నేడు నెల్లూరు

Friday, October 1, 2010

ఓదార్పులో పాల్గొంటా : నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి

వ్యక్తిగత హోదాలోనే నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్రలో పాల్గొంటానని నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు ఎల్లసిరి గోపాలరెడ్డి స్పష్టం చేశారు. పార్టీ బలోపేతమయ్యే ఏ కార్యక్రమంలోనైనా విధిగా తాను పాల్గొంటానన్నారు. ఓదార్పు అవసరమని అధిష్టానమే గుర్తించిందని, అందుకే ఏఐసీసీ తరఫున వైఎస్ మరణానంతరం చనిపోయినవారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వడానికి నిర్ణయించిందని వివరించారు. పార్టీ చేపట్టబోయే ఓదార్పును కూడా జగన్‌తో కలిసి చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం గాంధీభవన్‌లో డీసీసీ, నగర కాంగ్రెస్ అధ్యక్షులతో జరిగిన సమావేశానికి హాజరైన ఎల్లసిరి మీడియాతో మాట్లాడారు. ఓదార్పుయాత్రలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చినందుకు పీసీసీ నుంచి గతంలో మీకు షోకాజ్ ఇచ్చారు కదా అని విలేకరులు ప్రశ్నించగా, వివరణ మాత్రమే కోరారని ఎల్లసిరి తెలిపారు. వ్యక్తిగత హోదాలోనే అప్పుడు పార్టీ నేతలను కోరానని పీసీసీకి వివరించానని చెప్పారు. ఓదార్పుయాత్రతో పార్టీకి బలం చేకూరుతుందన్నారు. 2014లో సోనియాగాంధీ నేతృత్వంలో కేంద్రంలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడానికి దోహదపడుతుందని, రాష్ట్రంనుంచి ఎక్కువ ఎంపీ స్థానాలు పార్టీ గెలుచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ కుటుంబం లేకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవడం ఎంత కష్టమో రాష్ట్రంలో వైఎస్ కుటుంబం లేని కాంగ్రెస్ కూడా అంతేనని ఆయన విశ్లేషించారు. తమ ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు జగన్‌లో చూసుకుంటున్నారని వివరించారు.

No comments: