నేడు నెల్లూరు

Friday, October 8, 2010

ఆనం చెప్పిన మాటలు నేడు ఏమైనాయి : కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

యువనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయకపోతే రాజీనామా చేసే ఎమ్మెల్యేల్లో మొదటి సంతకం తనదే అవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని కాంగ్రెస్ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడారు. జగన్‌ను సీఎం చేయకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని చెప్పిన వివేకా, ప్రస్తుతం మాట మారుస్తున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీకి కోటంరెడ్డి ఏనాడూ పని చేయలేదని వివేకా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. 14 నెలల ముందు కార్పొరేటర్‌గా డాక్టర్ అనిల్ విజయం సాధించినపుడు ఇందిరా భవన్‌లో వివేకా చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. శ్రీధర్‌రెడ్డి లాంటి ఉద్యమాల పోరాట వీరుడు, వ్యూహకర్త జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేరని వివేకా చెప్పారన్నారు. ఇలాంటి నాయకుడు దొరకడు... ఆయన ఉండటం కాంగ్రెస్ పార్టీ అదృష్టం.. ఆయనను ప్రతి కార్యకర్త స్ఫూర్తిగా తీసుకోవాలి.. అని వివేకా నాడు చెప్పారన్నారు. ఆ మాటలు మరచిపోయి ప్రస్తుతం తన వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టమని చెప్పడం విడ్డూరంగా ఉందని శ్రీధర్‌రెడ్డి చెప్పారు.

ఎవరు మాటలు మారుస్తున్నారనే విషయాన్ని ప్రజలు బాగా గమనిస్తున్నారన్నారు. పార్టీకి ఎవరి వల్ల నష్టం జరుగుతుందనే విషయాన్ని కార్యకర్తలే చెబుతారన్నారు. తమ తండ్రులు, తాతలు ఎవరూ మంత్రులు కారని... మధ్య తరగతి నుంచి తాను రాజకీయాల్లోకి వచ్చానని కోటంరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసమే తాను పాటుపడుతున్నానని చెప్పారు. ప్రస్తుతం జిల్లా ప్రజలు జగన్ రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారన్నారు. ఆయన యాత్ర విజయవంతమవుతుందని చెప్పారు.

No comments: