నేడు నెల్లూరు

Saturday, October 16, 2010

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మెరుగుపర్చాలి : వెంకయ్యనాయుడు

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత మెరుగుపర్చాలని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు డిమాం డ్ చేశారు. "దేశ పటిష్ఠతకు, రాజకీయ స్థిరత్వానికి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు, అవినీతి అక్రమాల నియంత్రణకు.. ఫిరాయింపుల నిరోధక చట్టానికి పదును పెట్టడం అవసరం'' అన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు.. సభ్యత్వం కోల్పోయే పరిస్థితి రావాలన్నారు.

ఆయన శుక్రవారం ఇక్కడ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సీనియర్ నేతలు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, రామచందర్‌రావు, ఆచారిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ సీఎం యడ్యూరప్ప రెండుసార్లు విశ్వాస పరీక్షలో నెగ్గడం, గుజరాత్‌లో బీజేపీ సర్కారు కార్పొరేషన్ ఎన్నికల్లో ఆరు చోట్ల 80%కు పైగా సీట్లు, ఓట్లు సాధించటంపై వెంకయ్య సంతోషాన్ని వ్యక్తంచేశారు.

కర్ణాటకలో రాజ్‌భవన్‌ను గవర్నర్ కాంగ్రెస్ భవన్‌గా మార్చారని ఆరోపించారు. కర్ణాటక గవర్నర్ భరద్వాజ్ రాజకీయవాదిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ జీర్ణించుకోలేదని, కర్ణాటక ప్రభుత్వం మైనింగ్ ఎగుమతులను నిషేధించటంతో కంగుతిన్న అక్రమ మైనింగ్ బడా వ్యాపారులు ప్రభుత్వాన్ని అస్థిరపర్చే యత్నం చేశారని చెప్పారు.

ఇంత జరిగినా, పొరపాటు తెలుసుకోకుండా.. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలతో గవర్నర్ రహస్యంగా సమావేశమై కోర్టు తీర్పు వచ్చే 18 వరకు వేచి చూడాలని చెప్పినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ 9 మంది ఎమ్మెల్యేలు విపక్షం వైపు వెళ్తే కాంగ్రెస్ గమ్మున ఎలా ఉంటుందని ప్రశ్నించారు. "మెజార్టీ సభ్యుల అభిప్రాయాన్ని కాదని.. కేవలం పదిమంది చెబితే నాయకత్వాన్ని మారుస్తారా? ఇక్కడ కూడా రోశయ్య వద్దని కొందరు ఎమ్మెల్యేలంటే సీఎంను కాంగ్రెస్ దించేస్తుందా?'' అని ప్రశ్నించారు.

అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా చూస్తామని చెబుతున్న కర్ణాటక గవర్నర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గాలి జనార్థన్‌రెడ్డి ఒకవేళ మైనింగ్ అక్రమాలకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని వెంకయ్య ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. కర్ణాటక వ్యవహారాల నుంచి బీజేపీ కూడా కొంత నేర్చుకోవాల్సి ఉందని వెంకయ్య ఒప్పుకొన్నారు.

No comments: