నేడు నెల్లూరు

Tuesday, October 5, 2010

మంత్రి పదవి కోసం.. ఎవరి ఎత్తులు వారివి

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందో లేదోగాని జిల్లా నుండి మాత్రం కేబినెట్‌లో బెర్తు సాధించే విషయంలో కొత్తకొత్త వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. గ్రూపు రాజకీయాల్లో ఆధిపత్య పోరుకు మంత్రి వర్గ విస్తరణ కూడా ఒక ఆయుధంగా మారింది. రోశయ్య ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఆనం వర్గం విషయంలో పైచేయి సాధించడం కోసం సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆనం వర్గాన్ని నిలువరించడమే ధ్యేయంగా చేస్తున్న ప్రయత్నం కావడంతో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి కూడా ఆయనకు మద్దతు పలికారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆదాల తన నియోజకవర్గంలో కన్నా రాజధానిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. విస్తరణ జరిగితే బెర్తు ఖాయమని ఆదాల వర్గం భావిస్తోంది. అయితే పలుసార్లు విస్తరణ జరుగుతుందనే వాతావరణం కనిపించినా ఆచరణలోకి రాకపోవడం ఆదాల వర్గాన్ని అసహనానికి గురి చేస్తోంది. ఆదాల మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అన్ని శక్తులను సమీకరించుకుని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇదిలావుండగా ఇప్పటి వరకు అధిష్టానం వద్ద పట్టు నిలుపుకోవడమే ధ్యేయంగా జాగ్రత్తలు తీసుకున్న ఆనం వర్గం తమ పరిస్థితి కుదుటపడినట్లు కనిపించడంతో పావులు కదపడం ప్రారంభించారు. జిల్లాకు మరో మంత్రి పదవి మంజూరయితే దానిని ఆదాలకు దక్కకుండా చేయాలని ఆనం వర్గం వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగానే కేవలం నాలుగునెలల్లో పదవీ కాలం ముగియననున్న ఎమ్మెల్యే బూదాటి రాధయ్యను తెరపైకి తెచ్చేందుకు బహుముఖ ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఆయన పదవీకాలం కేవలం 4 నెలలే ఉన్నప్పటికీ ఐఎన్‌టియుసి నేతగా ఉన్నత స్థాయిలో ఉన్న పలుకుబడితో మళ్లీ నామినేట్ చేయించుకుంటారనే ధీమాతో ఆనం వర్గం ఈ ప్రతిపాదన చేస్తున్నట్లు తెలుస్తోంది. బిసి కులానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రచారం చేయడం ద్వారా రాజీవ్ భవన్ నేతలను కంగు తినిపించడంతోపాటు ఆదాలకు చెక్ పెట్టేందుకు ఇదో మార్గంగా ఆనం వర్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆశీస్సులు ఉన్న రాధయ్య అవసరమైతే రీ నామినేట్ చేయించుకోగలరని ఆనం వర్గం భావిస్తోంది. రెండు రోజుల క్రితం ఇందిరాభవన్‌లో జరిగిన మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సదస్సుకు బూదాటి సారద్ధ్యం వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఆహ్వానించడం, ఆయన హాజరు కావడం ఈ కొత్త వాదనకు బలం చేకూరుతోంది.

No comments: