నేడు నెల్లూరు

Wednesday, October 6, 2010

జగన్‌కు మద్దతు ఇస్తే సస్పెండ్ చేస్తారా?


షోకాజ్ ఇవ్వకుండానే చర్యలు సబబా?
నెల్లూరులో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి తాళం
కార్యకర్తలను శాంతింపజేసి తాళాలు తెరిచిన శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు, న్యూస్‌లైన్ : యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించనున్న ఓదార్పుయాత్రకు మద్దతు పలికినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేయడం తగదని పీసీసీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పీసీసీ ప్రకటించిన అనంతరం ఆయన మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌లను తీవ్రంగా విమర్శించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా పార్టీ కోసం పనిచేస్తున్న తమపై సస్పెన్షన్ వేటు వేయడం ఎంతవరకూ సబబని ఆయన ప్రశ్నించారు. మరణ శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక కోరడం మన సంప్రదాయంకాగా, తనకు కేవలం ఫోన్ కాల్‌తో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడం తగదన్నారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తాను వ్యాఖ్యలు చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్ష విధించినా గాంధీభవన్ మెట్ల వద్ద స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. వైఎస్ చూపిన ప్రేమాభిమానాలవల్లనే చేరువయ్యానని, ఎలాంటి పదవీ పొందలేదని తెలిపారు. తాను జీవితాంతం వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ నిర్దేశకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డేనని తెలిపారు. సస్పెన్షన్ ఉత్తర్వులు అందిన తర్వాత పూర్తి స్థాయిలో స్పందిస్తానని చెప్పారు.

నెల్లూరులో నిరసనలు.. ఆందోళనలు

పీసీసీ కార్యదర్శి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న సమాచారం తెలియడంతో నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు రాజీవ్‌గాంధీ భవన్‌కు చేరుకుని కోటంరెడ్డికి తమ సంఘీభావం తెలిపారు. అక్కడ నుంచి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన ఇందిరా భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ఇందిరా భవన్‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి కోటంరెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని నినాదాలు చేశారు. కోటంరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసేంత వరకూ తాళాలు తీయబోమని స్పష్టం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని కార్యకర్తలను ఆందోళన విరమించాలని కోరారు. అనంతరం ఇందిరాభవన్ తాళాలను కోటంరెడ్డి స్వయంగా తీశారు.

సస్పెండ్ చేసినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు: చేవూరు శ్రీధర్‌రెడ్డి

పార్టీ ప్రయోజనాల కోసం పాటు పడుతున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డిలపై చర్యలు తీసుకోవడం వల్ల ఒరిగేదీ ఏమీ లేదని వైఎస్సార్ ఆశయ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు చేవూరు శ్రీధర్‌రెడ్డి చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొం టున్న నాయకులను బేబీలుగా ఎమ్మెల్యే వివేకానందరెడ్డి పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు

No comments: