్డు, రైలు మార్గాల ద్వారానే ప్రయాణిస్తున్నారు. అయితే కొంతకాలంగా విమానయానం జిల్లా వాసులను ఊరడిస్తున్నది. అదిగో...అక్కడ.. ఇదిగో..ఇక్కడ విమానాశ్రయం...అంటూ నేతలు ఆశచూపారు. చివరకు జనం ఆశలను వమ్ముచేశారు. ఈ క్రమంలో ఇటీవల తిరుపతి ఎంపీ చింతా మోహన్ నెల్లూరు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీన్ని వెంకటాచలం సమీపంలో నిర్మించాలని కేంద్ర పౌర విమానాయాన శాఖ అధికారులను కలిసి అభ్యర్థించారు. త్వరలో అధికారులు స్థలపరిశీలనకు రానున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నెల్లూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరినట్లే.

పారిశ్రామికంగా పరుగులు
కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు నుంచి నెల్లూరు నగరానికి మహర్దశ పట్టింది. లక్ష కోట్లతో వివిధ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. దీంతోపాటు చిన్న తరహా పరిశ్రమలు కూడా భారీ సంఖ్యలోనే వస్తున్నాయి. ఈ పరిశ్రమల ఆధారంగా నెల్లూరు నగరంలో నెలకు సుమారు రూ. 50 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు సాగనున్నాయి. అపార్ట్‌మెంట్స్, మొబైల్ రంగం ఇతరత్రా వ్యాపారాలన్నీ పుంజుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. పారిశ్రామిక వేత్తలు తరచూ నెల్లూరుకు విచ్చేసి పరిశ్రమల ఏర్పాటుపై చర్చించి పురోగతిని పరిశీలిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం 150 కి.మీ దూరంలో ఉన్న తిరుపతి విమానాశ్రయం నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. మూడు గంటల పాటు ప్రయాణించి విమానాశ్రయానికి చేరుకోవడం పారిశ్రామిక వేత్తలకు చాలా ఇబ్బందిగా మారుతోంది.

దీంతోపాటు జిల్లా రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైంది. జిల్లా నుంచి ఎందరో నేతలు ఇతరచోట్ల్ల ఎంపీలుగా చలామణి అవుతున్నారు. ముఖ్యమంత్రి పదవులు నిర్వహించిన వారూ జిల్లాలో ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు తరచూ హైదరాబాద్, ఢిల్లీలకు వెళ్లాలంటే విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న నెల్లూరు నగరానికి విమానాశ్రయం లేకపోవడం జిల్లావాసులు తీవ్ర నిరాశతో ఉన్నారు. రోడ్డు, రైల్వే మార్గాలు అనుకూలంగా ఉన్నా, గంటల కొద్ది ప్రయాణించాల్సి రావడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

ఎంవోయూ ఒప్పందం రద్దు
2008లో దగదర్తి మండలం దామవరం వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు సన్నాహాలు జరిగాయి. రూ. 10వేల కోట్లతో నిర్మించే కిసాన్‌సెజ్ ఆధారంగా ఈ విమానాశ్రయాన్ని నెలకొల్పాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. పాడి, మత్స్య, వ్యవసాయ పరిశోధన తదితర వాటిని ఈ సెజ్‌లో ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున భూసేకరణ చేశారు. దామవరం వద్ద విమానాశ్రయానికి రెండువేల ఎకరాల భూమి కూడా కేటాయించారు. మహారాష్ట్ర ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్ కంపెనీ ముందుకు వచ్చి ఇక్కడ విమానాశ్రయం నెలకొల్పాలని ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) చేసుకుంది. కాని ఎంతకీ ఈ సంస్థ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఈ ఏడాది జూన్ 22న ఈ ఎంవోయూను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నెల్లూరుకు విమాన సౌకర్యం లేదని ప్రజలు నిరాశ పడ్డారు.

'చింతా' ప్రకటనతో చిగురించిన ఆశలు
కృష్ణపట్నం పోర్టు, మన్నవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నెల్లూరు సమీపంలో మినీ విమానాశ్రయం ఏర్పాటు అవసరం ఉందని తిరుపతి ఎంపీ చింతా మోహన్ ఇటీవల ప్రకటించారు. వెంకటాచలం సమీపంలోనే ఈ మినీ విమానాశ్రయం నెలకొల్పేందుకు ఇప్పటికే ఆయన కేంద్ర పౌర విమానాయాన శాఖ అధికారులతో చర్చలు జరిపామని చెప్పారు. సా«ధ్యసాధ్యాలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించగా, త్వరలో ఓ బృందం నెల్లూరుకు వచ్చి పరిశీలించి వెళ్లనున్నట్లు సమాచారం.

No comments: