నేడు నెల్లూరు

Friday, October 8, 2010

మాజీల జోరు..జనం బేజారు!

కార్పొరేషన్‌లో పాలకుల పదవీ కాలం పూర్తయినా అధికారులపై పెత్తనం మాత్రం ఎక్కడా తగ్గినట్లు కనిపించడం లేదు. మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ పేరు చెప్పుకుని అధికార పార్టీకి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు కార్పొరేషన్‌లో దందా సాగిస్తున్నారు. అధికారులను బెదిరించి పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వివాదాలు మొదలవుతున్నాయి. పాలకవర్గం పదవీ కాలం గత నెల 29వ తేదీన పూర్తయిన విషయం తెలిసిందే. కానీ అధికార పార్టీకి చెందిన కొందరు మాజీ కార్పొరేటర్లు మాత్రం ఆ విషయాన్ని మరిచిపోయి తాము అధికారంలో ఉన్నట్లుగానే దర్జా వెలగబెడుతున్నారు. అధికారంలో ఉండగా కార్పొరేషన్ ముఖం చూడని కార్పొరేటర్లు ఇప్పుడు ప్రతి రోజూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులతో సమానంగా అనధికారికంగా విధులకు హాజరవుతున్నారు. వీరందరి చేతుల్లో ఎం బుక్కులు, వర్క్ ఆర్డర్లు, అక్రమ లేఔట్ల నమూనాలు, అపార్టుమెంట్ల ప్రణాళిక అనుమతులకు సంబంధించిన పత్రాలు కనిపిస్తున్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, మాజీ మేయర్ భానుశ్రీ పేరు చెప్పి అధికారులపై వత్తిడి చేస్తున్నారు. గతంలొ వేరే వారు ప్రాతినథ్యం వహించిన డివిజన్లలోనూ ఆధిపత్యం చెలాయంచేందుకు ప్రయత్నిస్తున్నారు. గురువారం జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. మాజీ మేయర్ భానుశ్రీ పేరు చెప్పి ఓ మాజీ కార్పొరేటర్ 27వ డివిజన్‌లో గురువారం గందరోగళం సృష్టించారు. ఈ డివిజన్‌లో ఓ వ్యక్తి వెల్డింగ్ షాపు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ఓ గది నిర్మించుకున్నాడు. దీనికి ముందు కూడా అనేక నిర్మాణాలు జరిగాయి. ఆక్రమణలు పెరగకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని రెండేళ్ల క్రితం అప్పటి కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి నగర ప్రణాళికాధికారులకు సూచించారు. అధికారులు పట్టించుకోలేదు. అకస్మాత్తుగా గురువారం సదరు మాజీ కార్పొరేటర్ ఒత్తిడితో సిటీ ప్లానర్ తనిఖీల పేరుతో గురువారం వెల్డింగ్ షాపును తొలగించడానికి సిద్ధమయ్యారు. నిన్నటి వరకు ఈ డివిజన్‌కు కార్పొరేటర్‌గా ప్రాతినిథ్యం వహించిన బాధ్యతతో ఆయన రంగంలోకి దిగారు. తాను ప్రాతినిథ్యం వహించిన ప్రాంతంలో పక్షపాత వైఖరి అవలంబిస్తే చూస్తూ ఊరుకోలేనని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్రమణలు తొలగిస్తే మొత్తం తొలగించాలని కేవలం కొందరి మెప్పుకోసం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ఉద్యమిస్తానని హెచ్చరించారు. దీనితో ఆ అధికారి వెనుతిరిగి వెళ్లారు. ఇవి బయట పడని సంఘటనలు మాత్రమే. ఇది బయట పడిన సంఘటన మాత్రమే. వెలుగులోకి రాని ఇలాంటివి చాలా జరుగుతున్నట్టు కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. కొందరు మాజీ కార్పొరేటర్లు పనిగట్టుకుని అధికారులను బెదిరిస్తూ అమాయకులకు అన్యాయం చేస్తున్నారని, కార్పొరేషన్‌ను దొడ్డిదారిలో దోచుకుతింటున్నారని చెబుతున్నారు.

No comments: